Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య: ఇప్పటి వరకూ ఈ కేసులో ఏం జరిగింది, సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యమవుతోంది?

వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య: ఇప్పటి వరకూ ఈ కేసులో ఏం జరిగింది, సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యమవుతోంది?
, మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (13:41 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ సొంత చిన్నాన్న వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య వెనుక ఉన్న మిస్టరీ ఏమిటో తేలడం లేదు. రెండేళ్లు దాటినా, మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు, రెండుసార్లు సీబీఐ బృందాలు విచారించినా వాస్తవాలు వెలుగులోకి రాలేదు. రాజకీయంగా దీనిపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. చివరకు ప్రమాణాలు చేసుకునేవరకూ వెళ్లింది.

 
ఓ వైపు కేసు విచారణలో జరుగుతున్న ఆలస్యం పట్ల వివేకానంద రెడ్డి కుమార్తె ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు సోషల్ మీడియాలో 'హూ కిల్డ్ బాబాయ్?' అంటూ సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ అంశంలో సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ డీజీపీ కార్యాలయం స్పందించింది.

 
ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో వివేకానందరెడ్డి హత్యకు కారణాలపై మొదలైన అనుమానాలు ఇటు కుటుంబపరంగా, అటు రాజకీయంగా వేడెక్కడంతో పాటు పోలీసు విభాగంలోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి మరణం తర్వాత ఏం జరిగిందన్నది పరిశీలిద్దాం..

 
ఆ రోజు ఏం జరిగింది?
2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత 15వ తేదీ తెల్లవారు జామున వై.ఎస్. వివేకానందరెడ్డి తన ఇంట్లో బాత్రూమ్‌‌లో విగతజీవిగా కనిపించారు. ముందు రోజు జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారం నిర్వహించి రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఇంటికి వచ్చారు. ఆ రోజు ఆయన ఇంట్లో ఒంటరిగానే ఉన్నారని ఆ తర్వాత పోలీసులు మీడియాకు తెలిపారు. ఆయన చనిపోయి పడి ఉన్న విషయం ఇంట్లో పని మనుషులు గుర్తించి చెప్పడంతో వెలుగులోకి వచ్చిందని పోలీసులు వెల్లడించారు.

 
మొదట అందరూ సహజ మరణంగా భావించారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి కూడా వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినట్టు మీడియాకు తెలిపారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో టీడీపీ మీద అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. నాటి సీఎం చంద్రబాబు, నారా లోకేష్, మంత్రి ఆది నారాయణ రెడ్డి మీద తమకు అనుమానాలున్నాయని అన్నారు. ఏపీ పోలీసుల మీద తమకు నమ్మకం లేదని కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దానికి ప్రతిగా నాటి మంత్రి, టీడీపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి.. వైఎస్ కుటుంబం మీద ఆరోపణలు చేశారు. వివేకానందరెడ్డికి, కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డికి మధ్య ఉన్న విభేదాల మూలంగానే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. సిట్ దర్యాప్తులో వాస్తవాలు తేలుతాయన్నారు.

 
దర్యాప్తులో ఏం చేశారు?
ఈ ఘటనపై 2019 మార్చి 15న నాటి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం 'సిట్' ను నియమించింది. ఆపరేషన్స్ ఏఎస్సీ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు బృందం నియమించారు. వేలిముద్రలతో పాటుగా పలు ఆధారాలను ఈ బృందం సేకరించింది. మృతుడి తలపై కుడి వైపున ఏడు లోతైన గాయాలు ఉన్నాయని, చేతి పైనా గాయాలున్నాయని గుర్తించారు.

 
ఆ తర్వాత మూడు బృందాలుగా ఏర్పడి 'సిట్' దర్యాప్తు కొనసాగించింది. ఫోరెన్సిక్ నివేదిక మేరకు ఇది హత్య అనే నిర్ధరణకు వచ్చారు. 2020 ఫిబ్రవరి వరకూ దశల వారీగా విచారణ సాగింది. సుమారుగా 1,300 మంది సాక్షులను విచారించారు. ముగ్గురు అనుమానితులకు నార్కో టెస్టులు చేశారు. విచారణకు హాజరైన వారిలో వై.ఎస్. కుటుంబ సభ్యలు కూడా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలో సి.ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేసిన బీటెక్ రవి తోపాటుగా వివేకానందరెడ్డికి చికిత్స చేసిన సన్ రైజ్ ఆస్పత్రి వైద్యులు కూడా ఉన్నారు.

 
సీబీఐ ఎందుకు తెర మీదకు వచ్చింది?
2020 ఫిబ్రవరి వరకూ, అంటే హత్య తర్వాత ఏడాది వరకూ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సాగించిన విచారణపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హత్యకు గురైన వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్ ఎన్. సునీతా రెడ్డి, అల్లుడు నారెడ్డి రాజశేఖర్ రెడ్డి తో పాటు సి.ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వంటి వారు ఏపీ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

 
ఈ కేసులో విచారణ వేగవంతం చేసేందుకు సీబీఐకి అప్పగించాలని పలువురు కోరారు. హత్యకు సంబంధించిన అనేక అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో 2020 మార్చి 11న తీర్పు వెలువడింది. పిటిషనర్ల అప్పీల్ అంగీకరిస్తూ కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించింది. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రస్తుతం 'సిట్' ఆధ్వర్యంలో సాగుతున్న విచారణను కొనసాగించాలని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదంటూ వై.ఎస్. జగన్ ప్రభుత్వం వాదన వినిపించడం చర్చనీయమైంది.

 
హత్య కేసుగా నమోదు.. రంగంలో సీబీఐ
మొదట సీఆర్పీసీ 174 సెక్షన్ కింద నమోదయిన ఈ కేసుని సీబీఐ సెక్షన్ 302 కింద మార్చింది. దిల్లీకి చెందిన డీఎస్పీ దీపక్‌ గౌర్‌‌ని గత ఏడాది అక్టోబర్‌లో విచారణ అధికారిగా నియమించారు. జులై 2020లో ఏడుగురు సభ్యుల సీబీఐ అధికారుల బృందం కడప, పులివెందులలో పర్యటించింది. పలువురిని విచారించింది. వివేకానందరెడ్డి ఇంట్లో గతంలో డ్రైవర్‌గా పని చేసిన మున్నా సహా అనేక మంది ఈ విచారణకు హాజరయ్యారు. బీటెక్ రవి, సి.ఆదినారాయణ రెడ్డి వంటి నేతలను, పలువురు కుటుంబ సభ్యులను కూడా సీబీఐ విచారించింది.

 
వివేకానంద కుమార్తె ఆందోళన ఎందుకు?
వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లు దాటినా నిందితులను గుర్తించలేకపోవడం పట్ల ఆయ కుమార్తె సునీతారెడ్డి అందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఆమె దిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, రెండేళ్లు అవుతున్నా కేసు దర్యాప్తు పూర్తి కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ''ఓ మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, సిట్టింగ్ ముఖ్యమంత్రి చిన్నాన్న కేసే ఇలా ఉంటే, ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి?

 
ఈ కేసు గురించి మరిచిపోమని కొందరు నాతో చెప్పారు. హత్య జరిగిన కొన్నాళ్లకు అనుమానితుడు శ్రీనివాసరెడ్డి చనిపోయారు. ఆయన సీఎంకి, ఇతర పులివెందుల నేతలకు వేర్వేరుగా రాసిన లేఖలు బయటపడ్డాయి. ఈ హత్య కేసులో తన పాత్ర లేదని అతను వేడుకున్నారు. ఈ కేసుకు నా తండ్రి హత్యతో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది. పోస్ట్ మార్టమ్ రిపోర్టులో గాయాలు గుర్తించారు. వైద్యురాలిగా నాకు తెలిసి పాయిజన్ తీసుకున్న వాళ్లకు కిడ్నీ సమీపంలో రక్తం గడ్డకట్టే పరిస్థితి ఉండదు. వివేకానంద హత్య కేసులో ఆధారాలు లేకుండా చేసిందెవరు..నిజాలు బయటకురావాలంటే ఎన్నాళ్లు వేచి చూడాలి'' అని ఆమె ప్రశ్నించారు. ఈ కేసులో విచారణ పూర్తి త్వరగా చేయాలని ఆ తర్వాత వై.ఎస్. విజయమ్మ కూడా కోరారు.

