Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవ జంటల హనీమూన్ ఆనందాల నెలవు "కొడగు"

నవ జంటల హనీమూన్ ఆనందాల నెలవు
నూతన దంపతుల తొలి అడుగులకు మడుగులొత్తే సుందరమైన కొండల ప్రాంతమే "కొడగు". ఇది కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో ఉండే కొండలు, అడవులతో నెలకొని ఉంటుంది. దీనినే బ్రిటీష్‌వారు కూర్గు అనే పేరుతో పిలిచేవారు. కనుచూపు మేరలో ఎటుచూసినా కాఫీ తోటలు, మిరియాలు, యాలకుల తోటలతో సుమనోహరంగా ఉంటుందీ ప్రాంతం.

డమికెరె ప్రాంతం నంచి ఎటువైపు చూసినా కాఫీ తోటలు, ఆ తోటల మధ్యలో నివాసం ఏర్పరుచుకున్న ప్రజలు అగుపిస్తారు. ఇక ఏ రుతువులోనయినా సరే, ఉష్ణోగ్రత 20-25 డిగ్రీలకు మించని కొడగు ప్రాంతంలో ఏ పనీ చేయకుండా అలాగే కూర్చున్నా కాలం ఇట్టే హాయిగా గడచిపోతుంది.

ఎక్కడికెళ్లినా పచ్చదనం, నీలి ఆకాశం దానికింద పెద్ద పెద్ద లోయలు, ఆ లోయలలో ప్రవహించే అందమైన సెలయేర్లు, అక్కడక్కడా జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కొడగు ప్రాంతంలోనే కావేరీ నది జన్మించింది. కావేరీ నదీ ప్రవాహం ఆధారంగా చేసుకుని ఆ ప్రాంతంలో ఎన్నెన్నో విహార యాత్రా స్థలాలు రూపుదిద్దుకున్నాయి.

కావేరీ నదిలో నౌకా విహారం, ఏనుగుల మందల షికారు, గిరిజనుల ఉత్సవాలు... మొదలయిన వాటినన్నింటినీ కలగలిపి చూడాలంటే, నాలుగైదు రోజులకు మించే సమయం పడుతుంది. పిల్లలు, పెద్దలు, ముసలివారు, ముఖ్యంగా కొత్తగా పెళ్లయినవారు.. ఇలా ఎవరైనా సరే కొడగు సౌందర్యానికి దాసోహం అనక తప్పదు.

ఇక చివరిగా... కాఫీ ప్రియులకు కూర్గు కాఫీ అమృతం కంటే రుచిగా, మధురంగా ఉంటుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే, ఇక్కడి కాఫీ రుచికి ఎన్ని కప్పులయినా అలా తాగుతూనే ఉండాలనిపిస్తుంటుంది. అక్కడి కాఫీ తాగి నాణ్యమైన యాలకులు నోట్లో వేసుకుంటే, గాలిలో తేలిపోతున్నట్లనిపిస్తుంది. అలాంటి సువాసనను ఆస్వాదిస్తూ, కొత్త దంపతులు తొలిరాత్రుల ఆనందాన్ని హాయిగా అనుభవించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu