Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రకృతి రమణీయతకు నిలయం... కంబాలకొండ

Advertiesment
ప్రకృతి రమణీయతకు నిలయం... కంబాలకొండ
, సోమవారం, 13 అక్టోబరు 2008 (16:28 IST)
నగరజీవితంలో విసిగి వేశారిన జీవితాలకు ఎక్కడికైనా వెళ్లి కొంతసేపు ప్రకృతి ఒడిలో సేదతీరాలని అనిపించడం మామూలే. నగరంలోని రణగొణ ధ్వనులనుంచి స్వచ్ఛమైన ప్రకృతిని ఆస్వాదించగలిగే అలాంటి ప్రదేశాన్ని సందర్శించే ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.

అలా ప్రకృతి రమణీయతతో సింగారించుకున్న ఓ చక్కటి ప్రదేశం ఏదీ అంటే విశాఖపట్నంకు సమీపంలో ఉన్న కంబాలకొండ అంటూ నిస్సందేహంగా చెప్పవచ్చు. అటవీప్రాంతంలో పర్యాటకుల కోసం దాదాపు 80 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఎకో టూరిజం ప్రదేశం పర్యాటకులకు సిసలైన ప్రకృతి అనుభూతిని అందిస్తూ వస్తోంది.

గిరిజనులచే నిర్వహించబడుతోన్న ఈ టూరిజం స్పాట్ చక్కని ప్రకృతి ప్రదేశానికి నిలయంగా ఉంటోంది.

కంబాలకొండ విశేషాలు
పర్యాటకులు వివరించేందుకు, తిలకించేందుకు వీలుగా ఈ కంబాలకొండ టూరిజం ప్రదేశంలో ఎన్నో సౌకర్యాలున్నాయి. ఈ టూరిజం ప్రదేశంలో ఉన్న నెమళ్లు, కుందేళ్లు, చిరుతలు, పాల పిట్టలు లాంటివి పర్యటకుల మనసు దోచేసుకుంటాయి. అలాగే ఈ ప్రదేశంలో పర్యాటకులు తనివితీరా ఆనందించడానికి వీలుగా రివర్ క్రాసింగ్, బోటింగ్ సౌకర్యాలతో పాటు ట్రెకింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి.


ఈ కంబాలకొండ చెప్పుకోవడానికి పార్క్ అయినా ఇక్కడి విశేషాలు ఎంతో విశిష్టంగా ఉంటాయి. ఈ పార్కులో పెంచబడుతోన్న జంతువులు పర్యాటకులకు చక్కని అనుభూతిని అందిస్తాయి. ఇక్కడ పెంచబడుతోన్న నెమళ్ల సౌందర్యాన్ని ప్రతివారూ చూచి తరించాల్సిందే. ఇక్కడి చెట్లపై నివశించే వివిధ రకాల పక్షుల కిలకిలరావాలతో ప్రకృతి సోయగాలు మనకళముందే నిలుస్తాయి.

వీటితోపాటు ఈ పార్కులోని కొండపై ఓ వాచ్ టవర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ టవర్‌పైకి చేరుకుని చుట్టూ విస్తరించిన అడవి అందాలను తిలకిస్తూ ప్రకృతి ఒడిలో మైమరచి పోవచ్చు. అలాగే ఈ పార్క్‌లో ఉన్న జంబాల జలాశయంలో చాలినన్ని నీళ్లు ఉన్న సమయంలో బోటింగ్‌కు కూడా అనుమతిస్తారు. ఈ జలాశయంలో బోటింగ్ చేయడం ఓ చక్కని మర్చిపోలేని అనుభూతిగా నిలుస్తుంది.

వీటితోపాటు కొంచెం సాహసక్రీడలు కూడా చేయాలనుకునేవారికి రోప్ వేతో కూడిన క్రాసింగ్, తాళ్ల ద్వారా కొండలెక్కే ట్రెకింగ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు
కంబాలకొండ అటవీ ప్రదేశం విశాఖపట్నంకు అతి సమీపంలోనే ఉంది. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కంబాలకొండ ప్రాంతానికి ఆటోలు, ఇతర ప్రయాణ సౌకర్యాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ అటవీప్రాంతంలో పర్యాటకుల కోసం కాటేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. పార్కులో ఉదయం తొమ్మిదింటి నుంచి ఐదింటివరకు విహరించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu