Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విరాట్ కోహ్లీ vs కేన్ విలియమ్సన్: ప్రపంచకప్ అండర్ 19 సెమీ ఫైనల్లో ఏం జరిగింది?

విరాట్ కోహ్లీ vs కేన్ విలియమ్సన్: ప్రపంచకప్ అండర్ 19 సెమీ ఫైనల్లో ఏం జరిగింది?
, సోమవారం, 8 జులై 2019 (20:13 IST)
2019 క్రికెట్ ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. సెమీఫైనల్లో న్యూజీలాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్ సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టే ఫేవరెట్ అన్నది చాలామంది భావన. మరోపక్క 'తమపైన అంచనాలు లేకపోవడమే తమకు పెద్ద సానుకూలత’ అని న్యూజీలాండ్ అంటోంది.


ఈ నేపథ్యంలో భారత్ - న్యూజీలాండ్ అండర్ - 19 జట్ల మధ్య 2008 ఫిబ్రవరిలో జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ మ్యాచ్‌లో కూడా భారత జట్టుకు కోహ్లి, న్యూజీలాండ్ జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించారు.

 
మలేసియా రాజధాని కౌలాలంపుర్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజీలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మ్యాచ్‌ మధ్యలో వర్షం పడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత విజయ లక్ష్యాన్ని 43 ఓవర్లలో 191 పరుగులకు కుదించారు. భారత్ 41.3 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
webdunia

 
బ్యాట్‌తో 43 పరుగులు చేసిన కోహ్లి, ఆ మ్యాచ్‌లో బంతితోనూ అదరగొట్టాడు. 7 ఓవర్లు వేసిన కోహ్లి 27 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక వికెట్, ప్రస్తుత న్యూజీలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ది కావడం విశేషం. అప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా కోహ్లీనే. ఆ ప్రపంచ కప్ ఫైనల్స్‌లోనూ దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచి కప్పు సొంతం చేసుకుంది.

 
గత మ్యాచుల్లో ఏం జరిగింది?
ఇప్పటికే లీగ్ దశలో భారత్ - న్యూజీలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో టోర్నీలో ఓ రకంగా ఎవరిపైనా ఎవరికీ పై చేయి లేదు. భారత్ ఇప్పటి దాకా ఆరు ప్రపంచ కప్ సెమీఫైనళ్లలో తలపడింది. అందులో మూడింట్లో గెలిస్తే, మరో మూడింట్లో ఓడిపోయింది. అయితే ఈ ఆరు మ్యాచుల్లో ఒక్కసారి కూడా న్యూజీలాండ్‌తో పోటీ పడలేదు.

 
మరో పక్క న్యూజీలాండ్ ఇప్పటిదాకా 7 ప్రపంచకప్ సెమీఫైనల్స్ ఆడితే, అందులో ఒకేఒక్క మ్యాచ్‌లో గెలిచింది. ఇక మొత్తంగా ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూస్తే భారత్-న్యూజీలాండ్ 8 సార్లు తలపడ్డాయి. వీటిలో న్యూజీలాండ్‌దే పై చేయి. న్యూజీలాండ్ 4 మ్యాచ్‌లు గెలిస్తే, భారత్ 3 గెలిచింది. ఒకటి రద్దయింది.
webdunia

 
మరో విషయం ఏంటంటే.. భారత్ ఇప్పటిదాకా ఇంగ్లండ్‌లో జరిగిన ఏ ప్రపంచ కప్‌ మ్యాచ్‌లోనూ న్యూజీలాండ్‌పై గెలవలేదు. మూడు మ్యాచ్‌లు ఆడితే, మూడింట్లోనూ ఓడింది. భారత్ న్యూజీలాండ్ మధ్య ఇప్పటిదాకా 106 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో 55 మ్యాచుల్లో భారత్ గెలిస్తే, 45 మ్యాచుల్లో న్యూజీలాండ్ గెలిచింది. మరో ఐదు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఒకటి టై అయింది.

 
మ్యాచ్ రద్దయితే?
భారత్ - న్యూజీలాండ్ సెమీఫైనల్స్‌కు కూడా వర్షం ముప్పు పొంచే ఉంది. ఒకవేళ మంగళవారం వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే, ఆ మ్యాచ్‌ను రిజర్వ్ డే అయిన బుధవారం నాడు నిర్వహిస్తారు. ఆ రోజుకూడా వర్ష సూచన ఉంది. ఒక వేళ అప్పుడు కూడా వర్షం పడి మ్యాచ్ రద్దయితే, లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టీం ఇండియా ముందుంది కాబట్టి, ఆ జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరుతుంది.

 
ఎవరి బలం ఎంత?
ప్రపంచ కప్‌లో మొదటి దశలో ఈ రెండు జట్లు అన్నీ విజయాలే నమోదు చేశాయి. కానీ, రెండో దశకు వచ్చేసరికి న్యూజీలాండ్ వరుసగా చివరి మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. సమాన పాయింట్స్ ఉన్నప్పటికీ కేవలం రన్‌రేట్ ఆధారంగా ఆ జట్టు పాకిస్తాన్‌ను దాటి సెమీఫైనల్స్‌కు రాగలిగింది.

 
మరో పక్క ఒక్క ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ మినహా, భారత్ ఈ టోర్నీలో ఓడిపోలేదు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ భారత్ తిరుగులేని ప్రదర్శన కనబరుస్తోంది. గాయపడ్డ భువనేశ్వర్ కుమార్ స్థానంలో జట్టులోకి వచ్చిన పేసర్ షమీ కూడా లీగ్ దశలో అదరగొట్టాడు. బుమ్రా ప్రతి మ్యాచ్‌లోనూ రాణిస్తున్నాడు. అటు రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లి లాంటి బ్యాట్స్‌మెన్‌తో టీం ఇండియా సమతూకంగా కనిపిస్తోంది.

 
ఇంకో పక్క న్యూజీలాండ్‌ బౌలర్‌ ట్రెంట్ బౌల్ట్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. భారత్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతడు 12 వికెట్లు పడగొట్టాడు. విలియమ్సన్, గప్టిల్‌కు, హెన్రీ నికోలస్‌, మన్రో లాంటి బ్యాట్స్‌మెన్‌ను తక్కువగా అంచనా వేయలేం. ప్రపంచకప్‌కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో న్యూజీలాండ్, భారత్‌ను 179 పరుగులకే ఆలౌట్ చేసి, ఆ మ్యాచ్ గెలిచింది.

 
సెమీఫైనల్ మ్యాచ్ జరిగే ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం బ్యాటింగ్‌కు చాలా అనుకూలం. ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మొత్తం ఐదు మ్యాచులు జరగ్గా, ఐదింటిలోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. వర్షం పడే సూచన కూడా ఉంది కాబట్టి, టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి వీలైనన్ని ఎక్కువ పరుగుల రాబట్టే ఆలోచనతో ఉండొచ్చు. దానివల్ల డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలోనూ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో టాస్ కూడా చాలా కీలకంగా మారనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతగాని నేత నారా లోకేష్: ఉండవల్లి శ్రీదేవి, పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతారో తెలుసా?