నేలపై పచ్చటి తివాచీ పరచినట్లుగా ఉండే చెట్లు, మొక్కలు.. ఆకాశంలో వెండి మబ్బులు, మధ్యమధ్యలో ఆ మబ్బుల చాటునుంచి బయటకు వచ్చే సూరీడు... ఇలా ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్న ప్రాంతం "చిరపుంజి". మేఘాలయా రాష్ట్రంలోని ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతి ఎక్కువ వర్షపాతం నమోదయ్యేదిగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది.ప్రకృతి అంతా తరలివచ్చి ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉండిపోయిందా అన్నట్లుగా అనిపించే ఈ చిరపుంజిలో ఎటు చూసినా పచ్చటి లోయలు, మధ్యలో జలపాతాలతో కనువిందు చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మేఘాలతో సహజీవనం చేసే ఆ ప్రాంత ప్రజలు ఎంత అదృష్టవంతులో కదూ..? అని కాస్త అసూయగా కూడా అనిపిస్తుంది. బ్రిటీష్‌వాళ్లు పారిపోయారట..! |
|
ఇక్కడి వాతావరణంలో బ్రిటీష్‌వారు ఇమడలేకనే తిరిగి వారి దేశానికే వెళ్లిపోయారంటూ.. ఇక్కడి స్థానిక కాశీ తెగ గిరిజనులు చమత్కరిస్తుంటారు కూడా..! అయితే ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి తొలిసారిగా పరిచయం చేసిన ఘనత మాత్రం బ్రిటీషువారికే దక్కుతుంది... |
|
|
ఏడాది పొడవునా చిరపుంజిలో వర్షాలు పడుతూనే ఉన్నా.. జూన్, జూలై, ఆగస్టు మాసాలలో మాత్రం వర్ష తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే చిరపుంజి అందాలను ఈ సమయంలోనే చూడాలని చెబుతుంటారు స్థానికులు. సముద్ర మట్టానికి దాదాపు 1290 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో వానాకాలం మొత్తంమీదా దాదాపు పన్నెండువేల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంటుంది.
ఈ చిరపుంజి సందర్శించేవారు తప్పనిసరిగా చూడాల్సిన ప్రాంతం "మాక్టో వ్యాలీ". ఈ వ్యాలీకి వెళ్లేందుకు పచ్చని కొండల నడుమ నల్లటి తాచులా వెళ్లే సన్నటి రోడ్డుపై ప్రయాణిస్తుంటే కలిగే అనుభూతిని స్వయంగా అనుభవించాల్సిందే. మాక్టో వ్యాలీ నుంచి సోహ్రా పట్టణంలోకి అడుగుపెట్టాలంటే, ఒక దట్టమైన అడవిని దాటాల్సి ఉంటుంది. ఇక్కడ గిరిజన విద్యార్థుల కోసం రామకృష్ణమఠం ఒక ఉన్నత పాఠశాలను కూడా ప్రారంభించింది.
సోహ్రా పట్టణానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉండే "నాంగ్‌స్లావియా" అనే ప్రాంతంలో కాశీ లిపి పుట్టినట్లుగా చెబుతుంటారు. ఇక్కడి సూర్యోదయం పర్యాటకులకు మధురానుభూతులను కలుగజేస్తుందంటే అతిశయోక్తి కాదు. వర్షం కురిసి చల్లగా ఉన్న వాతావరణంలో సూర్యుడి లేలేత కాంతి కిరణాలు మనసుకు చెప్పలేనంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పర్యాటకులు కొండ శిఖరాల పైనుంచి లోయల్లోకి దూకుతున్న జలపాతాలను చూస్తూ... తమ ఉనికినే మర్చిపోయేంతగా లీనమైపోతుంటారు.
