మహారాష్ట్ర, నాసిక్ కొండలలో పుట్టి... వందకు పైగా చిన్నా, పెద్దా ప్రవాహాలను తనలో కలుపుకుని ప్రవహించే పావన గోదావరీ నదీమతల్లి, ఏలేరుపాడు దాటేసరికి దక్షిణాదిలోనే పెద్దనదిగా మనకు సాక్షాత్కరిస్తుంది. అలాంటి గలగలా పారే గోదావరికి రెండువైపులా ఆకాశాన్ని తాకే రీతిలో ఉండే కొండలనే పాపికొండలు అంటారు.
ఏలేరుపాడు నుంచి ముందుకు వెళ్లే కొద్దీ తూర్పున ఉండే "పాపికొండల" వరుసలు మనకు చేరువవుతుంటాయి. నది ఉత్తరపు ఒడ్డున "భద్రాద్రి" నుంచి పోచారం దాకా రోడ్డు సౌకర్యం ఉంటుంది. అలాగే దక్షిణపు ఒడ్డున ఉండే బూర్గుంపాడు నుంచి కోయిదా గ్రామందాకా కూడా రోడ్డు సౌకర్యం ఉంటుంది.
పోచారం, కోయిదా గ్రామాలు గోదావరీ నదీమతల్లికి ఎదురెదురుగా ఉండే గ్రామాలు. ఇక్కడి నుంచే పాపికొండల వరుసలు మొదలవుతాయి కాబట్టి, నదికి ఇరువైపులా ఉండే రోడ్డు అంతటితో ఆగిపోతుంది. నదిలో మరికొంతదూరం వెళ్లగానే ఆ కొండల నడుమ... దక్షిణపు ఒడ్డున ప్రసిద్ధ యాత్రాస్థలం "పేరంటాల పల్లి" వస్తుంది. అక్కడి నుండి ఉత్తర, దక్షిణంగా వ్యాపించిన పాపికొండలు మనకు ఎదురు నిలుస్తాయి.
ఇరువైపులా వ్యాపించి ఉన్న ఆ కొండల నడుమ నది తన వైశాల్యాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ మెలికలు తిరుగుతూ సాగుతుంది. మరి కొంతదూరం ముందుకు పోగానే "వి" ఆకారంలో చీలిన 'పాపికొండల' శిఖర సమీపానికి వస్తాము. గోదావరీమాత ప్రార్థన విన్న ఆ దేవేంద్రుడే తన వజ్రాయుధంతో పర్వత శిఖరాన్ని ఛేదించి చేసిన త్రోవ కాదుకదా అనిపించేటట్లు ఉంటుంది ఆ ప్రాంతం.
అంత చిన్న ఇరుకైన సందులో ఇమిడిపోయి గోదావరి ముందుకెలా వెళ్తుందా అనే ఆశ్చర్యం ఓ వైపు... ఈ ఇరుకైన సందులో అసలు నది ప్రవహిస్తోందా... లేదా ఆగిపోయిందా.. అనే విస్మయం మరోవైపు మనసులో సుడులు తిరుగుతుండగా.. మెల్లగా పాపికొండల గండిలోకి ప్రవేశిస్తాం.
ఆ ఇరుకైన సందులో... పరిశీలనగా చూస్తే తప్ప కనిపించని నీటి చలనానికి విస్మయం చెందుతాము. ఆ చిన్న గండిలో నిలబడి (స్టీమరు మీద) రెండుగా చీలిన శిఖర దృశ్యాలను చూడాలంటే తలమీద టోపీగానీ, ఇతర వస్తువులుగానీ ఉంటే కింద పడిపోయేంతగా... తలపైకెత్తి, వెనక్కి వంచిమరీ చూడాల్సి ఉంటుంది.
వానాకాలం నది వరదలలో ఉన్నంతకాలం అంటే ఆగస్టు నెల వరకు ఆ చిన్న గండి దగ్గర నది పాపికొండలను ఒరుసుకోవడం వల్ల అక్కడ నీరు గుండ్రంగా సుడి తిరుగుతుంటుంది. నేర్పరి అయిన నావికుడు మాత్రమే తన నౌకను ఆ సుడిలో చిక్కుబడకుండా తప్పించుకొని ముందుకు తీసుకుపోగలడు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఆ సుడి నావను తన లోనికి లాక్కొని ముంచేస్తుంది. ఆ సుడి ముందు మరపడవలు కూడా నిలువలేవు.
పాపికొండలకు ఈ పేరు ఎలా వచ్చిందంటే... ప్రతి సంవత్సరం నైపుణ్యంలేని నావికుల వల్ల, కొంతమంది నావికుల అజాగ్రత్త వల్ల, మరికొందరి అతి జాగ్రత్త వల్ల, పడవలో ప్రయాణించే ప్రయాణికుల తెలివి తక్కువతనం వల్ల... ఎన్నో పడవలు పైన చెప్పుకున్న సుడిలో చిక్కుకుని... ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ పాపి కొండలు మార్మోగేవి.
అలా మునిగిపోయి చనిపోయిన అభాగ్యుల బంధువులు ఈ కొండలను చూచినపుడు ఈ "పాపపు కొండల" గండే మావాళ్లను పొట్టన పెట్టుకుందంటూ శాపనార్థాలు పెట్టేవారు. ఆ పాపపు కొండలనే ఇప్పుడు పాపికొండలుగా పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద మర పడవలు వచ్చాక ఆనాటి పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది.
ఈ పాపికొండలు నెలకొన్న ప్రాంతమంతా.. అద్భుతంగా, ప్రశాంతంగా, సుందరంగా, రమణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణాన్ని చూసిన ఎవరైనా.. "ఆంధ్రా కాశ్మీర్" అనకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. ఈ పాపికొండలు ఉన్న ప్రాంతంలోనే "మునివాటం" అనే ప్రదేశం వద్ద ఒక జలపాతం ఉంటుంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది.
రాజమండ్రి నుంచి పాపికొండలదాకా చేసే లాంచీ ప్రయాణం పర్యాటకులకు ఒక మరచిపోలేని అనుభవంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. అయితే... ప్రస్తుతం కట్టబోతున్న పోలవరం ప్రాజెక్ట్ వల్ల పాపికొండల అందాలు కనుమరుగు అవబోతున్నాయి.