Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బానిసత్వ నిర్మూలనే డార్విన్ ఆశయం

బానిసత్వ నిర్మూలనే డార్విన్ ఆశయం
మానవజాతికి మూలం వానర(కోతి) జాతే అని శాస్త్రీయంగా నిరూపించిన బ్రిటీష్ జీవ శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్‌. "బానిసత్వ నిర్మూలన" అన్న అంశమే ఆయనను అంతటి మహోన్నతమైన అధ్యయనానికి పురిగొల్పిందన్న సంగతిని ఆధారాలతో సహా విప్పి చెబుతోంది "డార్విన్ సేక్రెడ్ కాజ్" అనే పుస్తకం.

ఆడ్రియన్ డెస్మండ్, జేమ్స్ మూర్ అనే శాస్త్ర చరిత్రకారులు రాసిన ఈ "డార్విన్ సేక్రెడ్ కాజ్" అనే పుస్తకంలో డార్విన్ సిద్ధాంతంపై ఇప్పటిదాకా వెలుగుచూడని అనేక ఆసక్తికర అంశాలను తడిమారు. ఇందులో, మానవులంతా సమానమేనని, బానిసత్వం సహజమేనని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని, ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడి చేసేందుకే డార్విన్... మానవ పరిణామంపై అధ్యయనం మొదలు పెట్టాడని రచయితలు తెలిపారు.

కట్టు బానిసత్వాన్ని తీవ్రంగా ద్వేషించే డార్విన్.. దాన్ని సమూలంగా కూలదోసే పనికి దోహదపడాలనే పరిణామవాదాన్ని ఆవిష్కరించాడని రయిచతలు డెస్మండ్, మూర్‌లు ఈ పుస్తకంలో వెల్లడించారు. డార్విన్ వ్యక్తిగత పత్రాలు, లేఖల్లో ఇందుకు అనేక సాక్ష్యాధారాలున్నాయని వారు తెలిపారు.

బ్రెజిల్ పర్యటన తరువాత 1832 జూలై 3న డార్విన్ తన నోట్‌బుక్‌లో "బ్రెజిల్‌లోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ అక్కడి బానిసత్వంపై ఆసక్తి కలుగుతుంది. బానిసలు వారి హక్కుల గురించి తెలుసుకుని, తమ శత్రువులపై ప్రతీకారాన్ని మరచిపోయే రోజు ఒకటి వస్తుందని ఆశిస్తున్నాను" అని రాసుకున్నట్లు రచయితలు పేర్కొన్నారు.

అంతేగాకుండా... "హెచ్ ఎంఎస్ బీగల్" నౌకలో జరిపిన ఐదేళ్ల ప్రయాణంలో... దక్షిణ అమెరికాలో తాను చూసిన బానిసల వ్యథలను డార్విన్ తన నోటు పుస్తకాలలో రాసుకున్నాడని రచయితలు ఈ పుస్తకంలో తెలిపారు. డార్విన్ బానిసత్వ వ్యతిరేకి అని ఇప్పటికే తెలిసినప్పటికీ, తాజా ఆధారాలను బట్టి ఆయన బానిసత్వాన్ని విపరీతంగా ద్వేషించేవాడని వారంటున్నారు.

మానవులందరూ ఒకే జాతి వారనే సత్యంపై డార్విన్‌కు ఉన్న అపారమైన ప్రేమే ఆయనను తన కాలం నాటికి ఎవరూ పట్టించుకోని.. పరిణామ అంశంపై దృష్టి సారించేలా చేసిందని "డార్విన్ సేక్రెడ్ కాజ్" రచయితలు డెస్మండ్, మూర్‌లు అంటున్నారు. బానిసత్వాన్ని నిరసించిన డార్విన్ కుటుంబ సభ్యులు కూడా తమ అభిప్రాయానికి మద్ధతునిచ్చారని వారు స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu