మధ్య ప్రదేశ్‌ను పాలించిన సింధియా రాజుల వేసివి విడిది కేంద్రం శివపురి. పచ్చని అడవులతో అలరారే ప్రాంతం శివపురి. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో ఏనుగులను లొంగదీసుకున్న ప్రాంతం కూడా ఇదే. శివపురిలో ప్రస్తుతం పులుల సంరక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేశారు.
మాధవ్ విలాస్ ప్యాలెస్
సింధియా వాస్తుకళను ప్రతిబింబించేలా నిర్మించిన భవంతి మాధవ్ విలాస్ ప్యాలెస్. భవంతి లోపల చలువరాళ్లు పరిచిన తీరు చాలా అందంగా ఉంటుంది. ప్యాలెస్‌కు సమీపంలోనే గణపతి మండపం ఉంది.
మాధవ్ నేషనల్ పార్క్
శివపురిలో 156 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన వన్యప్రాణి కేంద్రం మాధవ్ నేషనల్ పార్క్. అడవిలోపల ఎండిపోయినట్లు కనిపించినప్పటికీ అక్కడ సరస్సు ఒకటి ఉంది. వన్యప్రాణి సంరక్షణా కేంద్రంలో ఛింకారా జింకలు, నల్లదుప్పి, చిరుతపులి వంటి జంతువులు ఉన్నాయి. వీటితోపాటు అనేక ఇతర జంతువులు ఉన్నాయి.
మాధవ్ రావ్ సింధియా స్మారక స్థూపం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత స్వర్గీయ మాధవ్ రావ్ సింధియా స్మారకార్ధం నిర్మించిన కేంద్రం ఇది. తెల్లని చలువరాళ్లు ఈ భవంతికి కొత్త శోభను ఇచ్చాయి. సింధియా వంశస్థుల చిత్రపటాలను ఇక్కడ ఉంచారు.
జార్జ్ కాజిల్
శివపురి దట్టమైన అడవుల లోపల ఏర్పాటుచేసిన భవంతి జార్జ్ కాజిల్. దీనిని జియాజీ సింధియా నిర్మించారు. అడవిలోపల గల సరస్సును పూర్తిగా తిలకించాలంటే ఈ భవనం ఎక్కాల్సిందే. సూర్యాస్తమం సమయంలో ఆకాశం ఎన్ని రంగులు మారుతుందో దానిని పర్యాటకులు ఈ సరస్సులో తిలకించవచ్చు.
సాఖ్య సాగర్ బోట్ క్లబ్
మాధవ్ నేషనల్ పార్క్‌లో భాగం సాఖ్య సాగర్ బోట్ క్లబ్. ఈ సరస్సులో భిన్నరకాల పాములు ఉన్నాయి. అలాగే బురద మొసళ్లు, కొండచిలువ వంటివి ఇక్కడ ఉన్నాయి. దీనికి సమీపంలోనే సాఖ్య బోట్ క్లబ్ ఉంది.
వసతి
శివపురిలో వసతికి సదుపాయాలు ఉన్నాయి.
ఎలా చేరుకోవాలి
విమాన మార్గం : గ్వాలియర్ (112 కి.మీ.) సమీపంలోని విమానాశ్రయం. ఇక్కడి నుంచి ఢిల్లీ, భోపాల్‌లకు విమాన సేవలు ఉన్నాయి.
రైలు మార్గం : ఝాన్సీ (101 కి.మీ.) సమీపంలోని ప్రధాన రైల్వే జంక్షన్. శివపురిలో రైల్వే స్టేషన్ ఉంది. మక్సి-గ్వాలియర్ మార్గంలో శివపురి ఉంది. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే రైళ్లు నడుస్తున్నాయి. వారంలో ఐదు రోజుల పాటు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవలతో పాటుగా, ఇతర ప్యాసింజర్ సేవలు ప్రతిరోజూ ఉన్నాయి.
రహదారి మార్గం : గ్వాలియర్, భోపాల్, ఇండోర్, ఝాన్సీ. ఉజ్జయిన్ నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది.