పెరుగు ఆరోగ్యానికి మంచి టానిక్‌లా ఉపయోగపడుతుంది. పెరుగులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం సౌందర్యాన్ని పెంచేందుకు సహాయపడుతాయి. పెరుగు తరచుగా ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులోని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ చర్మం మృదువుగా, తాజాగా మారేలా చేస్తాయి. అందుకు ఈ టిప్స్ పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
పెరుగులో కొద్దిగా ఉప్పు, చక్కెర, గుడ్డుసొన కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై గల నల్లటి మచ్చలు, మెుటిమలు తొలగిపోతాయి. ఇలా వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
పెరుగులో కొద్దిగా కాఫీపొడి, తేనె కలుపుకుని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే నల్లటి వలయాలు తొలగిపోతాయి. నిమ్మరసం చర్మసౌందర్యానికి సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది.
మరి దీనితో ప్యాక్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం కడిగేసుకుంటే ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.