ఆఫ్రికా దేశంలో మాదిరి భారతదేశంలోని రాజస్థాన్‌లో ఆ తరహా స్థాయిలో సింహాల సఫారీని నిర్వహించాలని కొత్త ప్రణాళిక రూపొందించారు. ఈ సింహాల సఫారీని నహార్గాహ్ బయోలాజికల్ పార్క్‌లో ఏర్పాటు చేయనున్నట్లు అటవీశాఖ విభాగపు అధికారి ఒకరు చెప్పారు.
పథకానికి సంబంధించిన రూపురేఖలను సెంట్రల్ జూ అథారిటీ ఆమోదించిందన్నారు. ఏప్రిల్ నుంచి పథానికి సంబంధించిన పనులను ప్రారంభించగలమని ఆయన
ధీమా వ్యక్తం చేశారు. ముందుగా, ఈ సఫారీ కోసం 10 సింహాలను గిర్ నేషనల్ పార్కు, జైపూర్ జంతుశాలల నుంచి తెప్పించనున్నట్లు వివరించారు. అలాగే పర్యాటకుల కోసం అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ సఫారీని ఏర్పాటు చేయడం ద్వారా సింహాలపై అధ్యయనం సులువే గాక... గుంపులు గుంపులుగా అవి కదలడం ద్వారా పర్యాటకులను మరింత ఆకర్షించవచ్చని తెలిపారు. నీజార్ ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతం గల బొటానికల్ గార్డెన్‌లో సుమారు 36 ఎకారాలను సింహాల సఫారీ కోసం సేకరించారు.
సింహాలు ప్రకృతి సిద్ధంగా మనగలిగేందుకు ఐదు గుహలను సహజత్వం ఉట్టిపడేలా ఏర్పాటు చేయనున్నారు. నిరంతరం నీటి సరఫరా కోసం నాలుగు రిజర్వాయర్లతో కూడిన భూగర్భ పైపులను కూడా కల్పించనున్నారు. అంతేగాక సింహాల కదలికలను తెలుసుకునేందుకు రెండు వాచ్ టవర్లను కూడా నిర్మించనున్నారు.
ఈ పథకం కోసం సుమారు కోటీ 50 లక్షల రూపాయల మేర ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఈ పథకానికి కావలసిన నిధులను మంజూరు చేయనున్నట్లు అటవీ శాఖ వర్గాలు వెల్లడించాయి.