అమెజాన్‌లో పని వాతావరణం గురించి సోషల్ మీడియాలో గొప్పగా చెప్పుకొనే ఉద్యోగులపై ఇతర యూజర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. "మీరు చెప్పేవి అబద్ధాలు" అని వారు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు డబ్బులిచ్చి అమెజాన్ అబద్ధాలు చెప్పిస్తోందని ట్విటర్‌లో కొందరు యూజర్లు ఆరోపిస్తున్నారు. అమెజాన్ ఉద్యోగుల పేరుతో ఉండే సందేశాల్లోని తప్పులను, ఎవరో రాసిచ్చినట్లున్న భాషను తమ ఆరోపణలకు ఆధారాలుగా చూపిస్తున్నారు.
అమెజాన్ అంబాసిడర్లుగా పిలిచే ఈ ఉద్యోగుల ట్వీట్లను ఎగతాళి చేస్తూ ట్విటర్లో యూజర్లు అనేక పేరడీ అకౌంట్లు ప్రారంభించారు. ఈ అంశంపై అమెజాన్ స్పందిస్తూ- అమెజాన్ అంబాసిడర్లు తమ ఉద్యోగులేనని, వారు తమ వ్యక్తిగత అనుభవాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తుంటారని చెప్పింది. ఈ మేరకు బీబీసీకి ఒక ప్రకటన పంపింది.
అమెజాన్ 2018లో తమ గోదాముల పేర్లను 'పుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్ (ఎఫ్‌సీ)'గా మార్చింది. అనంతరం ఎఫ్‌సీ అంబాసిడర్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రాలను సందర్శించాలని ప్రజలను ఆహ్వానిస్తోంది కూడా. ఎఫ్‌సీ అంబాసిడర్లు ఈ కేంద్రాల్లో పనిచేస్తారని, వాస్తవాల ఆధారంగా వీరు వ్యక్తిగత అనుభవాలను సోషల్ మీడియాలో రాస్తుంటారని అమెజాన్ తన ప్రకటనలో వివరించింది. ఈ కేంద్రాల్లో పని వాతావరణం ఎలా ఉంటుందనేది వీరి ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పింది.
వాళ్లు ఏం రాస్తున్నారు?
ఎఫ్‌సీ అంబాసిడర్లు అమెజాన్ గోదాముల్లోని పని పరిస్థితులను ప్రశంసిస్తుంటారు. కంపెనీ తీరును విమర్శించే ట్వీట్లను గుర్తించి, స్పందిస్తుంటారు. ట్విటర్‌లో @AmazonFCHannah పేరుతో ఉన్న ఒక అంబాసిడర్ ఈ నెల 15న- "నేను కుంగుబాటుకు కూడా లోనవుతున్నాను. ఒక దశలో అమెజాన్‌ను వదిలేయాలనుకున్నాను. కానీ నా సమస్యలకు కారణం నేనే గాని, అమెజాన్ కాదని తెలుసుకున్నాను" అని రాశారు.
అమెజాన్ అమెరికా గోదాముల్లో కార్మిక సంఘాలను గుర్తించకూడదనే ఆ సంస్థ విధానాన్ని ఈ అంబాసిడర్ సమర్థించారు. సంస్థ చెల్లించే జీతభత్యాలతో అసలు కార్మిక సంఘాల అవసరమే లేదన్నారు. @AmazonFCRafael పేరుతో ఉన్న మరో అంబాసిడర్ స్పందిస్తూ- ఎఫ్‌సీల్లో తమకు గంటకు 15 నుంచి 17 డాలర్లు చెల్లిస్తారని, మంచి ప్రయోజనాలు ఉంటాయని, పిల్లల స్కూలు ట్యూషన్ ఫీజు కూడా చెల్లిస్తారని రాశారు.
యాన్యువల్ లీవ్, సిక్ లీవ్ వాడుకొని వారం రోజులపాటు తాను పనికి దూరంగా ఉన్నానని, ఇందుకు తాను కృతజ్ఞుడనని ఇదే అంబాసిడర్ గత నెల్లో ట్వీట్ చేశారు. ఇలాంటి అంబాసిడర్ల ట్వీట్లపై కొందరు యూజర్లకు అనుమానం వచ్చింది. రాసిచ్చిన సమాచారాన్ని వ్యక్తిగత అనుభవాల పేరుతో పోస్ట్ చేస్తున్నారని వీరు ఆరోపించారు.
ఈ అంబాసిడర్లు పెట్టే ప్రతి ట్వీట్‌లో ఒకే ఉత్సాహం ఉంటుందని ఒక యూజర్ అభిప్రాయపడ్డారు. పోలీసులు తలుపు కొట్టినప్పుడు, ఇంట్లో ఉన్న వ్యక్తి తన తలకు దుండగుడు తుపాకీ పెట్టి ఉండగానే తలుపు తీసి, "ఇబ్బందేమీ లేదు, అంతా బాగుంది" అని చెప్పినట్లుగా ఈ ట్వీట్లు ఉంటాయని వ్యాఖ్యానించారు.
మీరు ట్వీట్ ఎందుకు చేశారని @AmazonFCHannah పేరుతో ఉన్న అంబాసిడర్‌ను యూజర్లు ప్రశ్నించగా- "వారంలో రెండు రోజులు నాకు ఇలా ట్వీట్ చేసే అవకాశం వస్తుంది. అప్పుడు పని నుంచి విరామం దొరుకుతుంది. ఇంతకుముందు అంబాసిడర్లుగా చేసిన గ్రూప్‌కు గిఫ్ట్ కార్డు వచ్చింది. నాకు కూడా రావొచ్చనే ఉద్దేశంతో చేశాను" అనే సమాధానం వచ్చింది.
పని వాతావరణంపై విమర్శలు
అమెజాన్‌లో పని వాతావరణంపై ఎప్పుడూ విమర్శలు వస్తుంటాయి. వేతనం, పని పరిస్థితులపై వేల మంది ఉద్యోగులు జులైలో 'అమెజాన్ ప్రైమ్ డే' సందర్భంగా నిరసనలు చేపట్టారు. అమెరికా మిన్నెసోటాలోని షాకోపీలో పనిచేసే ఒక అమెజాన్ ఉద్యోగి బీబీసీతో మాట్లాడుతూ- దాదాపు ప్రతి సెకనుకు ఒకటి చొప్పున వస్తువులను హ్యాండిల్ చేయాల్సి వస్తోందని చెప్పారు. రోజుకు పది గంటలపాటు పనిచేయాల్సి వస్తోందన్నారు. అమెజాన్ స్పందిస్తూ- తాము అత్యధిక వేతనాలతో గొప్ప ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నామని చెప్పింది.