Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాఫీ తోటల అందాల లోయ "సకలేష్‌ పూర్"

Advertiesment
కాఫీ తోటల అందాల లోయ
అద్భుతమైన ఆకుపచ్చదనాన్ని కప్పుకున్న ఎత్తయిన కొండలు ఓ వైపు, చిక్కటి కాఫీ తోటలు పరచుకున్న లోయలు మరోవైపు... ఈ రెండింటి మధ్యలో ఉండే సన్నటి ఘాట్ రోడ్డుపై మలుపులు తిరిగే ప్రయాణం... చదువుతుంటేనే మైమరిపించేదిగా ఉంది కదూ... ఇంత అందమైన ప్రాంతం పేరే సకలేష్ పూర్.

కర్నాటకలోని హసన్‌కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ సకలేష్ పూర్. చిన్న ఊరే అయినప్పటికీ.. కాఫీ, యాలకులు, మిరియాల తోటలతో, సకల సిరిసంపదలతో తులతూగుతూ ఉంటుంది. ఈ ఊరికి దగ్గర్లోనే... చిక్‌మంగళూరుకు రెండుగంటల ప్రయాణించిన తరువాత ఓ అద్భుతమైన హిల్ స్టేషన్ మనకు స్వాగతం చెబుతుంది. దాని పేరు "కెమ్మణ్ణు గుండి". కెమ్మణ్ణు గుండి అంటే ఎర్రమన్ను గుంట అని అర్థమట.

కెమ్మణ్ణు గుండి హిల్ స్టేషన్‌కు వెళ్లే ఘాట్ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ మాత్రం ఒక అడుగు పక్కకి జరిగినా వాహనాలు ఎంచక్కా వెళ్ళి కాఫీ తోటల్లో పడిపోవడం ఖాయం. మెలికలు తిరిగిన రోడ్డు మధ్యలో అక్కడక్కడా కొండలమీద నుంచి తొంగి చూసే చిన్న చిన్న జలపాతాలు, చాలా దూరం దాకా వినిపించే వాటి గలగలలు, విరగబూసిన పేరు తెలియని పుష్పజాతులు.. చూస్తుంటేనే మనసుకు హత్తుకునే అందంతో మనల్ని ఆకట్టుకుంటాయి.

ఇక గమ్యం చేరాక.. దిగి నిలబడితే, ఆకుపచ్చటి శాలువా కప్పుకుని గంభీరంగా నిలబడ్డ ఎత్తైన పశ్చిమ కనుమలు, వాటిపై చిక్కగా అల్లుకుపోయిన అరణ్యం, కొద్ది దూరంలో అమ్మవారి గుడి నుంచి వినిపించే గుడి గంటలు, రోడ్డుపక్కనే స్వచ్ఛమైన నీటితో ప్రవహించే చిరుకాలువ, దానిమీద ఆవలి వైపుకు వెళ్ళేందుకు చిన్న వంతెన... ఆ అందాన్నంతా చూసేందుకు రెండు కళ్లూ చాలవనిపిస్తుంది.

ఇంత అనంతమైన సౌందర్యాన్ని చూస్తుంటే... దేవుడి అస్తిత్వంపై ఎవరికయినా రాజీలేని విశ్వాసం కలగకమానదంటే అతిశయోక్తి కాదు. ఇంత అద్భుత సౌందర్యం ఎవరి ప్రేరణా లేకుండా, తనంతట తానుగా ఆవిష్కృతమవుతుందంటే ఎవరమూ నమ్మలేము. అక్కడి ప్రకృతి సౌందర్యం విశ్వరూపం చూస్తుంటే... ఇంత అద్భుతమైన చిత్రాన్ని గీసిన ఆ చిత్రకారుడు భగవంతుడేనని నూటికి నూరుపాళ్ళూ ఒప్పుకుంటాం.

Share this Story:

Follow Webdunia telugu