యాభై యేళ్ల వయస్సు దాటిన మహిళలు సౌందర్యం కోసం పరితపిస్తుంటారు. ఇందుకోసం బ్యూటీపార్లకు కూడా వెళుతుంటారు. ఇలాంటి మహిళలు తమ ఇంటి వద్దే చిన్నపాటి సౌందర్య చిట్కాలు పాటిస్తే చాలని బ్యూటీషియన్లు చెపుతున్నారు.
* ప్రతిరోజూ రాత్రి ముఖానికి, మెడకు, చేతులకు... కాలాన్నిబట్టి కోల్డ్ క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీ రాయాలి. స్నానం లేదా ముఖం కడుక్కునేందుకు వేడినీటిని లేదా మరీ చల్లటి నీటిని వాడకూడదు. సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి.
* స్నానం పూర్తయిన తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. మేకప్‌ను వీలయినంత తగ్గించి, సహజత్వానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ప్యాక్‌ల విషయానికి వస్తే, ఆలీవ్ ఆయిల్, ఆముదం, ఆల్మండ్ ఆయిల్, బేబీ ఆయిల్‌లను సమపాళ్లలో తీసుకుని ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు అరగంటసేపు ఒంటికి పట్టించి ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా, ముడుతలు పడకుండా ఉంటుంది.
* యాభైలలో ఉన్న మహిళలు హెయిర్ స్టయిల్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. యూత్‌ను ఫాలో అవడం ఫ్యాషన్ ట్రెండ్ కదా అని అనుకోకుండా.. పెద్దరికాన్ని ఆహ్వానిస్తూనే మీకంటూ ఓ స్టయిల్ ఇమేజ్‌ను, స్టయిల్ స్టేట్‌మెంట్‌ను కూడా ఇవ్వవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా.. కాస్తంత తీరిక, ఓపిక ఉంటే సరిపోతుందంతే..!!