Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీలి మేఘాలతో దోబూచులాడే "సింగపూర్"ను చుట్టేద్దామా..?!

నీలి మేఘాలతో దోబూచులాడే
FILE
పచ్చదనానికి, పరిశుభ్రతకు మరో పేరు సింగపూర్. ఎన్నో ప్రకృతి అందాలకు నెలవైన ఆ దేశ అందాలను వీక్షించేందుకు విచ్చేసే పర్యాటకుల సంఖ్య కోకొల్లలు. అందుకే ఆ దేశ ఆర్థిక వనరుల్లో సైతం పర్యాటక రంగమే అగ్రగామి. తరచుగా వర్షం కురుస్తుండే ఈ దేశంలో వర్షం తరువాత పరచుకునే నీలిమేఘాలు అనిర్వచనీయమైన అద్భుత అందాలను మన కళ్లముందు ఆవిష్కరిస్తాయి. ప్రపంచ పర్యాటక రంగంలో అగ్రభాగాన నిలిపిన ఈ అరుదైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు అలా వెళ్లివద్దామా..?!

యూరప్ దేశాల్లోని వాతావరణ పరిస్థితులను తనలో మమేకం చేసుకున్న సింగపూర్‌లో ప్రజలు ఎక్కువగా, ఇష్టంగా మాట్లాడేది రెండే రెండు బాషలు. అవి ఒకటి "మకాన్", రెండు "సింగ్లీష్". ఇంగ్లీష్ అనే బాషను విన్నామేగానీ, సింగ్లీష్ ఏంటబ్బా.. అని ఆలోచిస్తున్నారా..? మరేం లేదండి.. మలై, ఇండోనేషియా, తమిళం, చైనీస్ లాంటి ఇతర భాషలను ఇంగ్లీషుకు మేళవించి సింగపూర్ వాసులు మాట్లాడే భాషనే సింగ్లీష్ అంటారు. ఇంకా విడమరచి చెప్పుకోవాలంటే సింగపూర్ ఇంగ్లీష్ అనవచ్చు.

ప్రపంచంలోనే అత్యున్నత పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న సింగపూర్‌లో చూడాల్సిన ప్రదేశాలు బోలెడు. వాటిల్లో నైట్ సఫారీ, సింగపూర్‌ బొటానికల్‌ గార్డెన్స్‌, జూరాగ్‌ బర్డ్‌ పార్కు, మెర్ లయెన్ పార్కు, సెంతోసా ద్వీపం, అండర్ సీ వరల్డ్.. తదితరాలు చాలా ముఖ్యమైనవి.

సాధారణంగా జంతుప్రదర్శన శాలలను చూడాలంటే ప్రపంచంలో ఎక్కడైనా పగటివేళల్లోనే అనుమతిస్తుంటారు. కానీ సింగపూర్‌లో మాత్రం రాత్రివేళల్లో కూడా వాటిని సందర్శించవచ్చు. దీనినే "నైట్ సఫారీ" అని పిలుస్తుంటారు. రాత్రివేళల్లో తిరిగే జంతువులను, పక్షులను చూడాలంటే ప్రత్యేకమైన చీకటి గుహల్లోనే చూడాలి. ఈ అవకాశాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కల్పించింది సింగపూరే. రాత్రుల్లో జంతువులను వాటి సహజ పరిస్థితుల్లో చూసే అవకాశం కలగటంతో పర్యాటకులు ఓ వింత అనుభూతికి లోనవుతారు.
webdunia
FILE


ఈ నైట్ సఫారీలో ప్రత్యేక ఆకర్షణ అక్కడి ఆదివాసుల స్వాగత నృత్యం. బలంగా ఉండే యువకుల విలువిద్యా కౌశల ప్రదర్శన, వెదురుబొంగులు వేగంగా కదులుతుంటే వాటి మధ్య అడుగులు వేస్తూ చేసే నృత్యం చూడముచ్చటగా ఉంటాయి. ఇందులో మరో ఆకర్షణ మంటలతో చేసే నృత్యం. నైట్ సఫారీను చూసేందుకు ట్రాములో వెళ్లాల్సి ఉంటుంది. నెమ్మదిగా ట్రాము కదులుతుంటే, జంతువులు వాటి సహజ పరిసరాలలో మనకు చాలా దగ్గరనుంచీ కనిపిస్తాయి.

