క్రూర మృగాలు జనారణ్యంలోకి దూసుక వస్తున్నాయి. అంటే... అడవులు వాటికి నివాస యోగ్యంగా ఉండటం లేదా..? అనే ప్రశ్న తలెత్తడం సహజం. ఇటీవల కాలంలో చిరుత పులులు స్త్వైరవిహారం చేస్తున్నాయి. ప్రజల మధ్యకు వచ్చి భయాందోళనలు సృష్టిస్తున్నాయి. కొంతమందిని గాయపరుస్తున్నాయి. మరికొన్నిచోట్ల గొర్రెలు, మేకలు, పశువులను పొట్టనబెట్టుకుంటున్నాయి. ఈ వ్యవహారం చూస్తే అడవుల్లో వాటికి తగిన వాతావరణం లేనట్లు అర్థమవుతోంది.
సహజంగా క్రూరమృగాలు జనావాసాలలోకి రావాలంటే భయపడతాయి. కనీసం జనం తిరగుతున్నట్లుండే దరిదాపులకు సైతం రావాలంటే జంకుతాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో... అంటే అడవుల్లో ఆహార కొరత, ఇతరత్రా అననుకూల పరిస్థితులు తలెత్తినపుడే బయటకు వస్తాయి. ఇలా వచ్చినపుడు మనుషులపై దాడులకు తెగబడతాయి. మనిషి రక్తాన్ని రుచి చూసిన చిరుతలు ఇక అడవుల్లోకి వెళ్లవంటారు.
ఇటువంటి సందర్భాల్లో చిరుతలు మాటువేసి మనుషుల ప్రాణాలను కబళిస్తుంటాయి. ఇటువంటి సంఘటనలు చాలా అరుదు. చాలాకాలం క్రితం రుద్రయాగలో ఓ చిరుత ఏకంగా 125మందిని చంపింది. ఆ తర్వాత పానార్ చిరుత సుమారు 400 మందికి పైగా పొట్టనబెట్టుకున్నట్లు చెపుతారు. అయితే ఈ రెండు పులులను వేటగాడు జిమ్మికార్టర్ మాటువేసి చంపాడు. ఆ తర్వాత ఇటువంటి సంఘటనలు పునరావృతమైనట్లు ఎక్కడా కనిపించలేదు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం చిరుతలు అడవులకు సమీపంలో ఉండే గ్రామాలకు వచ్చి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి.
మరికొన్నిచోట్ల రైలు పట్టాలపైనో... పొలాలకు వేసే కంచెల్లోనో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇంకొన్నిచోట్ల చిరుతలను చూసి భయపడిన ప్రజలు ఆ విషయాన్ని అటవీశాఖ అధికారులతో చెప్పినప్పటికీ వారు తగు రీతిలో స్పందించకపోవడంతో ప్రజలే చిరుతలను చంపేస్తున్నారు. ఇక వేటగాళ్ల సంగతి వేరే చెప్పనక్కరలేదు. వీటన్నటితోపాటు ఇతర ప్రమాదాల బారినపడి మృత్యువాత పడే పులుల సంఖ్యా తక్కువేమీ కాదు.
2000 సంవత్సరం పులుల పాలిట మృత్యువత్సరంగా మారిందనే చెప్పాలి. ఆ ఏడాది ఏకంగా పలు కారణాల వల్ల సుమారు 1278 పులులు మృత్యువాత పడ్డాయి. ఇక గత ఏడాదిని చూస్తే సుమారు 180 పులులు చచ్చిపోయాయి. ఇలా చిరుతల సంఖ్య నానాటికీ తగ్గిపోతోందని వన్యమృగ సంరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అడవుల నరికివేత, పర్యావరణ కాలుష్యం కారణంగా క్రూరజంతువులకు ముప్పువాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. వీటిని సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది.