నరేంద్ర మోదీ 2013 అక్టోబర్ 20న అహ్మదాబాద్‌లో మాట్లాడుతూ "సర్దార్ పటేల్ దేశానికి మొదటి ప్రధాని అయ్యుంటే భారత్ దశ మరోలా ఉండేది" అని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సమక్షంలో అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే "వీర్ సావర్కర్ దేశానికి తొలి ప్రధాని అయ్యుంటే పాకిస్తాన్ అనేది అసలు ఉండేది కాదు" అన్నారు.
సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని కూడా డిమాండ్ చేసిన ఉద్ధవ్, "అధికారంలోకి వస్తే సావర్కర్‌కు భారత రత్న ఇస్తామని బీజేపీ కూడా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది" అన్నారు. అప్పుడు రెండూ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. తమ కూటమిని గెలిపించాలని రెండు పార్టీల నేతలూ ప్రజలను కోరారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినప్పుడు శివసేన దానికి బహిరంగంగా మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత పార్టీ పత్రిక సామ్నాలో "కశ్మీర్‌ను ముస్లింలకు బహుమతిగా ఇచ్చే ప్రసక్తే లేదని" రాశారు.
బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత బాల్ ఠాక్రే దానిని సమర్థించారు. అందులో శివసైనికులు కూడా ఉన్నారన్నారు. బాబ్రీ మసీదుకు వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేసిన వారిలో బీజేపీకి చెందిన చాలామంది నేతలు కూడా ఉన్నారు. "సావర్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్‌ను చెప్పుతో కొట్టాలి" అని ఇదే ఏడాది సెప్టెంబర్‌లో ఉద్ధవ్ అన్నారు. మణిశంకర్ అయ్యర్ 2018లో సావర్కర్ టూ నేషన్ థియరీ ప్రతిపాదించారని చెప్పారు.
సావర్కర్‌పై రాసిన ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా ఉద్ధవ్ ఈ మాటలు అన్నారు. అప్పుడు ఆయన "సావర్కర్ ఈ దేశ తొలి ప్రధానమంత్రి అయ్యుంటే, పాకిస్తాన్ అనేది అసలు పుట్టేదే కాదు. మనది హిందుత్వ ప్రభుత్వం. మేం ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం" అన్నారు. గాంధీజీ హత్య కేసులో సావర్కర్ సహనిందితులు. ఆ కేసులో కోర్టు నాథూరాం వినాయక్ గాడ్సే, నారాయణ్ దత్తాత్రేయ్ ఆప్టేలకు ఉరిశిక్ష విధించింది. విష్ణు ఆర్ కర్కరే, మదన్ లాల్ పాహ్వా, శంకర్ కిస్టయ్యా, గోపాల్ గాడ్సే, డాక్టర్ దత్తాత్రేయ సదాశివ పర్చూరేకు జీవిత ఖైదు విధించింది. ఆధారాలేవీ లేకపోవడంతో వినాయక్ దామోదర్ సావర్కర్‌ను నిర్దోషిగా చెప్పింది. సారవర్కర్ హిందుత్వను గట్టిగా సమర్థించేవారు.
అయితే సావర్కర్ నిర్దోషి అనడంపై ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తాయి. తుషార్ గాంధీ తన 'లెటస్ కిల్ గాంధీ'లో "గాంధీ హత్య కేసులో వినాయక్ దామోదర్ సావర్కర్ విడుదలపై ఎన్నో రకాల ప్రశ్నలు వచ్చేవి. సావర్కర్‌కు వ్యతిరేకంగా దర్యాప్తు సరిగా జరగలేదు" అన్నారు. పటేల్ కూడా ఆ విషయాన్ని అంగీకరించారు. సావర్కర్ దోషిగా తేలితే, ముస్లింలు సమస్యల్లో పడేవారు. హిందువులు ఆగ్రహాన్నితట్టుకోలేకపోయేవారు" అన్నారు.
ఇప్పుడు అదే శివసేన కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్ వల్ల ఉద్ధవ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలాంటప్పుడు సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వారు, బాబ్రీ మసీదు విధ్వంసాన్ని, జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని సమర్థించే వారు కాంగ్రెస్‌కు ఆమోదయోగ్యమేనా అనే ప్రశ్న వస్తుంది.
ఈ అంశాలపై కాంగ్రెస్ ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పటికీ వేరుగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే, అది తమ ఆలోచన మార్చుకుంటామని ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు శివసేనను మీరు కాంగ్రెస్‌తో కలిసి మీ హిందుత్వ రాజకీయాలకు వీడ్కోలు పలుకుతారా అని కూడా అడుగుతున్నారు.
ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర తర్వాత ముఖ్యమంత్రి అవుతారని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మంగళవారం రాత్రి ప్రకటించాయి. శివాజీ పార్కులో నవంబర్ 28న ప్రమాణ స్వీకార వేడుక జరుగుతుందని చెప్పాయి. "నవయుగానికి ఇది ప్రారంభం. మహారాష్ట్ర దేశంలో కీలక రాష్ట్రం. మహారాష్ట్ర మార్పు కోసం వేచిచూస్తోంది. ఈ రాష్ట్రం మరోసారి నంబర్ వన్‌గా నిలుస్తుంది" అని సంయుక్త మీడియా సమావేశంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు.
"ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దిల్లీలో అన్నయ్యను కలవడానికి వెళ్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సమయంలో నన్ను తమ్ముడని చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రతీకార చర్యలతో పనిచేయదు. కానీ ఎవరైనా సమస్యలు సృష్టించాలని చూస్తే మా టీమ్ వారిని క్షమించదు" అని ఇదే సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఉద్ధవ్‌కు ముందు మంగళవారం రాజీనామా ప్రకటన చేస్తూ మాట్లాడిన దేవేంద్ర ఫడణవీస్ "శివసేన అబద్ధాలు చెప్పింది. పొత్తుకు ద్రోహం చేసింది. ఇది సైద్ధాంతికంగా సరైన పొత్తు కాదు" అన్నారు.