 
దర్యాప్తు మళ్లీ ప్రారంభం
గత ఏడాది జులై, ఆగస్ట్ నెలల్లో దర్యాప్తు కొనసాగించిన సీబీఐ ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా విచారణ జరిపింది. కరోనా కారణంగా కేసు విచారణను అర్థంతరంగా ముగించారు. సునీతారెడ్డి దిల్లీలో ఫిర్యాదు చేసిన అనంతరం పులివెందుల, కడపలో విచారణ సాగింది. అధికారులు పలు ఆధారాలు సేకరించారు. దాంతో త్వరలోనే కేసు కొలిక్కి వస్తుందనే అంచనా వినిపిస్తోంది. '' సీబీఐ దర్యాప్తు వేగంగా పూర్తవుతుందని భావిస్తున్నాం. చాలా అనుమానాలున్నాయి. వాటన్నింటినీ ఇప్పటికే కుటుంబ సభ్యులు సీబీఐ దృష్టికి తీసుకెళ్లారు. వాటన్నింటనీ నివృత్తి చేసేలా దర్యాప్తు నివేదిక ఉంటుందని భావిస్తున్నారు.'' అని కడప నగరానికి చెందిన అడ్వొకేట్ ఎం.రమేశ్‌ రెడ్డి బీబీసీతో అన్నారు.

 
నేతలు, పోలీసుల మధ్య వివాదం ఎందుకు?
తిరుపతి ఉప ఎన్నికల వేళ వివేకానంద రెడ్డి కుమార్తె ఈ హత్య కేసుని మరోసారి ప్రస్తావించడంతో రాజకీయంగా చర్చనీయమైంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనకు వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్యతో సంబంధం లేదని ప్రమాణం చేశారు. సీఎం జగన్ కూడా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే లోకేశ్ తీరుపై ఏపీ మంత్రులు మండిపడ్డారు. వివేకానంద హత్య కేసులో విచారణ జరుగుతుండగా ప్రమాణాలంటూ రాజకీయ హంగామా వల్ల ఉపయోగలేదని వ్యాఖ్యానించారు.

 
రాజకీయ వేడి రాజుకుంటుండగా పోలీసుల్లోనూ ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. వివేకానందరెడ్డి హత్య ఘటనపై తన వద్ద ఉన్న సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, సీబీఐ నుంచి స్పందన లేదని ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించడం వివాదానికి కారణమైంది. దర్యాప్తు అధికారి ఎన్.కె. సింగ్‌కు స్వయంగా ఫోన్ చేసి చెప్పినా ఎలాంటి స్పందన లేదని వెంకటేశ్వర రావు ఓ లేఖలో తెలిపారు.

 
వివేకా హత్యను గుండెపోటు గానో, ప్రమాదం గానో చిత్రీకరించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారని, హత్య తర్వాత ఇల్లంతా కడిగేసి, శవాన్ని ఆసుపత్రికి తరలించే దాకా..ఘటనా స్థలాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డి, ఇతర బంధువులు తమ అధీనంలో ఉంచుకున్నారని వెంకటేశ్వర రావు ఆరోపించారు. ఏబీ వెంకటేశ్వర రావు లేఖపై ఏపీ పోలీస్ అధికార ప్రతినిధి పాల్ రాజు తీవ్రంగా స్పందించారు.

 
''ఈ కేసు దర్యాప్తు మొదట ఏబీ వెంకటేశ్వరరావు కనుసన్నల్లోనే జరిగినా, తాను ఇచ్చిన కీలక సమాచారాన్ని 'సిట్' లేదా సీఐడీ ఏ మేరకు ఉపయోగించుకున్నాయోదో తనకు తెలియదని చెప్పడం హాస్యాస్పదం. అంతకుమించిన సమాచారం ఉంటే అప్పుడే 'సిట్'కు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి'' అని పాల్ రాజు మీడియా సమావేశంలో అన్నారు. ''అప్పటి ఎస్పీని, ఇతర విభాగాలను వెంకటేశ్వరరావు తీవ్ర ఒత్తిడికి గురి చేసిన మాట వాస్తవమో కాదో ఆయనే చెప్పాలి. నిబద్దత కలిగిన అధికారి కాబట్టే అప్పటి ఎస్పీ రాహుల్ దేవ్‌ శర్మ ఒత్తిడికి తలొగ్గలేదు.

 
ఏదైనా నేరానికి సంబంధించిన కీలక సమాచారం తన వద్ద ఉంటే సంబంధిత దర్యాప్తు అధికారులకు అందించక పోవడాన్ని సాధారణ ప్రజలు కూడా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అటువంటిది ఒక ఐపీఎస్ అధికారి అయ్యుండి, కీలకమైన కేసులో తన వద్ద ఉన్న సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు అందించకపోవడం ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం శిక్షార్హం కాదా?.'' అని పాల్ రాజు అన్నారు. ఇలా.. రాజకీయ, పోలీస్ విభాగాల్లో దుమారం రేపుతున్న వివేకానంద రెడ్డి హత్య కేసు ఎప్పటికి కొలిక్కి వస్తుంది.. అసలు దీని వెనుక ఎవరున్నారన్న ఆసక్తి అంతటా నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