తిరుపతి, తిరుమలలో కురుస్తున్న భారీ వర్షానికి శేషాచలం అందాలు అన్నీ ఇన్నీ కావు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లతో పాటు, తిరుమల నుంచి తిరుపతి వచ్చే ఘాట్ రోడ్‌లో శేషాచలం అందాలను చూసి భక్తులు మైమరచిపోతున్నారు. ఏడుకొండలను దట్టంగా కప్పేసిన మంచు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎంతో చల్లధనంతో తిరుమల గిరులు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు పడుతున్న వర్షంతో చిరుజల్లులలోనే తడుస్తూ భక్తులు ముగ్థులవుతున్నారు.
మరోవైపు భారీ వర్షానికి తిరుమలలోని జలాశయాలన్నీ నీటితో నిండిపోయాయి. కుమారధార - పసుపుధార, గోగర్బ డ్యాంలు నీటితో నిండిపోయాయి. ఈ రెండు డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. మరోవైపు తిరుపతిలోకి కపిలతీర్థం మాల్వాడి గుండం నుంచి వర్షపు నీరు పడుతోంది.
వేగంగా పడుతున్న నీటిని చూస్తూ భక్తులు తమని తాము మైమరచిపోతున్నారు. సాధారణంగా వర్షాకాలంలో మాత్రమే ప్రాజెక్టులు నిండడం, శేషాచలం కొండల నుంచి నీరు వస్తుంటుంది. అయితే వేసవి కాలంలో ఇలాంటి ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తున్న భక్తులు ఒకవైపు ఆశ్చర్యానికి లోనవుతూ మరోవైపు ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.