Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దూరాలను మరిపించే "మహాయాత్రికులు"

దూరాలను మరిపించే

Raju

, శనివారం, 30 ఆగస్టు 2008 (19:34 IST)
ప్రవర వరూధినిల కథ గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. నిత్యాగ్నిహోత్రుడు, నిరతాన్నదానపరుడు, మాతాపిత సేవ తప్ప అన్యమెరుగనివాడు అయిన ప్రవరుడు జీవితంలో ఒకసారి అయినా హిమాలయాలకు వెళ్లి హిమవన్నగ సౌందర్యాన్ని కనులారా చూసి జన్మ తరింపచేసుకోవాలనుకుంటాడు.

ఆతిథ్యం స్వీకరించటానికి ఇంటికి వచ్చిన సిద్ధుడికి తన చిరకాల వాంఛ గురించి చెప్పి ఎలాగైనా పుణ్యం కట్టుకోమంటాడు. ప్రవరుడి ఆతిథ్యానికి, సేవాభావానికి మెచ్చిన సిద్ధుడు కాలి పసరు ప్రసాదించి దాన్ని పూసుకుని ఎక్కడికి పోవాలంటే అక్కడికి ఎగిరి పోవచ్చని చెప్పి వెళ్లిపోతాడు.

ఆ కాలి పసరు పూసుకుని జీవితకాల వాంఛను నెరవేర్చుకోవాలని అఘమేఘాల మీద బయలుదేరిన ప్రవరుడు హిమాలయాలపై అడుగుపెట్టి పరమానందభరితుడై నడుస్తూండగా మంచు ప్రభావానికి పసరు కరిగిపోతుంది. తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వెళ్లాలనుకుంటే పసరు ప్రభావం పనిచేయదు.

విచారపడుతూ దిక్కులు చూస్తున్న ప్రవరుడికి వరూధిని కనబడటం, నవ యవ్వన బ్రాహ్మణుడిపై మరులు గొని అతడిని కవ్వించడం, పరస్త్రీ తల్లితో సమానమని ప్రవరుడు తిరస్కరించి తాను ఇన్నాళ్లుగా చేసిన జపతపాదుల ప్రభావంతో నివాసానికి ఎగిరిపోవడం, వరూధినిపై ఎన్నాళ్లనుంచో మరులుగొని ఉన్న గంధర్వుడు మాయా ప్రవరుడి వేషధారణతో వరూధినిని భ్రమింపజేసి... కామించి...

తర్వాత అదో కథ...

ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే యాత్రల పట్ల మనిషి వెంపర్లాట పూర్వకాలం నుంచి కొనసాగుతోందని చెప్పడానికి ఈ కథ ప్రస్తావించవలసి వచ్చింది. ఇప్పుడంటే మనుషులు ఇల్లు, పనిస్థలం తప్పించి కూపస్థ మండూకాల్లాగా తయారై చరిత్రకు సంబంధించిన ఏ జిజ్ఞాస కూడా లేకుండా ఉంటున్నారు కాని చేతిలో సంచి, మంచినీటికి తాబేటి కాయ, ఊతానికి చేతికర్ర అందుకుని కానరాని తీరాలకు నడక మొదలెట్టేవారు. గుర్రాలెక్కి మైదానాల్లో దౌడు తీసేవాళ్లు, గాడిద సవారీతో నీటి చుక్క కానిరాని ఎడారుల అంతు చూసేవాళ్లు, మహా సముద్రాలను మదించి క్రొంగొత్త తీరాలను వెలికి తీసే ఘనకార్యాలకు జీవితాలనే ఫణంగా పెట్టేవాళ్లు..

ఇలాంటి అరుదైనా మహా యాత్రికుల విశేషాలను వివరించి ఇప్పటి మనుషుల కళ్లు తెరిపించే ఉద్దేసంతోటే కాబోలు ఆదినారాయణ అనే యాత్రా ప్రేమికుడు తెలుగులో ఒక అరుదైన, అద్భుతమైన పుస్తకం రాశారు. మొత్తం 24 మంది ప్రపంచ మహాయాత్రికుల జీవితాలను వారి యాత్రానుభవాలను పూసగుచ్చినట్లు మనందరి అనుభవంలోకి తెచ్చి ఔరా అనిపించారు.

తరతరాలుగా అరేబియా, జపాన్, టిబెట్, నైలునది ఒడ్డు, దక్షిణ ధ్రువపు మంచు శిలలు, పసిఫిక్ సముద్రపు అగాథాలు ఇలా మనిషి చొరబడలేని అనంత తీరాలకేసి సాగిపోయి చారిత్రక అన్వేషణలు గావించిన ఆ మహాయాత్రికులను మన స్మృతిపథంలోకి తెచ్చి అలా వదిలిపెట్టారు. మార్కోపోలో, రాహుల్ సాంకృత్యాయన్, డేవిడ్ థోరో, విల్‌ఫ్రెడ్ థెసిగర్, ఏనుగుల వీరాస్వామి ఇలా భయమంటే ఎరుగని సాహసవీరులను, యాత్రా వైతాళికులను ఆదినారాయణ ఈ పుస్తకం ద్వారా మన కళ్లకు కట్టించారు.

మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల క్రితం పాదాల బలిమితో ఇంత అనంత దూరాలు ఎలా తిరిగారో, భయానకమైన అడ్డంకులు, అంతరాయాలను అధిగమిస్తూ భూమిని ఎలా చుట్టివచ్చారో తెలుసుకోవడానికి మహాయాత్రికులు పేరుతో ఆదినారాయణ రాసిన ఈ మహత్తర పుస్తకాన్ని చదవాల్సిందే మరి. ఆంధ్రదేశంలోని అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలలో లభించే ఈ పుస్తకం పుటలు 330. కాగా ధర రూ.150

Share this Story:

Follow Webdunia telugu