చర్మ సౌందర్యానికి పలు రకాల కాస్మోటిక్స్ వాడతాం. ఇవి కనుక సరిపడకపోతే చర్మం పాడైపోతుంది. వీటికన్నా ప్రకృతిలో సహజంగా లభించే కలబంద చాలా మంచిది.
కలబంద గుజ్జు సౌందర్య సాధనంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంతో పాటు జుట్టు సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కలబందలో విటమిన్ సి, విటమిన్ ఇ మరియు బెటాకేరటిన్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ముడతలను, మొటిమలను వంటి సమస్యలను నివారించడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా, ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.
ముందుగా ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. కలబంద గుజ్జులో కొద్దిగా బియ్యపు పిండిని వేసి బాగా కలిపి ముఖానికి రాసుకుని సున్నితంగా రెండు నిమిషాలు మర్దనా చేయాలి. అయిదు నిముషాల తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇందులో ఉన్న యాంటి ఎంజైమ్ గుణాలు ముఖంపై ఉన్న వృద్దాప్య ఛాయలను నివారించి యవ్వనంగా కనపడేలా చేస్తుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలను తొలగించుకోవచ్చు.
ఎక్కువగా బయట తిరిగేవారికి ముఖం కాంతివంతంగా ఉండదు. అలాంటివారు రాత్రి పడుకునే ముందు కలబంద గుజ్జును రాసుకున్నట్లయితే ఇది చర్మంలోని మృత కణాలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇలా రోజూ చేయడం వల్ల పదిరోజుల్లో మీ చర్మం అందంగా మారుతుంది.
జిడ్డు చర్మం కలవారు కలబంద గుజ్జులో కొద్దిగా టమాటో రసం, కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని 20 నిముషాల తరువాత కడిగివేయాలి. టమాటో మరియు నిమ్మరసం చర్మకాంతిని సహజంగా పెంచి, చర్మంలోని మృత కణాలను తొలగిస్తాయి. కలబంద చర్మంపై ఉన్న జిడ్డును తొలగించి చర్మాన్ని తాజాగా ఉండేలా చేస్తుంది.