Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాజినిస్మస్: లైంగిక కలయికకు నా శరీరం సహకరించదు, ఎవరు?

వాజినిస్మస్: లైంగిక కలయికకు నా శరీరం సహకరించదు, ఎవరు?
, గురువారం, 19 సెప్టెంబరు 2019 (17:35 IST)
''నా శరీరం సెక్స్‌కు సహకరించదు. ఒక వేళ సెక్స్ చేయడానికి ప్రయత్నిస్తే యోనిలో కత్తితో పొడిచినట్లు అనిపిస్తుంది'' అని హన్నహ్ వాన్ డీ పీర్ చెప్పారు. ఆమె ఒకరకమైన లైంగిక రుగ్మతతో బాధపడుతున్నారు. ఈ వ్యాధిని వజినిస్మస్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 
''ఈ వ్యాధితో బాధపడుతున్న చాలామంది మహిళలతో నేను మాట్లాడాను. అందరూ ఒకేవిధమైన అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. ఒంటరిగా ఉన్నామనే భావనతో ఉన్నారు'' అని ఆమె చెప్పారు. వాజినిస్మస్ అంటే యోనికండరాలు బిగుసుకపోవడం. అప్పుడు మహిళలకు తమ శరీరం మీద నియంత్రణ ఉండదు. దీనివల్ల కొంతమంది మహిళలు సెక్స్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతారు.

 
21 ఏళ్ల హన్నహ్ తొలి సెక్స్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ''కన్యత్వాన్ని కోల్పోవడం బాధగా ఉంటుందని అనుకునేదాన్ని. కానీ, నాకైతే అప్పుడు కత్తిని యోనిలో దింపి మెలిపెడుతున్నట్లు అనిపించింది'' అని చెప్పారు. వాజినిస్మస్ రుగ్మత ఉన్న కొంతమంది మహిళలు శరీరంపై సూదులతో గుచ్చుతున్నట్లు, కత్తితో కోస్తున్నట్లు అనిపిస్తుందని తెలిపారు.

 
''కలయిక సమయంలో నొప్పి ఉందని చెప్పడం కొందరు అపరాధంగా భావిస్తుంటారు'' అని ఇంగ్లండ్‌కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ లీలా ఫ్రోడ్‌షామ్ అన్నారు. ''తొలిసారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు నొప్పిగా ఉండటం సాధారణమే. ఆ అనుభవాన్ని మనందరం ఎదుర్కొన్నవాళ్లమే. అయితే, వాజినిస్మస్‌ రుగ్మత ఉన్నవాళ్లు జీవితకాలం ఈ నొప్పితో బాధపడుతుంటారు'' అని పేర్కొన్నారు.

 
అమీనా 20 ఏళ్లున్నప్పుడు వాజినిస్మస్‌తో బాధపడ్డారు. దీనిమూలంగా తన జీవితమే మారిపోయిందని ఆమె తెలిపారు. ఈ రుగ్మత మహిళల జీవితంలో ఎప్పుడైనా రావొచ్చు. తొలిసారి సెక్స్‌లో పాల్గొన్నతర్వాత లేక పిల్లలు పుట్టాక, రుతుస్రావం ముగిశాక ఇలా ఏ దశలోనైనా వచ్చే అవకాశం ఉంది. చాలామంది మహిళలు మాత్రం తొలిసారి సెక్స్‌లో పాల్గొంటున్న సమయంలోనే ఈ రుగ్మతను ఎదుర్కొన్నట్లు చెప్పారు.

 
అయితే, మతపరమైన అపోహలు కూడా ఈ రుగ్మత విషయంలో కీలకపాత్ర పోషిస్తాయని డాక్టర్ ఫ్రోడ్‌షామ్ పేర్కొన్నారు. ''సంప్రదాయ మతాచారాల మధ్య పెరిగేవారు తొలి కలయిక సమయంలో ఎటువంటి సమస్యలు ఎదురుకానప్పటికీ ఆందోళన మూలంగా తమకు ఇలాంటి రుగ్మత ఉందని అనుకుంటుంటారు'' అని ఆమె బీబీసీకి చెప్పారు.

 
''మొదటిసారి సెక్స్ చాలా నొప్పిగా ఉంటుంది. కన్యత్వం కోల్పోయే సమయంలో కాస్త రక్తస్రావం అవడం కూడా మనం చూస్తాం'' అని ఆమె తెలిపారు. అమీనాకు తన కన్యత్వాన్ని నిరూపించాల్సిన అవసరం లేనప్పటికీ, ఆ ఆలోచన తన మనసులో ఎప్పుడూ ఉండేదని చెప్పారు. ''సెక్స్ గురించి నాకు చాలా భయం కలిగించిన విషయాలలో బహుశా ఇదీ ఒకటి'' అని ఆమె అన్నారు.

 
''పెళ్లిరోజు రాత్రి నా శరీరం కృంగిపోయినట్లు అనిపించింది. నా పరిస్థితిని బయటకు చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే, నేను అతిగా స్పందిస్తున్నాని వారు అనుకుంటారు'' అని ఆమె తెలిపారు. సెక్స్ మహిళలకు ఆనందాన్ని కలిగించదని తనకు చెప్పారని హన్నహ్ వాన్ డి పీర్ గుర్తుచేసుకున్నారు. "నేను చర్చి పాఠశాలకు వెళ్లాను. అక్కడి వాళ్లు సెక్స్ వల్ల రక్తపాతం, బాధ, గర్భం వస్తాయని నాకు నేర్పించారు'' అని ఆమె తెలిపారు.

 
ఈ రుగ్మత ఇస్లే లియన్ లాంటివారికి భాగస్వామికి సంబంధించిన తీవ్రమైన భావోద్వేగ సమస్యగా మారింది. ''నేను ప్రేమించడం లేదని నా భాగస్వామి అనుకుంటాడని భయంగా ఉంది'' అని ఆమె చెప్పారు. వాస్తవానికి వాజినిస్మస్ అన్నది చికిత్సతో నయమయ్యే వ్యాధే. కానీ, అపరాధ భావం, సిగ్గు వల్ల చాలా మంది మహిళలు తమ పరిస్థితిని బయటకు చెప్పరు. ఎవరి సహాయాన్ని అడగరు.

 
హన్నహ్, అమీనా తమ రుగ్మతకు సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు. ఈ చికిత్స తనకు సహాయం చేస్తుందని అమీనా తెలిపారు. ''అయిదేళ్ల కిందట నాకు పెళ్లైంది. ఇప్పుడు కాస్త మెరుగ్గా ఉంది. డైలేటర్ వల్ల యోని పెద్దదవుతుంది. కానీ, దాన్ని ఉపయోగించడం అంత సులభం కాదు. ఎందుకంటే అది అసౌకర్యంగా ఉంటుంది'' అని పేర్కొన్నారు.

 
ఈ చికిత్స విధానంలో మానసిక పరిస్థితిపై కూడా దృష్టిపెడతారు. లైంగిక సమయంలో భయం లేకుండా ఉండే పద్ధతులపై కౌన్సిలింగ్ ఇస్తారు. ''ఇది మీ శరీరం పట్ల మీ భావాలను అర్థం చేసుకోవడానికి, మార్చడానికి సహాయపడే ''టాకింగ్ థెరపీ'' లాంటిది'' అని గ్లాస్గోవ్‌లోని క్వీన్ ఎలిజబెత్ యూనివర్సిటీలో గైనకాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ వనెస్సా మ్యాకే వివరించారు.

 
తాను గణనీయమైన పురోగతి సాధించానని హన్నహ్ చెప్పింది. సెక్స్ తనకు ఇంకా కష్టమైనదే. కానీ, మెరుగైన మార్పు కోసం ఆమె కృతనిశ్చయంతో ఉన్నారు. ''నేను కూడా సెక్స్‌ను ఆస్వాదించాలనుకుంటున్నా. రుతుస్రావం సమయంలో టాంపొన్ (రక్తం బయటకు రాకుండా యోనిలో చొప్పించే సున్నితమైన వస్తువు) వాడుతూ నడవాలనుకుంటున్నా'' అని ఆమె చెప్పారు. ''నా జీవితానికి సంబంధించి కొన్ని చిన్న లక్ష్యాలు ఉన్నాయి. భవిష్యత్తులో వాటిని సాకారం చేసుకునేందుకు పనిచేస్తున్నా'' అని వెల్లడించారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనీట్రాప్ మాయలో రాజకీయ నేతలు... రూ.లక్షలు దోచుకున్న మహిళలు