140 సంవత్సరాల చరిత్ర కలిగిన "బొటానికల్ గార్డెన్స్" సింగపూర్‌లో చూడదగ్గ మరో ప్రదేశం. పదివేల రకాల వృక్షాలు ఒకే ప్రాంగణంలో ఉండటం చూస్తే, ఆశ్చర్యచకితులవుతారు. ఇక్కడి పువ్వులు రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంటే, ఇందులోని ఆర్కిడ్ ఉద్యానవనం మరో అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. ఆసక్తికలవారు వాటి వివరాలు తెలుసుకునేందుకు అక్కడ కంప్యూటర్ తెరలను సైతం ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ పిల్లలకోసం ఓ ప్రత్యేకమైన గార్డెన్ కూడా ఉంది. ఇక్కడ ఉష్ణప్రదేశాల్లో ఉండే మాంసాహార చెట్లు సైతం మనకు దర్శనమిస్తుంటాయి.

ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద పార్కుగా ప్రఖ్యాతి చెందిన "జురాగ్ పక్షుల కేంద్రం" సింగపూర్‌లో చూడాల్సిన మరో అద్భుతమైన ప్రదేశం. 600 జాతులకు చెందిన 8 వేల పక్షులు నెలవైన ఈ పార్కును ఓ పద్ధతి ప్రకారం చూసేందుకు వీలుగా ఏసీ, పానో రైలు సదుపాయం ఉంది. మెయిన్‌ స్టేషన్‌లో ఎక్కి లోరీ స్టేషన్‌లో దిగి మళ్లీ రైలెక్కి వాటర్‌ఫాల్‌ స్టేషన్‌లో దిగి మళ్లీ అక్కడనుంచి మెయిన్‌స్టేషన్‌ చేరుకోవచ్చు.

webdunia
FILE
లోరికీట్‌ పక్షులు (ఎరుపు రంగు చిలుకల్లా ఉండేవి) లోరీ స్టేషన్‌లో దిగినపుడు చూడవచ్చు. ఇక పక్షులకి ఆహారం పెడుతున్నపుడు వాటి హడావుడి చూసితీరాల్సిందే. పక్షులకి మనం కూడా ఆహారం వేస్తూ ఫోటోలు తీయించుకోవచ్చు. వాటర్‌ఫాల్‌ స్టేషనులో దిగితే 60 జాతులకి చెందిన 1500 పక్షులని వాటి సహజసిద్ధమైన నివాస ప్రాంతాల్లో చూడగలిగే అరుదైన అవకాశం కలుగుతుంది. ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణగా మానవనిర్మితమైన అతి ఎత్తైన జలపాతం సందర్శకులను విశేషంగా ఆకట్టు కుంటుంది.

ఈ పార్కులో 200 పెంగ్విన్లని, నిశాచర పక్షుల్ని, పెవికాన్లని, రకరకాల కొంగల్ని కూడా చూడవచ్చు. ఫుజీహాక్‌వాక్‌ స్టేడియంలో గద్దలు, హాక్‌లు, ఫాల్కన్‌ పక్షుల విన్యాసాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. పక్షులు వేటాడే విధానాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలుగుతుంది. ఆంపీధియేటర్‌లో అనేక పక్షుల చేత.. చిన్న రాళ్లతో గుట్టని పగులగొట్టడం, బాస్కెట్‌ బాల్‌ ఆడటం, సందర్శకుడి చేతినుంచి డాలర్‌ నోటు ఎగరేసుకుపోవడం లాంటి ఫీట్లు చేయించడాన్ని చూడవచ్చు.

సింగపూరు పర్యటనలో "సెంతోసా ద్వీపా"న్ని సందర్శించకపోతే ఆ పర్యటనే అసంపూర్ణమని చెప్పాలి. ఈ ద్వీపంలోకి కేబుల్‌ కార్‌లో వెళ్లటమే చాలా త్రిల్లింగ్‌గా ఉంటుంది. భూమినుంచి అనేక అడుగుల ఎత్తునుంచి విహంగవీక్షణం చేయగలగడం ఒక మరపురాని అనుభూతి. సింగపూర్‌ సాంస్కృతిక చిహ్నమైన మెర్‌లయన్‌ 37మీటర్ల ఎత్తున్న విగ్రహాన్ని రెప్పవేయకుండా చూడాలనిపిస్తుంది. తొమ్మిదవ అంచె నుంచి సింగపూర్‌ దక్షిణభాగం, సింటోసా, స్కెలైన్‌ కనిపిస్తాయి. సీతాకోకచిలుకల పార్కు నయనానందకరంగా దర్శనమిస్తుంది.
webdunia
FILE


ఇక్కడ పదిహేనువందల సీతాకోక చిలుకలనే కాకుండా మూడు వేల రకాల అరుదైన అందమైన కీటకాల్ని చూసే అవకాశం కలుగుతుంది. అలాగే ఇక్కడి "అండర్‌ వాటర్‌ వరల్డ్‌"లో 2500 జాతులకి చెందిన 2,500 జలాచరాల్ని చూసే అదృష్టం కలుగుతుంది. 83మీటర్ల సొరంగం నుంచి ట్రావ్‌లేటర్‌ ద్వారా అనేక రంగుల, ఆకారాల జలచరాల్ని చూడడం ఒక వింత అనుభవం. ఇమేజెస్‌ ఆఫ్‌ సింగపూర్‌ మ్యూజియం సింగపూర్‌ చరిత్ర, జాతులు, జీవనవిధానాలు సమగ్రంగా తెలియజేస్తుంది.

సింగపూర్‌ ఇతర ఆకర్షణల విషయానికి వస్తే... నగరంలోని "మెర్‌ లయెన్‌ పార్కు" తప్పక చూడాల్సినదే. సింహపురి సంగపూర్‌గా రూపాంతరం చెందడం వల్ల కాబోలు సింహం, చేప కలగలసిన శిల్పానికి అత్యంత ప్రజాదరణ అభించింది. లండన్‌‌కన్నా పెద్దదైన సింగపూర్‌ ఫ్లైయర్‌ ఎక్కిన వారు 165 మీటర్ల ఎత్తునుంచి సింగపూరునే కాకుండా, మెరినాబేని కూడా చూడవచ్చు.

ఆసియాలోనే మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన సింగపూర్‌ డక్‌టూర్‌ ఒక ప్రత్యేక ఆకర్షణ. నీటిమీదా, నేలమీదా ప్రయాణించే ఉభయచర వాహనంలో పన్‌ టెక్‌సిటీ, విక్టోరియా థీయేటర్‌ సుప్రీంకోర్టు, వార్‌ మెమోరి యల్‌ పార్కు, నీటిలో ప్రయాణించినపుడు ఎప్సలనేడ్‌ మెర్‌ లయన్‌ విగ్రహం, తదితర విశేషాలు నేల ప్రయాణంలో చూడవచ్చు.

సింగపూర్‌లోని పురాతన చైనా గుడి చూడదగ్గది. ద్వారపాలకులుగా సింహాల విగ్రహాలు ఆకట్టుకుంటాయి. ఇంకా... బుద్ధుడి దంతం ఉన్నదని చెప్పబడే గుడి, సింగపూర్‌జూ, పాసిక్‌ రిస్‌ పార్కు, ఎమ్‌ఎన్‌టి బొమ్మల మ్యూజియం, నేషనల్‌ మ్యూజియం, వార్‌ మెమోరియల్స్‌లాంటివి ఇతర సందర్శనీయ స్థలాలు. ఇక చివరిగా... టూరిస్టు వీసాలు సులభంగా లభించే సింగపూర్ చెక్కేయాలంటే.. అక్కడి విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసాలను మంజూరుచేసే వ్యవస్థ మనకు తోడ్పడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu