మీకో నమస్కారం..!! మమ్మల్ని బతకనీయండి..!!!
పులుల జీవితం ఫిక్స్‌లో పడిపోయింది. ఒకప్పుడు మానవుడు ఎదుటపడితే పంజా విసరడానికి ఎగిరి దూకే పులి.. నేడు మానవుని తూటా దెబ్బకు జడుసుకుని గుహకే పరిమితమై, బయటకొస్తే ప్రాణాలు ఎగిరిపోతాయని భయపడుతూ గజగజ వణకుతోంది. అయినా కొందరు క్రూర మానవులు గుహలోనున్న చారల పులి తాట తీసి డెకరేటర్లకు కానుకగా ( పైసలకు) ఇచ్చేస్తున్నారు. ఇదీ ప్రస్తుతం మన భారతదేశ "పులి" జీవితం. ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో సగం మన దేశంలో ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. నేషనల్ టైగర్ కన్ సర్వేషన్ అథారిటీ గణాంకాల ప్రకారం 2008, ఫిబ్రవరి 12నాటికి మన దేశంలో ఉన్న పులుల సంఖ్య కేవలం 1411 మాత్రమే. దేశంలోని వివిధ అటవీ ప్రాంతాలను కలుపుకుని ఒకప్పుడు... అంటే 1990 కాలంలో సుమారు 3,500 పులులు ఉన్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. అయితే పులులను అక్రమంగా వేటాడటం ఎక్కువవడం, వారిపై నియంత్రణ లేకపోవడంతో వాటి సంఖ్య 1400కు చేరింది. చర్మం కోసం వేటాడటం, వాటి నివాసాలను నాశనం చేయడం వంటి కారణాల పులుల సంఖ్య బాగా తగ్గింది. 20వ శతాబ్ద ఆరంభంలో ప్రపంచ వ్యాప్తంగా లక్షకు పైగా పులులు ఉండేవని అంచనా. అయితే వాటి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2 వేలకు పడిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అనధికార లెక్కల ప్రకారం వీటి సంఖ్య ఇంకా తక్కువగా ఉండివుండవచ్చని తెలుస్తోంది.పులుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న నేపధ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పులుల సంరక్షణార్థం 153 మిలియన్ డాలర్లను ప్రాజెక్టు టైగర్‌కు అదనంగా కేటాయింపులు చేసింది. అదేవిధంగా పులులను వేటగాళ్ల బారినుంచి సంరక్షించేందుకు టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. పులులను వేటాడి జీవనం సాగించే రెండు లక్షలమందికి పునరావాసం కల్పించింది. అంతేకాదు అదనంగా ఎనిమిది కొత్త టైగర్ రిజర్వులు భారత దేశంలో ప్రారంభించబడ్డాయి. మరి ఇప్పటికైనా పులుల సంఖ్య ప్రస్తుత సంఖ్యకన్నా క్షీణించకుండా ఉంటుందేమో చూడాలి.