Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రకృతి ఒడిలో "రంగనతిట్టు పక్షి ధామం"

ప్రకృతి ఒడిలో
అంటార్కిటికా, ఉత్తర అమెరికా, చైనా, సైబీరియా, నైజీరియాల్లాంటి సుదూర ప్రాంతాల నుంచి మే-అక్టోబర్ మాసాల మధ్య అతిథులుగా విచ్చేసే విగంహాలకు కొలువైన ప్రాంతమే రంగనతిట్టు పక్షి విహార కేంద్రం. మాండ్య జిల్లాలోని కావేరీ నదీ మధ్యభాగంలో, 57 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ కేంద్రం శ్రీరంగపట్నానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అదే మైసూరుకు 19 కిలోమీటర్లు, బెంగళూరుకు 128 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రంగనతిట్టు. శ్రీరంగ పట్నం నుంచి బస్సులో వెళ్తే రంగనతిట్టు క్రాస్ రోడ్డు దగ్గర దిగి అక్కడినుంచి అర కిలోమీటర్ దూరం నడవాల్సి ఉంటుంది. మన దేశంలో నెలకొన్న అతి పెద్ద పక్షిధామాలలో రంగనతిట్టు ఒకటి కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఇక్కడ రకరకాల అందమైన పక్షులు చేసే అల్లరి ఓ పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. కొంగల బారులతో, పేర్లు తెలియని పక్షుల సందడితో ఆ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పుడూ ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది అని ఎవరికైనా అనిపించక మానదు. ముఖ్యంగా ఇక్కడికి నూతన దంపతులు ఎక్కువగా వస్తుంటారు.

పాయలు, పాయలుగా చీలి ప్రవహించే కావేరీనది... ఏపుగా పెరిగిన పచ్చని పంట పొలాలు, కొండ చిలువలు మత్తుగా నిద్రిస్తున్నట్లుండే పొడవైన రాతి బండలతో లంక పల్లెసీమలు ఆంధ్రలోని కోస్తాను తలపించక మానవు. ప్రతి సంవత్సరం మే నుంచి జూన్ వరకు వలస పక్షులు ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటాయి.

వీటిలో క్రాస్‌బర్, హెరాన్, నైట్ హెరాన్, రాబిన్, స్పూల్బిల్, పెయింటెడ్ స్ట్రోక్, స్మాల్ ఇగ్రెల్, జంగిల్ బాబ్లర్, క్రాస్‌బల్, ఫ్లెమింగో.. మొదలైన మరెన్నో పేరు తెలియని దాదాపు 80 రకాల పక్షులను రంగనతిట్టులో చూడవచ్చు. పక్షుల కిలకిలా రావాలతో కళకళలాడుతుండే ఈ ప్రదేశాన్ని తిలకించేందుకు ప్రతియేటా వేలాది పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు.

రంగనతిట్టు పక్షిధామం ప్రవేశ ద్వారం వద్ద పెద్ద వెదురు చెట్ల సమూహం ఉంటుంది. అక్కడ వెదురుతో కట్టిన అందమైన కాంటిన్ కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. లంకల్లో అక్కడక్కడా పాతిన సైన్‌బోర్డులలో రకరకాల పక్షుల వివరాలను పొందుపరచి ఉంటారు. సూర్యోదయం సమయంలో ఈ ప్రదేశం స్వర్గధామంలా ఉంటుందంటే అతిశయోక్తి కాదు.

ఈ పక్షిధామంలో విదేశీ పక్షులతో పాటు మన దేశానికి చెందిన బుల్‌బుల్ పిట్టలు, నెమళ్లు కూడా పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. ఓపెన్ బిల్డ్ స్టార్క్ అనే పక్షులు చెట్ల నిండా కనిపిస్తుంటాయి. ఈ పక్షులు పునరుత్పత్తి కాలంలో తెల్లగా ఉండి మిగిలిన సమయాలలో గౌర వర్ణంతో కూడిన తెలుపుతో ఉంటాయి. వీటి ముక్కు మధ్య భాగంలో ఖాళీ ఉండటంవల్ల వాటికి ఓపెన్ బిల్డ్ స్టార్క్ అనే పేరు వచ్చిందట.

ఇకపోతే అన్ని పక్షుల్లోకెల్లా అందమైనవి పెద్దసైజు "ఇగ్రెట్"లట. ఇవి గుడ్లు పెట్టే కాలంలో ఈకలు లేకుండా, నేత్రాల వద్ద పచ్చని చారలతో కనిపిస్తాయి. ఇవి గూళ్ళు నిర్మించుకోవు, ఆరుబయటి ప్రదేశాలలోనే కాలం వెళ్లదీస్తుంటాయి. ఆకాశంవైపు ముక్కుని ఎత్తిపెట్టి తమ ఈకలను విదిలిస్తూ ఉంటాయి. ఈ పక్షుల అందమైన ఈకల కోసం వేటగాళ్లు వీటిని నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంటారు కూడా.

నైట్ హెరాన్ అనే పక్షులయితే ఉదయం నుంచి, సాయంకాలం దాకా ఓ విగ్రహంలాగా రాళ్లపై నిలబడి, ఆహారం కోసం దొంగ జపం చేస్తుంటాయి. నేత్రాలకు కమ్మనైన విందు, మనస్సుకు ప్రశాంతతను అందించే ఈ రంగనతిట్టు పక్షి ధామం, మైసూరుకు వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా చూడాల్సిన చక్కనైన ప్రదేశం అని చెప్పవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu