కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు వెలువరించిన నివేదికలను అనుసరించి రాష్ట్రంలో పులుల సంఖ్య తగ్గుముఖం పట్టడం పట్ల మధ్యప్రదేశ్ అటవీశాఖ మంత్రి కున్వర్ విజయ్ షా ఆందోళన వ్యక్తం చేశారు. పులుల పరిరక్షణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను త్వరలో రూపొందిస్తామని మంత్రి మీడియాతో అన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో జింకలు, నెమళ్ళు మరియు ఇతర వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు.
రాష్ట్ర రాజధానిలో సోమవారం జరిగే సమీక్షా సమావేశంలో ప్రణాళిక విధివిధానాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు. వ్యనప్రాణుల సంరక్షణ నిమిత్తం అటవీ రక్షకులకు తగు మార్గదర్శకాలను అందిస్తామని కున్వర్ విజయ్ షా వెల్లడించారు. జాతీయ పక్షిగా వాసికెక్కిన నెమలి సంరక్షణార్ధం అడవులలో అవసరమైన ఆహారధాన్యాలు మరియు నీటి లభ్యతపై తమ శాఖ తగు చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
రాష్ట్రంలో అటవీప్రాంత విస్తీర్ణం పెరుగుదల యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసే ప్రచార కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. తగ్గిపోతున్న అటవీ ప్రాంత విస్తీర్ణం, నానాటికి పెరిగిపోతున్న మానవ జనాభాతో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఇంధన కొరత తలెత్తుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.