ఇదిలా ఉంటే... చిరపుంజిని స్థానికంగా సోహ్రా అని పిలుస్తుంటారు. అంటే పండ్లు పండని ప్రాంతం అని అర్థం. ఈ సోహ్రా పట్టణంలో వారాల తరబడీ వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఇక్కడి వాతావరణంలో బ్రిటీష్‌వారు ఇమడలేకనే తిరిగి వారి దేశానికే వెళ్లిపోయారంటూ.. ఇక్కడి స్థానిక కాశీ తెగ గిరిజనులు చమత్కరిస్తుంటారు కూడా..! అయితే ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి తొలిసారిగా పరిచయం చేసిన ఘనత మాత్రం బ్రిటీషువారికే దక్కుతుంది.
చిరపుంజిలో వర్షం ఎక్కువగా పడుతుందని గుర్తించి, దానిని నమోదు చేసింది కూడా బ్రిటీష్ అధికారులే. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1861వ సంవత్సరంలో ఒకే ఒక నెలలో 9,299.96 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బ్రిటీష్ అధికారులు ఈ పట్టణం ప్రాముఖ్యతను గుర్తించారు.
ప్రపంచంలోనే అతి ఎక్కువ వర్షంపడే ప్రాంతంగా రెండుసార్లు గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్న చిరపుంజి రికార్డును... దాని సమీపంలో ఉండే "మాస్వారం" అనే పట్టణం బద్ధలుకొట్టింది. అయితే, అత్యధిక వర్షపాతం పడే ఈ ప్రాంతంలో ప్రజలకు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకవంటే నోర్లు వెళ్లబెట్టకమానం. ఎందుకంటే, ఈ ప్రాంతంలో ఉండే లోయలు, కొండలవల్ల వర్షపు నీరు నిల్వ ఉండని కారణంగా, నవంబర్ నుంచి ఫిబ్రవరిదాకా ఇక్కడ తీవ్రమైన నీటికొరత ఏర్పడుతుంటుంది. దీంతో అక్కడి ప్రజలు పలు ఇక్కట్లకు గురవుతుంటారు.
మేఘాలయలోని చిరపుంజిని చూడాలనుకునే పర్యాటకులు షిల్లాంగ్ నుంచి పయనించాల్సి ఉంటుంది. షిల్లాంగ్ చుట్టు పక్కల ఉన్న ప్రదేశాల్లో కేవలం చిరపుంజి మాత్రమే పర్యాటక ప్రదేశం కాదు. షిల్లాంగ్ చుట్టు పక్కల అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. దాదాపు ప్రతిరోజు టూరిస్టులతో సందడిగా ఉండే షిల్లాంగ్‌లో మ్యాజియం ఆఫ్ ఎంటోమాలజీ అనే సీతాకోక చిలకల పార్క్ పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.
రవాణా సౌకర్యాల విషయానికి వస్తే... షిల్లాంగ్ చేరుకోవాలనుకునే వారికి సమీపంలోని గౌహతి ప్రధాన కేంద్రం. ఇక్కడే విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ఉంది. గౌహతి చేరుకుని అక్కడినుంచి షిల్లాంగ్ వెళ్లాల్సి ఉంటుంది. గౌహతినుంచి షిల్లాంగ్ వెళ్లే వారికోసం మేఘాలయా ప్రభుత్వం హెలికాప్టర్ సౌకర్యాన్ని సైతం అందుబాటులో ఉంచింది. అలాగే మేఘాలయాలోని ఏ ప్రాంతానికి చేరుకున్నా అక్కడినుంచి రాజధాని ప్రదేశమైన షిల్లాంగ్‌కు బస్ సౌకర్యం ఉంది.
వసతి సౌకర్యాల విషయానికి వస్తే... షిల్లాంగ్ చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలతో పాటు చిరపుంజిలాంటి ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా... షిల్లాంగ్ నుంచి పయనం సాగించాల్సిందే. పర్యాటకులకు అవసరమైన అన్ని రకాల వసతి సౌకర్యాలు షిల్లాంగ్‌లో లభిస్తాయి. షిల్లాంగ్‌లో సాధారణ స్థాయి సౌకర్యాలనుంచి ఓ మోస్తరు ఆధునిక వసతుల వరకు అందుబాటులో ఉంటాయి.