మంగా అనే కామిక్ పుస్తకం రూపంలో తన ఆత్మహత్య అనుభవాలను ప్రజలందరితోనూ పంచుకున్నారు కొబయాషి. ఎరికో కొబయాషి 2018లో స్టేజి పై తన ప్రసంగాన్ని ముగించగానే, ప్రేక్షకులలోంచి ఒక 20 సంవత్సరాల యువతి ఆమె దగ్గరకు నడిచి వచ్చారు. ఆమె ఆత్మహత్యాయత్నం విఫలం కావడంతో హాస్పిటల్లో చేరినట్లు కొబయాషి బీబీసీకి చెప్పారు.
"ఆమె ఒక స్ఫూర్తినిచ్చే సందేశమున్న ఉంగరాన్ని నాకు బహుకరించారు. మేము ఇద్దరం ఆలింగనం చేసుకున్నాం". కొబయాషి ‘డైరీ ఆఫ్ మై డైలీ ఫెయిల్యూర్స్’ పుస్తక రచయిత్రి. 2017 లో ఆమె రచించిన 'మంగ' అనే జపాన్ కామిక్ పుస్తకం విడుదల అయింది. ఆమె ఓ సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఆమె అనుభవాలతో ఈ పుస్తకం రాశారు.
ఈ పుస్తకం ద్వారా జీవితంలో ఎదుర్కొన్న కష్టమైన క్షణాలను ఎలా అధిగమించిందీ ఇతరులకు తెలియచేయడమే తన ఉద్దేశ్యమని ఆమె అన్నారు. సెప్టెంబరు 10 వ తేదీని ప్రపంచ ఆత్మహత్య నివారణ దినంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొబయాషి బీబీసీతో మాట్లాడారు. ఆర్ధిక ఇబ్బందులు, మానసిక సమస్యల వలన కొబయాషి 21 సంవత్సరాలకే అనేక సార్లు తన ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నారు.
తన ఇబ్బందులు చిన్నప్పుడే మొదలయ్యాయి అని, ఇంట్లో హింసకు, వేధింపులకు గురైనట్లు ఆమె చెప్పారు. మంగా పుస్తకంలో ఆమె భయపడిన అంశాలతో పాటు ఆమె హాస్పిటల్లో ఉన్నప్పటి అనుభవాల గురించి కూడా చర్చించారు. "ఒక సమయంలో నిద్రపట్టేది కాదు. రాత్రి పూట ఎప్పుడూ భయం వెంటాడేది" అని ఆమె గుర్తు చేసుకున్నారు. "మా తల్లి తండ్రులు నన్ను చాలా మంది డాక్టర్ల దగ్గరకు తీసుకుని వెళ్లారు. కానీ ఏమి ఉపయోగం కనిపించలేదు” అని ఆమె చెప్పారు.
వేధింపులు, దొంగతనాలు
కొబయాషి స్కూల్లో కూడా బెదిరింపులకు గురయ్యేవారు. "మా నాన్నగారు ఎక్కువ సంపాదించ లేకపోయేవారు. దాంతో నాకు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాదు. శీతాకాలంలో వేసుకున్న బట్టలే మళ్ళీమళ్ళీ వేసుకునే దానిని. దాంతో తోటి పిల్లలకు నేను లోకువగా కనిపించేదాన్ని” అని ఆమె చెప్పారు.
1990ల మధ్యలో కొబయాషి యూనివర్సిటీ చదువు పూర్తయింది. అప్పుడు జపాన్లో పెద్దగా ఉద్యోగావకాశాలు లేవు. ఆ సమయాన్ని "ఉద్యోగాలకు ఐస్ ఏజ్" అని పిలిచేవారు. చివరకు ఆమె ఒక టోక్యో పబ్లిషింగ్ సంస్థలో ఉద్యోగంలో చేరారు. ”చాలా రోజులు సంక్షేమ నిధుల మీదే పని చేసిన తర్వాత ఎక్కువ గంటల సేపు పని, తక్కువ జీతం వచ్చే విధంగా స్థిరపడ్డాను’’ అని ఆమె చెప్పారు.
