ఎత్తైన పచ్చని కొండల నడుమ హొయలొలికే సరస్సులో బోటింగ్... మంత్ర ముగ్ధుల్ని చేసే ప్రకృతి అందాలతో మనసును రంజింప చేసే లోయలు, కొండలు... చుట్టూ అడవిలాంటి ప్రాంతం, పెద్ద పెద్ద చెట్లు... వీటి మధ్య కూర్చుని సరదాగా స్నేహితులతో కబుర్లు... చాలా బావుంటుంది కదూ! నిత్యం కాలుష్యం మధ్య, హడావుడి ప్రపంచంలో బతుకుతూ విసిగి వేసారిన వారికి ఆటవిడుపు ఈ పర్యాటక ప్రాంతాలు. వేసవి కాలంలో చూడాల్సిన ప్రాంతాల్లో ఒకటి కేరళలోని తేక్కడి.
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉందీ తేక్కడి. సహజసిద్ధమైన ప్రకృతిని చూడాలనుకునే ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక చక్కని స్పాట్. ఈ ప్రదేశంలో ఉన్న పెరియార్ జంతు సంరక్షణ కేంద్రం ఇక్కడ ఉన్న ముఖ్యమైన ప్రాంతాలలో ఒకటి. ఈ సంరక్షణ కేంద్రంలో వివిధ రకాల పక్షులు, జంతువులు మనకు కనిపిస్తాయి.
ఇక్కడ పండే కాఫీ, టీ, మిరియాలు అన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ఇక్కడికి వెళ్లిన వారు తప్పకుండా ఈ వీటిని తమ వెంట తెచ్చుకుంటారు. ఇక్కడ వీచే గాలిలోనే మీరు వీటి వాసనను రుచి చూడవచ్చు. ఇక్కడ ఉన్న పెరియార్ నది మీ మనసుకు హాయి, ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇక్కడ వీచే చల్లని గాలి వేసవి తాపాన్ని మర్చిపోయేలా చేస్తుంది.
ఇక్కడ చేసే బోటింగ్ మీ మధుర జ్ఞాపకాల్లో తప్పకుండా మిగిలిపోతుంది. సెప్టెంబర్ నుంచి మే మధ్యకాలంలో తేక్కడికి చేరుకోవచ్చు. మిగతా సమయం వర్షా కాలం కాబట్టి, ఇబ్బంది పడవలసి వస్తుంది. బిజీగా ఉన్న మీ మనసుకు హాయి, ప్రశాంతత, తృప్తినిచ్చే శక్తి ఈ ప్రాంతంలో ఉంది. మీ జీవితంలో మరపురాని అనుభూతిని పంచి ఇచ్చేందుకు తేక్కడి సిద్ధంగా ఉంటుంది.
------------------