Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుర్రం ముఖంతో దర్శనమిచ్చే "కుద్రేముఖ్"

గుర్రం ముఖంతో దర్శనమిచ్చే
గుర్రం ముఖం ఆకారంగా కనిపించే పర్వతాలు, కదంబి జలపాతం పరవళ్లు, దట్టమైన అడవుల కలబోతతో కూడుకున్నదే కుద్రేముఖ్ జాతీయ వనం. కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మంగళూరు జిల్లాలో నెలకొన్న ఈ పర్వత శ్రేణులు.. గుర్రం ముఖం ఆకారంతో ఉండటంవల్ల వాటికి "కుద్రేముఖ్" అనే పేరు వచ్చింది. కన్నడ భాషలో కుద్రే అంటే గుర్రం, ముఖ్ అంటే ముఖం అని అర్థం.

దట్టమైన అడవుల మధ్యన, వైవిధ్యమైన వృక్ష.. వన్యమృగ సంపద ఉండే ఈ పర్వత శ్రేణులను చేరుకునే దారి ఆద్యంతం ప్రకృతి రమణీయతకు అద్దంపట్టేలా ఉంటుంది. తుంగ, భద్ర, నేత్రావతి నదుల జన్మస్థానం కూడా ఈ పర్వత శ్రేణుల మధ్యనే ఉండవచ్చునని అక్కడివారు చెబుతుంటారు. అలాగే, 1.8 మీటర్ల ఎత్తుండే భాగవతి, వరాహ విగ్రహాలు కలిగిన గుహ కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
హనుమాన్ గుండి జలపాతం
  కలస ప్రాంతానికి 32 కిలోమీటర్లో దూరంలో గల హనుమాన్ గుండి జలపాతం పర్యాటకులకు ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ జలపాతం నుండి పడుతున్న నీటి వల్ల వంద అడుగుల ఎత్తుగల సహజ సిద్ధమైన శిలలు ఏర్పడ్డాయి. కొండలు అధిరోహించే ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదేశం చాలా...      


కార్కళ అనే ప్రాంతానికి 48 కిలోమీటర్ల దూరంలోను, కలస ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉండే ఈ కుద్రేముఖ్ పర్వతశ్రేణుల మీద ఒక చిన్న పట్టణం కూడా వెలసింది. ఇక్కడ సమృద్ధిగా దొరికే ఉక్కుగనులవల్ల కర్ణాటక ప్రభుత్వం "కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ (కేఐఓసీఎల్)" అనే ఒక ఉక్కుశుద్ధి కర్మాగారాన్ని ఎర్పాటు చేసింది. ఇక్కడ పనిచేసేవారి నివాస స్థలం కోసం ఇక్కడ ఆ పట్టణాన్ని నిర్మించారు.

జలజలా పారే తుంగ, భద్ర నదుల పరవళ్లతో పాటు... కుద్రేముఖ్‌ను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది "కదంబి జలపాతం". అలాగే ఈ జాతీయ వనంలో కనిపించే వన్యమృగాలలో మలబార్ సివెట్, వేట కుక్కలు, స్లాత్ ఎలుబంటి, మచ్చలతో ఉండే జింకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

600 వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ కుద్రేముఖ పర్వతాలు... పశ్చిమ కనుమలలో ఉండే సతత హరితారణ్యాలలోకెల్లా అతిపెద్ద సంరక్షిత స్థలంగా గుర్తింపు పొందింది. జంతు వైవిధ్యం ఉండి ప్రపంచం మొత్తంమీదా సంరక్షిత స్థలాలుగా ఎన్నుకోబడిన 25 ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది కుద్రేముఖ్. వన్యప్రాణి సంరక్షణా సంస్థ మరియు వరల్డ్ వైడ్ ఫండ్-యూఎస్ఏ చేత ఆవిష్కరించబడ్డ ఈ కుద్రేముఖ జాతీయ ఉద్యానవనం "గ్లోబల్ టైగర్ కన్జర్వేషన్ ప్రాపర్టీ-1" కిందకు వస్తుంది.

కుద్రేముఖ్ జాతీయ వనం పశ్చిమాన సోమేశ్వర వన్యమృగ సంరక్షణా స్థలానికి ఆనుకుని ఉంటుంది. దక్షిణంవైపు సన్నటి రోడ్డుతో పుష్పగిరి వన్య సంరక్షణా స్థలానికి అనుసంధానించబడి ఉంటుంది. ఈ ఉద్యానవనం దక్షిణ-పశ్చమ దిశల్లో నిటారుగా ఉండే లోయ ప్రాంతాలను కలిగి ఉంటుంది. వీటి శిఖరపు ఎత్తు వంద మీటర్ల నుంచి 1892 మీటర్లదాకా ఉంటుంది. అలాగే దీని ఉత్తర, మధ్య మరియు తూర్పు భాగాలు... కొండల గొలుసుల్లాగా ఏర్పడి ఉన్నాయి. వీటి పచ్చికబయళ్లతో ఈ ప్రాంతం పచ్చటి తివాచీలాగా దర్శనమిస్తుంది.

కలస ప్రాంతానికి 32 కిలోమీటర్లో దూరంలో గల హనుమాన్ గుండి జలపాతం పర్యాటకులకు ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ జలపాతం నుండి పడుతున్న నీటి వల్ల వంద అడుగుల ఎత్తుగల సహజ సిద్ధమైన శిలలు ఏర్పడ్డాయి. కొండలు అధిరోహించే ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. అక్టోబరు-మే నెలల్లో ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు.

కుద్రేముఖ్ పర్వతాల చరిత్రను చూస్తే... 1916 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం కుద్రేముఖ్‌ని సంరక్షణా స్థలంగా నిర్ణయించి, అడవుల నరికివేత నుంచి కాపాడింది. ప్రముఖ వన్య సంరక్షణా నిపుణుడు, పులులమీద పరిశోధన చేసిన నిపుణుడూ అయిన "ఉల్లాస్ కరనాడ్" అంతరించిపోతున్న సింహపు తోక కోతి లేదా "ప్రాచీన కాలపు కోతి" మీద 1983-84 సంవత్సరాల మధ్య పరిశోధన చేసి.. తన నివేదికను కర్ణాటక ప్రభుత్వానికి సమర్పించారు.

ఉల్లాస్ కరనాడ్ తన పరిశోధనల్లో సింహం తోక కోతులు ఈ ప్రాంతంలో జీవించేవని, ఈ ప్రాంతంలోనే కాక పశ్చిమ కనుమలలోను, మలబార్ ప్రాంతంలోనూ జీవించేవని సూచించాడు. ఆయన పరిశోధనలు మరియు సూచనలను అనుసరించిన కర్నాటక ప్రభుత్వం, కుద్రేముఖ్ జాతీయ వనం స్థాపించేందుకు 1987లో ఆదేశాలనిచ్చింది. ఆ రకంగా కుద్రేముఖ్ జాతీయ వనం ఏర్పాటయ్యింది.

Share this Story:

Follow Webdunia telugu