నంధ్యాల పట్టణానికి 30 కి.మీల దూరంలో కర్నూలు మరియు ప్రకాశం జిల్లాల మధ్యన గల 1194 చ.కిమీ.ల విస్తీర్ణంలో గుండ్ల బ్రహ్మేశ్వ అభయారణ్యం నెలకొంది. పలు రకాల ఔషధ గుణాలు కలిగిన వృక్షసంపదతో పాటు పులి, చిరుతపులి, జింక, హైనా, అడవి కుక్క, అడవి పిల్లి, లంగూర్, కోతి, పాంగోలిన్, సంబర్, నిల్గై, చౌసింగ, చింకారా, ఎలుక జింక, పైథాన్ మరియు ఉభయచరమైన మొసలి తదితర జంతువులు ఈ అభయారణ్యంలో కనిపిస్తాయి.
ఇన్ని జీవులకు అభయమిచ్చే అద్భుత నెలవుగా ప్రఖ్యాతి చెందిన ఈ అభయారణ్యం గుండ్ల బ్రహ్మేశ్వరం పీఠభూమిపై దక్షిణం నుంచి ఉత్తర దిక్కునకు వ్యాపించి ఉన్న నల్లమల్ల అడవుల పరిధిలోకి వస్తుంది.
ఈ అభయారణ్యం నుంచి గుండ్లకమ్మ నది ప్రవహిస్తుంది. కొండలు, గుట్టలు, లోయలతో విరాజిల్లే గుండ్ర బ్రహ్మేశ్వర అభయారణ్యం అరుదైన జీవజాతికి ఆశ్రయమివ్వడమే కాక పర్యాటకులకు నయనాందకరం కలిగించి మానసికోల్లాసాన్ని రేకెత్తించే సుందర వనంగా భాసిల్లుతున్నది. అక్టోబర్ నుంచి మే మాసం మధ్యకాలం ఈ అభయారణ్యాన్ని సందర్శించడానికి అనువైన కాలం.