Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పేదల ఊటీ "ఏర్కాడు"లో హ్యాపీ సమ్మర్ ట్రిప్..!!

పేదల ఊటీ
PTI
తమిళనాడు రాష్ట్రంలో సేలం పట్టణానికి దగ్గర్లోగల "ఏర్కాడు" దేశంలోని హిల్‌స్టేషన్లలో ఒకటిగా పేరుగాంచింది. చెన్నై నగరానికి 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏర్కాడును "పేదల ఊటీ" అని ముద్దుగా పిలుస్తుంటారు. సెర్వరాయన్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,500 మీటర్ల (4,920 అడుగులు) ఎత్తులో ఉండే ఏర్కాడులో.. వేసవికాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. అందుకే ఎప్పుడూ చల్లగా ఉండే, ఈ హిల్‌స్టేషన్‌‌ను ఏడాది పొడవునా పర్యాటకులు సందర్శిస్తుంటారు.

ఏర్కాడుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. తమిళ భాషలో "ఏరి" అంటే "సరస్సు" అనే అర్థం కాగా, "కాడు" అంటే "అడవి" అని అర్థం. ఏరి కాడు అనే పదాలే క్రమంగా "ఏర్కాడు"గా రూపాంతరం చెందినట్లు స్థానికులు చెబుతుంటారు. ఏర్కాడు కాఫీ తోటలకు కమలా పండ్లకు ప్రసిద్ధి. ఏర్కాడులో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సారధ్యంలో నిర్వహించబడే "ఆర్కిడారియం" పర్యాటకులకు కనువిందు చేస్తుంటుంది.

webdunia
FILE
అలాగే ఏర్కాడులోని అతి ఎత్తైన ప్రదేశం "సెర్వరాయణ్ దేవాలయం" చూడదగ్గ ప్రదేశం. ఇది సముద్ర మట్టానికి 5326 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఏర్కాడు కొండల ప్రాంతం "షెవరాయ్ హిల్స్"గా పిలువబడుతోంది. ఇక్కడ అడవిదున్నలు, జింకలు, ఎలుకలు, కుందేళ్లు, నక్కలు, మాంగూస్, ఉడుతలు, పావురాళ్లు, పాములు, బుల్‌బుల్ పిట్టలు, పక్షులు.. తదితర అడవి జంతువులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ఏర్కాడులో అడుగుపెట్టగానే ఆకర్షించే మరో ప్రదేశం అందమైన "సరస్సు", అందులో పడవ షికార్లు. ఆ తరువాత చిన్న సైజు జంతు ప్రదర్శన శాల (జూ), అన్నా పార్కు చూడదగ్గవి. అన్నా పార్కులో పలు ఆకృతుల్లో కత్తిరించిన మొక్కలు, వివిధ రంగుల్లో విరబూసిన పువ్వులు, సేదదీర్చే కాంక్రీటు గుడారాలు, దేవతా మూర్తుల ప్రతిమలు ఆకట్టుకుంటాయి. అలాగే హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ చూడదగ్గ మరో ప్రదేశం.

webdunia
FILE
ఏర్కాసు సరస్సుకు పది కిలోమీటర్ల దూరంలో ఉండే "లేడీస్ సీట్" చూడదగ్గ ప్రదేశం. లేడీస్ సీట్ వెళ్లేందుకు సేలం నుంచి ఏర్కాడుకు వెళ్లే రహదారిలో మెలికలు తిరిగే రోడ్లలో ప్రయాణం ఉల్లాసభరితంగా సాగుతుంది. ఆ తరువాత పగోడా పాయింట్, సెర్వరాయణ్ టెంపుల్, నార్టన్ బంగళా, బియర్స్ కేవ్ (ఎలుగుబంట్ల గుహ), 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా కీలకపాత్ర పోషించిన "ది గ్రేంజ్" కోట, 1917లో స్థాపించిన మౌంట్‌ఫర్డ్ ఉన్నత పాఠశాల చూడదగ్గ ఇతర ముఖ్యమైన ప్రదేశాలు.

ఏర్కాడులో ప్రతి సంవత్సరం సమ్మర్ ఫెస్టివల్‌ను వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇది మే రెండో వారంలో ప్రారంభమవుతుంది. ఏర్కాడులో భూముల సేద్యం ఉండదు. ఇక్కడంతా ఎక్కువగా కాఫీ తోటలనే సాగు చేస్తుంటారు. అదే విధంగా పసనపండ్లు, బెర్రీలు, కమలాపండ్లు, జామపండ్లను విరివిగా పండిస్తారు.

ఏర్కాడు చేరుకోవటం ఎలాగంటే.. విమాన ప్రయాణంలో తిరుచ్చిరాపల్లి వరకు ప్రయాణించి, ఆపై కోయంబత్తూర్ నుంచి బస్సు మార్గంలో ఏర్కాడు చేరుకోవచ్చు. రైలు ప్రయాణంలో అయితే చెన్నై-కోయంబత్తూర్ రైలు మార్గంలో చెన్నై నుంచి 335 కిలోమీటర్ల దూరంలోని సేలం జంక్షన్ వద్దకు చేరుకోవచ్చు. అక్కడినుంచి 35 కిలోమీటర్ల దూరంలోగల ఏర్కాడుకు బస్సు మార్గంలో వెళ్లవచ్చు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుంచి సేలం వరకు కూడా బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

ఇక వసతి విషయానికి వస్తే.. ఏర్కాడులో అనేక స్టార్ హోటళ్లతోపాటు చిన్నా, పెద్దా హోటళ్లు కూడా చాలానే ఉన్నాయి. అలాగే హాలిడే హోమ్స్, రిసార్టులు, గెస్ట్‌హౌస్‌లకు కూడా కొదువేలేదు. వీటితోపాటు తమిళనాడు రాష్ట్ర పర్యాటక సాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తమిళనాడు, యూత్ హాస్టల్‌లు అందరికీ అందుబాటు ధరల్లో లభ్యమవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu