Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: పెట్టుబడులపై 6 నెలల కిందట జగన్ ప్రభుత్వం ఏం చెప్పింది? ఇప్పటివరకు ఏం జరిగింది?

Jagan
, శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (15:18 IST)
2023 మార్చి 3, 4 తేదీలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ - 2023 జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా 13 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్రంలో పెట్టుబడులకు 387 సంస్థలు ముందుకొచ్చాయని, వీటి ద్వారా ద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయని చెప్పారు. ఎంతో అట్టహాసంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 జరిగి ఇప్పటికి ఆరు నెలలు గడిచాయి. ఈ సమ్మిట్‌పై ఆరు నెలల కిందట ప్రభుత్వం ఏం చెప్పింది? ఇప్పటి వరకూ ఏం జరిగింది? సమ్మిట్‌లో జరిగిన ఒప్పందాలు ఏ దశలో ఉన్నాయి? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి సంబంధించి జరిగిన అధికారుల సమావేశాలు, సీఎంవోకి నివేదించిన రిపోర్ట్ (2023 ఆగస్టు 27 నాటి)లోని వివరాలను బీబీసీ సేకరించింది.
 
జీఐఎస్-2023లో ప్రధాన ఒప్పందాలు
జీపీఎస్-2023 ఒప్పందాల్లో ఎన్టీపీసీ రూ.2,35,000 కోట్ల పెట్టుబడితో 77,000 మందికి ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మూడు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. అలాగే, రూ. 50,632 కోట్ల పెట్టుబడితో 9,500 మందికి ఉపాధి కల్పించే విధంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ 6 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.21,820 కోట్ల పెట్టుబడితో 14,000 మందికి ఉపాధి కల్పించేలా 2 ఒప్పందాలు, అరబిందో గ్రూప్ రూ. 10,365 కోట్లతో 5,250 మందికి ఉపాధి కల్పించే విధంగా 5 ఒప్పందాలు, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.9,300 కోట్ల పెట్టుబడితో 2,850 మందికి ఉపాధి కల్పించేలా 2 ఒప్పందాలు, జిందాల్ స్టీల్ రూ. 7,500 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
 
ఏ ఒప్పందం ఏ దశలో ఉంది?
జూన్ 22 తేదీన క్రి‌బ్‌కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమలకు సీఎం జగన్ వర్చువల్ విధానంలో శిలాఫలకం ఆవిష్కరించారు. వీటితో పాటు గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించారు. దాదాపు 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రూ.1,425 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్లు ఏర్పాటయ్యాయని సీఎం తెలిపారు. ఇవన్నీ కూడా జీఐఎస్-2023లో జరిగిన ఒప్పందాల ఫలితమేనన్నారు. ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించిన 13 పరిశ్రమలు కాకుండా, సమ్మిట్‌లో ఒప్పందాలు కుదుర్చుకున్న మరో నాలుగు సంస్థలు ప్రొడక్షన్ ట్రైల్స్‌లో ఉన్నాయని, మరో 14 కంపెనీలు మిషనరీ సెట్టింగ్ దశలో, 21 కంపెనీలు సివిల్ వర్క్ జరుగుతున్నాయని రిపోర్టులో పేర్కొన్నారు.
 
మరో 7 కంపెనీలకు భూ కేటాయింపు జరిగిందని, 16 సంస్థలకు భూ కేటాయింపులు అప్రూవల్ దశలో, 24 కంపెనీలకు భూ కేటాయింపు జరగాల్సి ఉందని, 8 పరిశ్రమలు డీపీఆర్ సమర్పించాల్సి ఉందని తెలిపారు. జీఐఎస్-2023లో ఒప్పందాలు కుదుర్చుకున్న ఎన్టీపీసీ, ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, శ్యామ్ మెటాలిక్స్ లిమిటెడ్ వంటి 8 సంస్థలకు ఇవ్వడానికి భూమి సిద్ధంగా ఉన్నా ఇంకా కేటాయింపు జరగలేదని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
అలాగే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటివి ట్యాక్స్ బెనిఫిట్స్ విషయంలో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతుల కోసం దివీస్ ల్యాబరేటరీస్ వంటి పరిశ్రమలు ఎదురు చూస్తున్నాయని రిపోర్టులో తెలిపారు. శ్రీ సిమెంట్, అల్ట్రా టెక్ సిమెంట్ వంటి పరిశ్రమలు మైనింగ్ లీజు, అనుమతుల కోసం ఎదురు చూస్తుండగా, జేఎస్‌డబ్ల్యూ సోలార్ ప్యానెల్స్, హెచ్‌పీసీఎల్, వెల్స్ఫాన్ ఇండస్ట్రీస్ వంటివి డీపీఆర్‌లు సమర్పించాల్సి ఉందని తెలిపారు. ఈ పరిశ్రమలన్నింటికీ 2023 సెప్టెంబర్, అక్టోబర్ నాటికి అన్ని అనుమతులు లభించి, పనులు ప్రారంభిస్తాయని ఆ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు.
 
అప్పట్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏం చెప్పారు?
ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సమ్మిట్‌లోని ఒప్పందాల్లో చాలా వరకు ఆరు నెలల్లోనే వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు వివిధ శాఖల్లో ఒక టీం ఏర్పాటు చేశామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ బీబీసీతో చెప్పారు. ఆరు నెలల్లో ఒప్పందాల అమలుకు ముందుకొచ్చే సంస్థలు, ఫ్యాక్టరీలకు అదనపు ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని ఆయన అన్నారు. 2023 మార్చి 2వ తేదీన ఆయనతో బీబీసీ మాట్లాడింది. విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌పై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసింది. దానికి తగ్గట్టుగానే దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా ఈ సమ్మిట్‌కు వచ్చి, ఒప్పందాలు చేసుకున్నారు.
 
గతంలో, అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 జనవరిలో జరిగిన సీఐఐ సదస్సులో రూ.4.7 లక్షల కోట్ల ఒప్పందాలు, 2017 జనవరిలో జరిగిన సమ్మిట్ లో రూ.10.5 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. అయితే, ఈ రెండు సదస్సుల్లో జరిగిన ఒప్పందాల్లో కనీసం 5 నుంచి 10 శాతం ఒప్పందాలు కూడా కార్యరూపం దాల్చలేదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా రూ.13 లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా ఏకంగా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం చెప్పింది. దీంతో ప్రభుత్వం చెప్పే లెక్కలను, గతంలో జరిగిన సదస్సుల ఫలితాలతో పోల్చి చూస్తున్నాయి పారిశ్రామిక వర్గాలు. ఒప్పందాల్లో 25 శాతం కార్యరూపం దాల్చినా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతుందని పారిశ్రామిక వర్గాలు అంటుంటే.. 80 శాతం కంటే ఎక్కువే కార్యరూపంలోకి తెస్తామని మంత్రి అమర్నాధ్ బీబీసీతో చెప్పారు.
 
పురోగతి ఏంటి?
2023 ఆగస్టు 27న పరిశ్రమలు, వాణిజ్య శాఖ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా తాము కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై నివేదికను రూపొందించింది. ఈ శాఖ ద్వారా జరిగిన ఒప్పందాలు అమలైతే ఏపీలో 2,37,959 ఉద్యోగాలు.. అంటే, ఒప్పందాలు చేసుకున్న అన్ని శాఖల్లో కంటే ఈ శాఖలోనే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని ప్రభుత్వం తెలిపింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ రిపోర్టు సమర్పించిన 2023 ఆగస్టు 27 నాటి లెక్కల ప్రకారం.. ఈ శాఖ ద్వారా జరిగిన ఒప్పందాలు 107 కాగా, వాటి ద్వారా రూ.3,41,641 కోట్ల పెట్టుబడులతో పాటు 2,37,959 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 13 ఒప్పందాలు వాస్తవరూపం దాల్చాయని, తద్వారా రూ.2,739 కోట్ల పెట్టుబడులు, 6,858 మందికి ఉద్యోగాలు లభించాయని సీఎం సమీక్ష సమావేశంలో అధికారులు వెల్లడించినట్లు తెలిపారు. తిరుపతిలో కింబర్లీ క్లార్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అనకాపల్లిలో లారస్ ల్యాబ్స్, విజయనగరంలోని శారదా మెటల్స్ అండ్ ఫెర్రో ఎల్లాయిస్ ఫ్యాక్టరీ వంటివి ఆ 13 కంపెనీల్లో ఉన్నాయని అధికారుల రిపోర్టుల్లో ఉంది.
 
ఆశ్యర్యపరిచిన ఎన్టీపీసీ ఒప్పందాలు ఏ దశలో ఉన్నాయి?
జీపీఎస్-2023లో అందరినీ ఆకర్షించినది, ఆశ్చర్యపరిచినది ఎన్టీపీసీ ఒప్పందాలే. ఎందుకంటే, ఏపీతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా 2.35 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులతో ఏకంగా 77 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్టీపీసీ చెప్పింది. కానీ, దేశ, విదేశాల్లో తనకున్న థర్మల్, సోలార్, హైడ్రో, విండ్ ప్రాజెక్టులు, జాయింట్ వెంచర్ల ద్వారా కేవలం 18,936 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించినట్లు ఎన్టీపీసీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇవి జీఐఎస్-2023లో ఒప్పందంపై సంతకం చేసే నాటికి ఉన్న గణాంకాలు. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల ద్వారా 77 వేల ఉద్యోగాలను కల్పించడం సాధ్యమేనా? అనే ప్రశ్న ఎదురవుతోంది.
 
ఎన్టీపీసీ కుదుర్చుకున్న ఒప్పందం పురోగతిపై బీబీసీ ఆరా తీసింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ రిపోర్టులో పేర్కొన్న వివరాలను పరిశీలించగా.. అనకాపల్లి జిల్లా పూడిమడకలో రూ. 1.10 లక్షల కోట్లతో 61 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఎన్టీపీసీ హైడ్రోజన్ పార్కుకి 2023 సెప్టెంబర్‌లో శంకుస్థాపన జరగనున్నట్లు పేర్కొంది. కానీ, సెప్టెంబర్ 27 వరకూ అలాంటిదేమీ అనకాపల్లిలో జరగలేదు. అయితే, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ. 1.1 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ హబ్ మొదటి దశ 2026 నాటికి పూర్తవుతుందని ఆ సంస్థ బిజినెస్ యూనిట్ హెడ్ సంజయ్ కుమార్ 2023, మార్చి 31న చెప్పారు.
 
ఈ ప్రాజెక్టు మొత్తం 2030 నాటికి పూర్తవుతుందని ఆయన తెలిపారు. దీని కోసం ఎన్‌టీపీసీకి గతంలో ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ 1,200 ఎకరాల భూమిని పూడిమడకలో కేటాయించింది. విజయనగరం జిల్లా ముసిడిపల్లిలో జేఎస్‌డబ్ల్యూ రూ.532 కోట్లతో నిర్మించే ఎంఎస్ఎంఈ పార్క్ కూడా సెప్టెంబర్ నెలలోనే భూమి పూజ జరుగుతుందని ఆ రిపోర్టులో పేర్కొన్నప్పటికీ, భూమి పూజ జరిగినట్లు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు, 2024 ఫిబ్రవరి నాటికి జీఐఎస్‌లో కుదరిన ఒప్పందాలన్నీ వాస్తవ రూపంలోకి రావాలని సీఎం అధికారులకు ఆదేశించారు. అయితే, క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు. జీఐఎస్-2023లో జరిగిన ఒప్పందాలు ద్వారా 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసిన ప్రభుత్వం, ప్రస్తుతం రూపొందించిన నివేదికల ప్రకారం ఇప్పటి వరకూ 13 సంస్థల ద్వారా 6,858 ఉద్యోగాలు లభించినట్లు చెప్తోంది.
 
‘డెడ్ లైన్’ 2024 ఫిబ్రవరి
విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో జ‌రిగిన‌ ఒప్పందాల అమలుపై ఆయా శాఖలు సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఆ నివేదికలను సీఎంకు అందిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ 5న సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాల ప్రస్తుత పరిస్థితిపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటి స్థితిగతులపై సీఎం సమీక్షించారు. విశాఖ సమ్మిట్‌ ద్వారా కుదుర్చుకున్న 387 ఒప్పందాల్లో, 107 ఒప్పందాలు పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలో జరిగాయని, వాటిలో 13 ఒప్పందాలు ఇప్పటికే వాస్తవరూపం దాల్చినట్లు జూన్ 5న మీడియాకు విడుదల చేసిన లేఖలో అధికారులు తెలిపారు. వీటి ద్వారా రూ.2,739 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయని అందులో అధికారులు వివరించారు.
 
అలాగే, వీటితోపాటు జనవరి 2024లోపు 38 కంపెనీలు పనులు ప్రారంభం అవుతాయని, మార్చి 2024లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ సీఎంకు నివేదించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఇది సరిపోదని, కుదిరిన ఒప్పందాలన్నీ 2024 ఫిబ్రవరి నాటికి వాస్తవ రూపంలోకి రావాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
 
ప్రభుత్వం ఏమంటోంది..?
జీఐఎస్-2023 ఒప్పందాల వాస్తవ రూపం, ప్రస్తుత కార్యచరణపై పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్‌ను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాల వలవన్‌ను కూడా సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు బీబీసీకి అందుబాటులోకి రాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్‌తో ఆదానీ భేటీ... గంగవరం పోర్టు - వైజాగ్ డేటా సెంటర్‌పై చర్చ