వేసవిలో ఆలివ్ చేసే మేలు..!!
, గురువారం, 12 ఏప్రియల్ 2012 (10:47 IST)
తాజా చర్మం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. మేని సౌందర్యాన్ని పొందాలంటే ఆలివ్‌నూనెను మించిన పరిష్కారం లేదంటున్నారు నిపుణులు.* పొడిబారిన చర్మతత్వం ఉన్నవారు ప్యాక్ వేసుకుంటుంటే దాని తాయారీలో నాలుగైదు చుక్కల ఆలివ్‌నూనెను వేస్తే చర్మం ఎక్కువ సమయం తాజాగా కనిపిస్తుంది.* టేబుల్ స్పూను తేనెలో రెండు చెంచాల పాలు, కొన్ని చుక్కల ఆలివ్‌నూనె కలిపి ముఖం, మెడ భాగానికి రాసుకొని, పదిహేను నిమిషాలయ్యాక చల్లని నీటితో కడిగితే ముఖం మృదువుగా మారుతుంది.* గోళ్లు ఆరోగ్యంగా మారాలంటే కప్పు ఆలివ్‌నూనెను తీసుకుని అందులో వేళ్లు మునిగేలా ఉంచండి. మరకలు పడిన గోళ్లు, వేళ్లకు మాత్రం అలివ్‌నూనెలో కొన్నిచుక్కల నిమ్మరసం కూడా కలపాలి. ఆ నూనెతో ప్రతిరోజూ మర్దన చేసుకున్నా కూడా సరిపోతుంది.* కొద్దిగా నూనెను తీసుకుని తలకు రాసుకోవాలి. మునివేళ్లతో నెమ్మదిగా మర్దన చేయాలి. ఆ తరువాత మరికాస్త నూనెను జుట్టు చివర్లకు పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేస్తే జీవం ఉట్టిపడుతూ ఒత్తైన కురులు మీ సొంతమవుతుంది.* రెండు కోడిగుడ్ల పచ్చసొనను తీసుకుని బాగా గిలక్కొట్టాలి. అందులో రెండు చెంచాల ఆలివ్ నూనె కలిపి తలకు రాసుకొని అరగంటయ్యాక కడిగేసుకుంటే జుట్టుకు పోషణ అంది, జుట్టు నిగనిగలాడుతూ పట్టుకుచ్చులా మారుతుంది.* స్నానం చేసే నీటిలో రెండు చెంచాల ఆలివ్‌నూనెను వేసుకున్నా కూడా చర్మం పరిమళభరితం కావడమే కాదు, మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.* వేసవికాలం అంటే చాలు పెదవులు పొడిబారే సమస్య తప్పదు. దీన్ని నివారించాలంటే, లిప్‌బామ్‌కు బదులుగా ఈసారి ఆలివ్‌నూనెను రాసి చూడండి. ఎక్కువ సమయం తాజాదనంతో పాటు పెదవులపై ఉండే మృతచర్మమూ తొలగి పెదవుల్లో గులాబీలు విరబూస్తాయి.* కళ్ల చివరన ముడతలు కనిపిస్తుంటే చెంచా ఆలివ్‌నూనెలో విటమిన్ ఇ నూనె కలిపి సున్నితంగా మర్దన చేయాలి. పది నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో తుడిచేయాలి. ఇలా తరచూ చేస్తుంటే, ముడతలు అంతగా కనిపించవు.