Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్లరి చేసే నీలగిరి కోతులు, చింపాంజీలు... ఇంకా ఉన్నాయ్!!

అల్లరి చేసే నీలగిరి కోతులు, చింపాంజీలు... ఇంకా ఉన్నాయ్!!
FILE
చుట్టూ దట్టమైన అడవి, ఆ అడవిలో పచ్చటి పచ్చిక బయళ్లు, దారి పొడవునా గలగలా పలుకరించే సెలయేళ్లు, ఈ సెలయేటి నీళ్లకోసం వచ్చే అడవి జంతువులు... వీటన్నింటినీ చూడాలంటే ఇడుక్కి జిల్లాలోని తేక్కడి అటవీ ప్రాంతానికి చేరుకోవాల్సిందే. ఇక్కడి అడవి జంతువులకు ఆవాసమైన "పెరియార్ వన్యమృగ సంరక్షణా కేంద్రం" పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూ ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది.

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో తమిళనాడు రాష్ట్ర సరిహద్దు పట్టణమైన కుమిలీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తేక్కడి అటవీ ప్రాంతం. ఈ దట్టమైన అడవి మధ్యలో సరస్సు, అందులో పడవ ప్రయాణం, అడవి మధ్యలో అటూ ఇటూ తిరుగాడే ఏనుగులు, నీటి కోసం బయటకు వచ్చే పులులు, అడవి దున్నలు.. చెట్లపై దుముకుతూ, వేలాడుతూ అల్లరి చేసే నీలగిరి కోతులు, చింపాంజీలు, చిరుతలు.. కనువిందు చేసే రకరకాల, రంగు రంగుల పక్షులు... ఇవన్నీ వింటుంటే ఏదో సినిమాలో దృశ్యం కాబోలు అనుకునేరు సుమా..! అలాంటిదేమీ కాదు. తేక్కడి అటవీ ప్రాంతంలో గల "పెరియార్ వన్యమృగ సంరక్షణా కేంద్రం"లోని దృశ్యాలే ఇవి.

ఈ పెరియార్ సాంక్చురీలోగల సరస్సులో పడవమీద ప్రయాణిస్తూ.. దానికి ఇరువైపులా ఉండే అడవిలో సంచరించే జంతువులను, వాటి ప్రవర్తనను అతి దగ్గరగా, సురక్షితంగా చూసే అవకాశం పర్యాటకులకు కలుగుతుంది. తేక్కడి అటవీ ప్రాంతంలోని జంతువుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1978వ సంవత్సరంలో పెరియార్ శాంక్చురీని ఏర్పాటు చేసింది.

webdunia
FILE
ఇందుకోసం అటవీ ప్రాంతంలోని సరస్సుకు ఇరువైపులా 777 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న అడవినంతటినీ వన్యప్రాణులకు ఆవాసంగా మార్చివేసింది. అయితే దేశంలోగల మిగతా శాంక్చురీలకు, పెరియార్ శాంక్చురీకి మధ్య గల తేడాను పరిశీలిస్తే.. సరస్సుకు రెండువైపులా ఉండటాన్ని పెరియార్ శాంక్చురీ ప్రత్యేకతగా చెప్పవచ్చు. అలాగే.. పడవల్లో ప్రయాణిస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ, జంతువులను అతి దగ్గర్నించీ చూడటం ఇంకో ప్రత్యేకత.

పెరియార్ శాంక్చురీలో తెలతెలవారుతుండగా బోటు షికారు చేస్తే.. ఉదయాన్నే నీటి కోసం తిరుగాడుతుండే జంతువులను హాయిగా చూసేయవచ్చు. ఉదయంపూట ఫొటోగ్రఫీకి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో పర్యటిస్తే బాగుంటుంది. వర్షాకాలం మినహాయించి సెప్టెంబర్ నుంచి మే నెల వరకు ఈ శాంక్చురీలో పర్యటించవచ్చు.

తేక్కడి అటవీ ప్రాంతంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోన్న ఈ పెరియార్ శాంక్చురీలోని సరస్సును.. బ్రిటీష్‌వారి కాలంలో మధురై పట్టణానికి తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు నిర్మించారు. బ్రిటీష్ ఇంజనీర్ కల్నల్ జె. పెన్నీ 1903వ సంవత్సరంలో ఈ సరస్సు నిర్మాణానికి రూపకల్పన చేశాడట.

కుమిలీ ప్రాంతం నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఈ సరస్సు బోటింగ్ సెంటర్‌కు చేరుకోవచ్చు. అటవీశాఖవారికి టోల్‌గేట్ చెల్లించి స్వంత వాహనాలలో కూడా ఇక్కడికి వెళ్లవచ్చు. ఇక అక్కడ్నించీ కేరళ పర్యాటక శాఖ వారు నిర్వహించే హౌస్ బోట్ల ద్వారా సరస్సు చుట్టూ ఉండే ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. అలాగే ఇక్కడ ట్రెక్కింగ్, ఏనుగు స్వారీ లాంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.

webdunia
FILE
అటవీశాఖ అధికారుల లెక్కల ప్రకారం పెరియార్ శాంక్చురీలో సుమారుగా 600 ఏనుగులు, 450 జింకలు, 550 ఎలుగుబంట్లు, 180 పొడవైన నీలగిరి కోతులు, 45 పులులు, 15 చిరుత పులులు, పెద్ద సంఖ్యలో నక్కలు, ఎగిరే ఉడతలు, రంగు రంగుల పక్షులు.. తదితరాలు పర్యాటకులను అలరిస్తున్నాయి.

కేవలం వన్యమృగాలకు నిలయం మాత్రమే కాకుండా.. ఇక్కడి అడవిలో రకరకాల సుగంధ ద్రవ్యాలు, జాజికాయ, జాపత్రి, మిరియాలు, పచ్చిపోకలు, యాలక్కాయలు, దాల్చిన చెక్కలతో కూడిన చెట్లు పెరుగుతుంటాయి. అలాగే రకరకాల మూలికలతో సిద్ధంగా ఉండే ఆయుర్వేద మందులషాపులు కూడా ఇక్కడ అడుగడుగునా కనిపిస్తాయి. ఇక ఆయుర్వేద మసాజ్ సెంటర్లయితే చెప్పనవసరం లేదు.

పెరియార్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీకి ఎలా చేరుకోవాలంటే..?

విమానంలో వెళ్లేవారయితే.. మధురై నుంచి 140, కొచ్చి నుంచి 190, తిరువనంతపురం నుంచి 190, కోజికోడ్ నుంచి 135, చెన్నై నుంచి 570 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక రైలు మార్గంలో అయితే శాంక్చురీకి దగ్గర్లో ఉండే రైల్వేస్టేషన్లు : చెన్నై నుంచి 60, చెంగనస్సరో నుంచి 114, మధురై నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అదే రోడ్డు మార్గంలో అయితే తేక్కడికి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమిలీ నుంచి అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.

ఇక వసతి విషయానికి వస్తే... పెరియార్ సాంక్చురీలో అడవి మధ్యలో నిర్మించిన కాటేజీలలో విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడ విశ్రాంతి తీసుకుంటుంటే.. గాలికి రాలుతున్న ఆకుల చప్పుడు, పువ్వుల పలుకరింపులు, అద్భుతమైన సుగంధ ద్రవ్యాల సువాసలకు మైరచిపోతామంటే అతిశయోక్తి కాదు. అందుకనే ప్రకృతి ప్రేమికులు, చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన రమ్యమైన ప్రాంతం "పెరియార్ వన్యమృగ సంరక్షణా కేంద్ర"మని చెప్పవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu