నేలరాలిన 5 వేల పక్షులు... చచ్చి తేలియాడిన లక్ష చేపలు
, బుధవారం, 5 జనవరి 2011 (21:51 IST)
మమల్నిలా బతకనీయండి....
మానవుడికి మిన్నంటే సంతోషం... పాతాళ లోకాన్ని చూసేటంతట ఆనందం వస్తే ఏం జరుగుతుందీ...? ఇతర జీవుల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయ్. ఇదే విషయాన్ని పట్టి చూపిస్తోంది అమెరికాలో నూతన వేడుకల అనంతరం జరిగిన ఉదంతం. వివరాల్లోకి వెళితే... 2010 సంవత్సరానికి వీడ్కోలు చెప్పి 2011 నూతన వత్సరాన్ని స్వాగతించేందుకు అమెరికాలోని అర్కాన్సా ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. 2010 డిసెంబరు 31 ముగిసి 2011 అడుగుపెట్టబోయే ముందు కొన్ని నిమిషాల పాటు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. రకరకాల మందుగుండును కాల్చి పారేశారు. ఆర్థిక మాంద్యం కోరల్లోంచి ఇంకా బయటపడలేదని చెపుతున్నప్పటికీ ఆ రోజు రాత్రి మాత్రం వేడుక నింగిని తాకడమే కాదు.. పాతాళ లోకాన్ని కుదిపింది. దీని ఫలితమో... మరే మాయో కానీ... ఆరోజు అర్థరాత్రి పక్షులకు కాళరాత్రే అయ్యింది. తెల్లారేసరికి నింగి నుంచి పిట్టలు ప్రాణాలు విడుస్తూ టపటపా రాలిపడటం మొదలెట్టాయి. ఒకటా రెండా... ఏకంగా 5 వేల పక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గురువారం కూడా మరో 500 పక్షులు మృతి చెందాయి. చచ్చిన పిట్టలు ఎందుకు చచ్చిపోయాయో అని అమెరికాలోని శాస్త్రజ్ఞులు పరీక్షలు మొదలెట్టారు. ఇలా పరీక్షలు చేస్తుండగానే అర్కాన్సా నదిలో సుమారం లక్ష చేపలు చచ్చి నీటిపై ఒక్కసారిగా తేలాయి. ఒకేసారి పిట్టలు... చేపలు ఇలా మృతి చెందడంతో అక్కడివారు కలవర పడ్డారు. ఎక్కడివారు అక్కడే హుటాహుటిన మాస్కులు ధరించేశారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికీ చాలామంది తమ ముఖానికి వేసుకున్న మాస్కులను తీయడమే లేదంటే ప్రాణంపై ఎంత తీపి ఉన్నదో తెలుస్తుంది. మరి ఈ మూగ జీవాలు వాటి ప్రాణాలను ఎలా రక్షించుకోగలవు. మానవుడు వాటిపట్ల రాక్షసుడిగా మారి పర్యావరణాన్ని కాలుష్య కోరల్లోకి నెట్టివేస్తున్నాడు. పక్షుల చావుకు కారణాలు ఇంకా తెలియరాలేదని శాస్త్రజ్ఞులు చెపుతున్నప్పటికీ, చేపల మరణానికి ఏవేవో సాకులు వెతుకుతున్నప్పటికీ... నూతన సంవత్సర వేడుకలే వాటి ప్రాణాల్ని బలిగొన్నాయన్నది సుస్పష్టం. ఇకనైనా కాలుష్య రహిత వాతావరణం కోసం కృషి చేయనట్లయితే ఏదో ఒకనాడు మానవులకు కూడా ఈ పిట్టలకు పట్టిన గతే పడుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా మనిషి మారేనా...?!!