“డబ్బులు లేకపోవడంతో ఒక్కొక్కసారి సూపర్ మార్కెట్లలో వస్తువులు దొంగలించిన సందర్భాలు కూడా ఉన్నాయి” అని ఆమె తెలిపారు. అలాంటి పరిస్థితుల్లోనే కొబయాషి తన ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నారు. ఒకసారి ఫ్లాట్‌లో స్పృహ తప్పి పడి ఉన్న ఆమెను, ఆమెతో పాటు ఫ్లాట్‌లో ఉండే వ్యక్తి హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లారు. ఆమెకి 3 రోజుల తర్వాత తెలివి వచ్చింది.
ఆత్మహత్య ఒక అంతర్జాతీయ సమస్య
ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం 8,00,000 మంది తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో జపాన్లో ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. సంఖ్యాపరంగా చూస్తే ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య తగ్గు ముఖం పడుతున్నప్పటికీ, యువతలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది.
జపాన్‌లో 10 - 14 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలలో ఆత్మహత్యలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2019లో 20 సంవత్సరాలలో ఉన్న వారిలో ఆత్మహత్యలు తారా స్థాయిలో ఉన్నటు అంచనా. యువతలో ఉన్న ఈ పరిస్థితిని చూసినప్పుడు కొబయాషి తన అనుభవాలను మంగ అనే పుస్తక రూపంలో తేవాలని నిర్ణయించుకున్నారు.
"నా అనుభవాలన్నీ చాలా వ్యక్తిగతమైనవి. కానీ, అవి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అనిపించింది” అని ఆమె అన్నారు. “బ్రతకడం కష్టమనే దశ జపాన్లో మాత్రమే కాకుండా ప్రపంచంలో చాలా మంది అనుభవిస్తారు. అలా వారు మాత్రమే ఆలోచించటం లేదని నా పుస్తకం తెలియచేస్తుంది” అని ఆమె చెప్పారు.
నిరంతర యుద్ధం
మానసిక ఆరోగ్య సమస్యలు, ఆత్మహత్య లాంటి క్లిష్టమైన సమస్యలున్న వ్యక్తులకు కొబయాషి ఒక ఉదాహరణ. ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఎప్పటికైనా ముప్పేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 20 సంవత్సరాల తర్వాత కూడా కొబయాషికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి విపరీతంగా వస్తాయి.
“నాకు ఒంటరిగా అనిపించినప్పుడు, లేదా ఉద్యోగంలో నేననుకున్నట్లు పరిస్థితులు లేనప్పుడు, చనిపోవాలని అనిపిస్తూ ఉంటుంది” అని ఆమె చెప్పారు. ఆమె ఇప్పటికీ మానసిక నిపుణుల సలహా తీసుకుంటున్నారు. అలాంటి ఆలోచనల నుంచి బయటకు రావడం గురించి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. "అలాంటి ఆలోచనలు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను ఎక్కువగా నిద్రపోవడానికి, స్వీట్స్ తినడానికి, మంచి సువాసనలు పీల్చడానికి ప్రయత్నిస్తాను. అలా చేయడం వలన నాకు ఉపశమనం లభిస్తుంది”.
"అలాగే ఎక్కువ సేపు ఒంటరిగా ఉండను.” "నన్ను అభిమానించేవారిని కలిసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది”. "నేను ఆత్మహత్య ఎలా ఉంటుందో అనుభవించాను. నాకు కష్టం, నిస్సహాయత గురించి తెలుసు” అని ఆమె అంటారు. "ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళు నా దగ్గర కు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను జీవించి ఉండటం వృధాగా పోలేదనిపిస్తుంది” అని ఆమె అన్నారు.
పంచుకున్న అనుభవాలు
ఆత్మహత్య చేసుకునే వాళ్లకి కౌన్సిలింగ్, మందులు తీసుకోవడం మాత్రమే కాకుండా ఇతరుల అనుభవాలు వినడం కూడా పనికొస్తాయని ఆమె అన్నారు. "జపాన్‌లో అధిక సంఖ్యలో మానసిక రోగుల కోసం పడకలు ఉన్నాయి”. అలాగే ఇక్కడ మానసిక వైద్యం కోసం మందులు కూడా అధిక స్థాయిలో ఇస్తారని కొబయాషి అంటారు
కానీ ‘‘ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాళ్ళు వారి భావాలను ఎవరితో పంచుకోవాలను కోరు. తమను ఎవరూ అర్ధం చేసుకోలేరు అనే భావంతో వారు సతమతమవుతూ ఉంటారు” అని ఆమె చెప్పారు. "బలహీనమైన కుటుంబ బంధాలు, ఆర్ధిక సమస్యలు, ఒంటరితనం లాంటి సమస్యలు ఆత్మహత్యలకు ఎక్కువగా కారణమని ఆమె చెప్పారు. ఇవి అంత త్వరగా పరిష్కారమయ్యేవి కాదు” అని ఆమె అంటారు.
"ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి భావాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం సమస్యకు పరిష్కారం కాదు. ఆలోచనలను గౌరవించడం చాలా ముఖ్యం. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి సహాయం చేయగలగాలి” అని ఆమె వివరించారు. "నా వరకు అయితే బయటకు వెళ్లడం, నా సహ ఉద్యోగులను కలవడం, నా స్నేహితులతో సంభాషించడం చాలా ముఖ్యమని అనిపిస్తుంది. పక్కవారితో మాట్లాడటం వలన, కలిసి నవ్వడం వలన చావాలనే కోరిక చచ్చిపోతుంది” అని ఆమె అన్నారు.
కుటుంబ కలహాలు
కొబయాషి చేసే పని ఆమెలో అంతర్మధనానికి మూలంగా ఉండేది. మంగా రాయక ముందు ఆమె సమస్యల గురించి చాలా పుస్తకాలు రాశారు. ఆమె అలా బహిరంగంగా రాయడం ఇంట్లో ఆమె తండ్రికి ఇష్టం ఉండేది కాదు.
"నా సమస్యలు ఇలా చెప్పడం పట్ల మా నాన్నగారికి ఇష్టం లేదు. మేమిద్దరం మాట్లాడుకుని 10 సంవత్సరాలు అవుతోంది. నా డైరీ ఆఫ్ డైలీ ఫెయిల్యూర్స్ పుస్తకం గురించి ఆయన అభిప్రాయాన్ని నేనెప్పుడూ వినలేదు. ఆయన అభిప్రాయం వినాలనే ఉత్సాహం నాలో లేదు” అని ఆమె చెప్పారు.
“నాకు చిన్నప్పుడు ఆర్ట్ స్కూల్ కి వెళ్లాలని ఉండేది. దానికి మా నాన్నగారు ఒప్పుకోలేదు. అది సమయం వృధా అయ్యే పని అని, దాని వలన ఎటువంటి లాభం ఉండదని” ఆయన అనడాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. “నేను జనంలో కనిపించిన ప్రతి సారీ, నేను రాసినవి చదివేటప్పుడు మా అమ్మ చాలా ఆనందించే వారు”. ఆమె రాసిన కామిక్ పుస్తకం ఇంగ్లీష్ తో సహా అనేక భాషల్లోకి తర్జుమా అయింది.
మహమ్మారి నుంచి నేర్చుకున్న పాఠాలు
ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో జపాన్ లో చోటు చేసుకున్న ఆత్మహత్యలు గత సంవత్సరంతో పోలిస్తే తగ్గాయని జపాన్ అధికారులు ప్రకటించారు. వైరస్ వ్యాప్తితో కలిగిన మానసిక, ఆర్ధిక కారణాలు, సోషల్ ఐసొలేషన్ నేపథ్యంలో ఈ పరిణామం విచిత్రంగా అనిపించవచ్చు. లాక్ డౌన్ వలన స్కూళ్ళు, కాలేజీలు మూయడం వలన, పని గంటలు తగ్గడం వలన కూడా ఈ సంఖ్య తగ్గి ఉండవచ్చని మానసిక ఆరోగ్య సంస్థలు భావిస్తున్నాయి
"సాధారణ జీవితం మొదలైతే ఆత్మహత్యల సంఖ్య పెరిగే అవకాశం ఉండవచ్చని” కొబయాషి భయపడుతున్నారు. మానసిక ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ మహమ్మారి గుర్తు చేసిందని కొబయాషి అన్నారు. స్కూల్ లో కానీ, పనిలో కానీ ఎక్కువ కష్టపడకపోవడం వలన ప్రజలు కాస్త ప్రశాంతంగా ఉన్నారని ఆమె అన్నారు. "శిఖరాలు చేరాలనే ప్రయత్నాలను విరమించి మన శరీరానికి, మనసుకి తేలికగా ఉండే జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే పరిస్థితులు మెరుగు పడతాయి” అని ఆమె అన్నారు.