తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో గల వేదారణ్యంలోని కొడైకారై బర్డ్ సాంక్చూరిని సందర్శించే వలస పక్షుల సంఖ్య ఈ సంవత్సరం తగ్గిపోయింది. బంగాళాఖాతం సముద్ర తీరానికి ఆనుకొని ఉండే ఈ సాంక్చూరి ఆర్కిటికా మరియు అంటార్కిటికా, రష్యా మరియు ఐరోపా నుంచి వలస వచ్చే పక్షులకు ప్రీతిపాత్రమైన గమ్యస్థానంగా పేరుగాంచింది. ప్రపంచానికి మరోవైపున ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అరుదైన పక్షులు ఇక్కడకు వలస వస్తుంటాయి.
అయితే, తమిళనాడులో నైఱుతి రుతుపవనాలు కొనసాగుతుండటంతో వలస పక్షుల సంఖ్య తగ్గిపోయిందని బర్డ్ సాంక్చూరి రీసెర్చి ఆర్గనైజేషన్ తెలిపింది. సాధారణంగా, అక్టోబర్-జనవరి మధ్యకాలంలో అరుదైన పక్షులు సాంక్చూరిని సందర్శిస్తుంటాయి. వాతావరణంలో తలెత్తిన మార్పులతో పక్షుల సంఖ్య తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాంక్చూరిలో పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పే ప్రతిపాదనను కేంద్రానికి అందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.