Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పక్షుల కిలకిలా రావాల "కొత్త బంగారు లోకం"

పక్షుల కిలకిలా రావాల
FILE
ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం "కొల్లేటి సరస్సు". కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన ఈ మంచినీటి సరస్సు.. లక్షకు పైగా ఎకరాలలో వ్యాపించి ఉంది. మనోహరమైన ప్రకృతి సౌందర్యాన్ని తనలో ఇముడ్చుకున్న ఈ సరస్సు.. ఎన్నో రకాల చేపలకు కూడా నిలయమే. ముఖ్యంగా అనేక విదేశీ పక్షులకు ఇది మెట్టినిల్లుగా పేరు సంపాదించుకుంది.

కొల్లేటి సరస్సుకు కూతవేటు దూరంలో ఉండే పచ్చపచ్చని చెట్లన్నీ సంవత్సరంలో ఆరు నెలలపాటు విదేశీ పక్షులకు స్థావరాలుగా మారుతుంటాయి. ముఖ్యంగా రుతువులను బట్టి ఆస్ట్రేలియా, నైజీరియా, సైబీరియా, ఫిలిఫ్ఫీన్స్, ఈజిప్ట్.. లాంటి దేశాల నుంచి ఇక్కడికి వచ్చే వలస పక్షులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. ఇక్కడికి వచ్చే వలస పక్షులలో పరజ, పురాజము, నులుగ పిట్ట.. మొదలైనవి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.

ఆసియా ఖండంలోకెల్లా అతి పెద్ద మంచినీటి సరస్సుగా పేరుగాంచిన కొల్లేటి సరస్సు... విజయవాడ నగరానికి సుమారు 85 కిలోమీటర్ల దూరంలోని కైకలూరు వద్ద ఉంది. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుండి సీజన్ల వారీగా వలస పక్షులు వచ్చి వెళుతుంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో వలస వచ్చే పక్షులు పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. బాతులు, ఓపెన్‌బిల్‌ స్టార్క్‌, పెరాన్‌, ఫ్లెమింగో, గ్రే పెలికాన్‌ వంటి నీటి పక్షులు ఇక్కడికి సీజన్‌లో సేద తీర్చుకునేందుకు వస్తుంటాయి.

సాధారణంగా నవంబర్ నెల నుంచి కొల్లేరుకు వలస పక్షుల రాక ప్రారంభమవుతుంది. ఈ కాలంలో రకరకాల కొత్త పక్షులు తరలివచ్చి కొత్త బంగారు లోకాన్ని తలపిస్తూ... ఈ ప్రాంతానికి ఓ నూతన శోభను తీసుకొస్తుంటాయి. నల్లకొంగ, ఎర్రకొంగ, సముద్రపు రామచిలుక, శాండ్ పైపర్ మల్లార్డ్, కష్టర్డ్ పోబర్డ్, రెడ్ ష్కాంప్ లాంటి వందలాది రకాల పక్షులు కొల్లేరుకు విచ్చేస్తుంటాయి.

సైబీరియా తదితర దేశాల నుంచి వలస పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సుందరమైన కొల్లేరును చేరుకుని.. ఆ సమీప ప్రాంతాల్లోని చెట్లపై తలదాచుకుంటుంటాయి. ఏ దేశం నుండి వలస పక్షులు కొల్లేటి ప్రాంతానికి వచ్చినా ఇక్కడే తమ జాతిని అభివృద్దిని చేసుకుని, కుటుంబ సమేతంగా తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లి పోతుంటాయి. పైగా ఇవి వెళ్ళే టప్పుడు కూడా ఒంటరిగాగానీ, జంటలుగాగానీ వెళ్ళకుండా.. పెద్ద పెద్ద గుంపులుగా వెళ్తూ చూసే పర్యాటకులను అబ్బుర పరుస్తుంటాయి.

webdunia
FILE
ఈ ప్రాంతం ఉదయం, సాయంత్రం వేళల్లో పక్షుల కిలకిలా రావాలతో సందడి చేస్తూ.. ప్రతిమదినీ పులకరింపజేస్తుంటుంది. ఈ సరస్సులో ప్రయాణించినప్పుడు ఆ వలస పక్షులను చూసేందుకు రెండు కళ్లూ సరిపోవనిపిస్తుంది. అయితే మనుషుల అలికిడి వింటేనే అవి కనుచూపు మేరలో కూడా ఉండేందుకు ఇష్టపడవు. అందుకనే వాటి సౌందర్యాన్ని చూసి మైమరచి పోవాలంటే.. ఏ మాత్రం శబ్దం లేకుండా చాలా నెమ్మదిగా వెళ్లాలి సుమా..!

ఇదిలా ఉంటే.. విదేశాల నుంచి తరలివచ్చే ఈ వలస పక్షులు, కైకలూరు మండలంలోని ఆటపాక గ్రామం వద్ద గల పిట్టలదొడ్డిలో మాత్రమే చెట్లపై గూళ్లు కట్టుకుని నివసిస్తాయి. ప్రతిరోజూ అవి వేటను ముగించుకుని సాయంత్రపు వేళ ఇక్కడికి చేరుకుంటాయి. వేట ముగించుకుని గూళ్లకు వచ్చే సమయంలోనూ, ఉదయం వేళల్లోనూ ఈ పక్షుల సందడి అంతా ఇంతా కాదు.

ఈ పిట్టలదొడ్డి ప్రాంతంలో పక్షుల సంఖ్య అధిక సంఖ్యలో ఉండటం.. పక్షుల, సరస్సు వివరాల ఫొటో ఎగ్జిబిషన్, తగిన వివరాలను తెలియజేసే పర్యావరణ విద్యాకేంద్రం.. తదితరాలు ఉండటంతో పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే ఈ పిట్టలదొడ్డిలో తగిన నీటి వసతి లేని కారణంగా పక్షులు, వివిధ రకాల మత్స్య జాతులు నీటికోసం అల్లాడుతుంటాయి.

దీంతో సుదూర ప్రాంతాల నుంచి వలస పక్షులను చూసేందుకు తరలివచ్చే విద్యార్థులు, పర్యాటకులకు నిరాశే మిగులుతోంది. కొల్లేటి సరస్సులో జరుగుతోన్న పలు అనధికారిక చర్యల వల్లనే ఈ పిట్టలదొడ్డి ప్రాంతానికి నీటి సౌకర్యం అందకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. దీంతో.. ఈ ప్రాంత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఇప్పటికైనా పర్యాటక శాఖ తగిన నీటి వసతిని ఏర్పాటు చేయాలని విద్యార్థులు, పర్యాటకులు కోరుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu