ఇకపై కర్ణాటక రాష్ట్రంలో అటవీ ప్రాంతాలకు, 'జూ'కు వెళ్లాలంటే తప్పనిసరిగా ఏనుగు మీద సవారి చేయాల్సిందే. ఈ తరహా విన్నూత్న పథకానికి శ్రీకారం చుట్టాలని అటవీ శాఖకు కర్ణాటక ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ తాజా సూచనతో ఇకపై కర్నాటకకు విచ్చేసే పర్యాటకులు అక్కడి జాతీయ పార్కులు, అటవీ ప్రాంతాలను సందర్శించేందుకు వాహనాలకు బదులుగా ఏనుగులను వినియోగించే సరికొత్త విధానం అమల్లోకి వస్తుంది.
బెంగుళూరులో మంగళవారం జంగిల్ రిసార్ట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాప్‌కు విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర అటవీశాఖ సంరక్షణ ప్రధాన అధికారి ఏకేవర్మ మీడియాతో మాట్లాడుతూ ప్రయోగాత్మకంగా తొలిదశలో షిమోగా అటవీ ప్రాంతాలు, బాద్రా వన్యప్రాణి జీవుల సంరక్షణా కేంద్రంలో ఏనుగులపై పర్యాటకుల సందర్శన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
ఈ పథకానికి పర్యాటకుల నుంచి లభించే స్పందనను అనుసరించి దీన్ని ఇతర ప్రాంతాలకు కొనసాగించేది నిర్ణయించబడుతుందని వర్మ పేర్కొన్నారు. పర్యాటకులను చేరవేసేందుకు ఉపయోగించే ఏనుగులు ఏ మేరకు భారాన్ని భరిస్తాయనే దానిని అధ్యయనం చేయవలసి ఉందని వెల్లడించారు. పూర్తి అటవీ ప్రాంతాన్ని సందర్శించే క్రమంలో ఏనుగులు ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి కనుక పర్యాటకులు ఈ పథకానికి ఏ మేరకు మొగ్గు చూపుతారనేది కూడా పరిగణనలోకి తీసుకోవలసిన అంశంగా వర్మ తెలిపారు.
అటవీశాఖ అధీనంలో గల సుమారు 200 ఏనుగులను వాహనాల స్థానంలో భర్తీ చేసినట్లయితే అటవీ ప్రాంతాలలో వాతావరణ కాలుష్య నియంత్రణ గావించవచ్చని... అనేక మంది పర్యాటకులు కూడా ఈ ప్రతిపాదనను అంగీకరిస్తున్నారని వర్మ తెలిపారు.