దీనికి సమాధానంగా ఉద్ధవ్ "అవును. అది నిజమే, నేను నా తండ్రికి భిన్నంగా వేరే లైన్ తీసుకున్నాను. నేను అలా ఎందుకు చేశానో చెబుతాను. సోనియాగాంధీ కాంగ్రెస్‌కు ఎంతో కాలం నుంచీ ప్రత్యర్థిగా ఉన్న శరద్ పవార్‌తో కలిసి నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాను. అలా ఎందుకు చేశానో అది కూడా నేను చెబుతాను. కానీ దానికి ముందు మాతోశ్రీకి వచ్చి అబద్ధాలు చెప్పిన వాళ్లు ముందు మాట్లాడాలి" అన్నారు.
"అది అవమానం కాకుంటే ఇంకేంటి. నా హిందుత్వం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను ఏదైనా మాట ఇస్తే, దాన్ని నిలబెట్టుకుంటా. బాలా సాహెబ్ సిద్ధాంతం అదే" అన్నారు. "మూడు పార్టీల ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కామన్ మినిమం ప్రోగ్రాం కింద కలసి పనిచేయాలని" ఈ సమావేశం తర్వాత శరద్ పవార్, ఉద్ధవ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలా సాహెబ్ థోరాట్ అపీల్ చేశారు.
"నా పాత మిత్రుడు నాకు భరోసా ఇవ్వలేకపోయినందుకు, బాధగా ఉంది, కానీ నేను ఎవరితో 30 ఏళ్లుగా పోరాడుతూ వచ్చానో వారే నాపైన నమ్మకం ఉంచారు" అని ఉద్ధవ్ అదే సమావేశంలో అన్నారు. "జార్జ్ ఫెర్నాండెజ్, బాలాసాహెబ్ ఎప్పుడూ బహిరంగ ర్యాలీల్లో కనిపించలేదు. మేం ముగ్గురం మంచి స్నేహితులం. చాలాసార్లు నేను దివంగత మీనాతాయి ఠాక్రే చేతి వంటను రుచిచూశాను" అని శరద్ పవార్ కూడా అన్నారు.
శివసేన- కాంగ్రెస్ డైలమా, సాన్నిహిత్యం
శివసేన-కాంగ్రెస్ ఎప్పుడూ కలిసి అధికారంలో లేవు. కానీ ఎన్నో అంశాలపై రెండు పార్టీలూ ఒకేమాటపై నిలిచాయి. 1975లో ఇందిరాగాంధీ అత్యవసర స్థితిని సమర్థించిన అప్పటి పార్టీల్లో శివసేన కూడా ఒకటి. అప్పుడు బాల్ ఠాక్రే "అత్యవసర స్థితి దేశ సంక్షేమం కోసమే" అన్నారు. అత్యవసర స్థితి ముగిశాక ముంబయి మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరిగినపుడు రెండు పార్టీలకు మెజారిటీ దక్కలేదు. దాంతో మురళీ దేవర మేయర్ కావడానికి మద్దతు ఇవ్వాలని బాల్ ఠాక్రే నిర్ణయించారు.
1980లో కాంగ్రెస్‌కు మరోసారి శివసేన మద్దతు లభించింది. బాల్ ఠాక్రే , సీనియర్ కాంగ్రెస్ నేత అబ్దుల్ రహమాన్ అంతులే మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ఠాక్రే ఆయన ముఖ్యమంత్రి కావడానికి మద్దతు ఇచ్చారు. 1980 దశకంలో బీజేపీ, శివసేన కలిసి వచ్చినపుడు బాల్ ఠాక్రే అరుదుగా కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. కానీ, 2007లో రాష్ట్రపతి పదవికి బీజేపీ అభ్యర్థినికి కాకుండా ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా దేవీ సింగ్ పాటిల్‌ను సమర్థించారు.
ప్రతిభా పాటిల్ మరాఠీ కావడంతో శివసేన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదు. ఐదేళ్ల తర్వాత మరోసారి కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి శివసేన మద్దతు పలికింది. శరద్ పవార్‌ను ప్రధానిగా చేస్తే దానికి తన మద్దతు ఉంటుదని కూడా బాల్ ఠాక్రే ప్రకటించారు.
పార్టీల మధ్య అంటరాని స్థితి లేదు
కాంగ్రెస్, శివసేన సంబంధాల్లో అంటరాని స్థితి లాంటిది లేదు. కాంగ్రెస్ దానికి మద్దతు ఇస్తే, ముస్లింలపై శివసేన అభిప్రాయం గురించి ప్రశ్నలు తలెత్తవచ్చు. కానీ, కాంగ్రెస్ శివసేన నుంచి మద్దతు తీసుకుంటూనే ఉంది. అయితే లౌకికవాదం కోసం, బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడం అవసరం అంటున్న కాంగ్రెస్, అందుకు శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడం సరికాదని వాదిస్తోంది.
అయితే మరో విషయం కూడా అడుగుతున్నారు. కాంగ్రెస్ వచ్చే మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేస్తుందా? అప్పుడు శివసేన హిందుత్వ వాద పార్టీ గుర్తింపు ఏమవుతుంది? కాంగ్రెస్‌తో కలిసి దూకుడు చూపించే హిందుత్వ పార్టీగా శివసేన ఉండగలదా? లేదంటే శివసేనతో కలిసి ప్రభుత్వంలో కొనసాగుతూ మాది లౌకికవాదం అని కాంగ్రెస్ చెప్పుకోగలదా?