Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్‌‌కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే, చర్యలు వద్దంటున్న దేశాధ్యక్షుడు

కరోనావైరస్‌‌కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే, చర్యలు వద్దంటున్న దేశాధ్యక్షుడు
, శుక్రవారం, 27 మార్చి 2020 (17:23 IST)
ప్రస్తుతం కరోనావైరస్ మహమ్మారికి యూరప్ కేంద్రంగా మారింది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ సహా యూరప్ ఖండంలోని అనేక దేశాల్లో ఇప్పటికే వేలమంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అనేక దేశాలు పూర్తిగా లాక్‌డౌన్ ప్రకటించాయి. అత్యంత కఠిన ఆంక్షలను విధించాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

 
అయితే, యూరోపియన్ దేశాల్లో ఒకటైన బెలారుస్‌లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. యూరప్‌లోని మిగతా దేశాలన్నీ కరోనా భయంతో వణికిపోతుంటే, పొరుగునే ఉన్న యుక్రెయిన్, రష్యా దేశాలు కఠినంగా వ్యవహరిస్తుంటే... బెలారుస్‌ మాత్రం తనదైన మార్గంలో వెళ్తోంది.

 
అత్యవసర పరిస్థితిని ప్రకటించే యోచనలో యుక్రెయిన్ ఉంది. రష్యా పాఠశాలలను మూసివేసింది, జనాలు గుమిగూడే అనేక రకాల కార్యక్రమాలను, విమానాల రాకపోకలను రద్దు చేసింది. బెలారుస్‌లో అలాంటి చర్యలేమీ లేవు. సరిహద్దులు తెరిచి ఉన్నాయి. ప్రజలంతా ఎప్పటిలాగే పనులు చేసుకుంటున్నారు.

 
'భయం వద్దు'
కరోనావైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తమ దేశం ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవాల్సిన అవసరం లేదని బెలారుస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో అన్నారు. "అలాంటివి చాలా వస్తాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరూ భయపడకూడదు!" అని మంగళవారం చైనా రాయబారితో జరిగిన సమావేశంలో ఆయన ఉద్ఘాటించారు.

 
బెలారుస్‌లో సినిమా థియేటర్లను మూసివేయలేదు. జనాలు గుమిగూడే కార్యక్రమాలను నిషేధించలేదు. ప్రపంచవ్యాప్తంగా చాలా క్రీడా పోటీలు రద్దయ్యాయి. వాయిదా పడ్డాయి. ఈ దేశం మాత్రం తన ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ పోటీలను యథావిధిగా కొనసాగిస్తోంది.

 
'కరోనావైరస్‌ను ట్రాక్టర్ నయం చేస్తుంది'
"కరోనావైరస్‌ను ఒక ట్రాక్టర్ నయం చేస్తుంది" అని అధ్యక్షుడు లుకాషెంకో చేసిన వ్యాఖ్యలు... బెలారుస్‌లో సోషల్ మీడియా వేదికలపై చర్చనీయాంశంగా మారాయి. వ్యవసాయ పొలాల్లో శ్రమిస్తే రోగాలు దరిచేరవనేది ఆయన భావన.

 
దేశాధ్యక్షుడు అంత ధీమాతో ఉన్నప్పటికీ, ఇక్కడి చాలామంది ప్రజలు కరోనావైరస్ వ్యాప్తి గురించి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే, బెలారుస్ వెలుపల ఇతర యూరప్ దేశాల్లో ఏం జరుగుతోందో వారికి తెలుసు. కొంతమంది విద్యార్థులు రద్దీగా ఉండే పాఠశాలలకు వెళ్లడంలేదు.

 
ఈ ఆందోళనను తగ్గించే ప్రయత్నంలో భాగంగా, విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు విద్యార్థులంతా ఒకేసారి వెళ్లకుండా, కొన్ని తరగతులకు సమయాల్లో మార్పులు చేశారు. ఈ వైరస్ వల్ల వృద్ధులకు ఎక్కువ ప్రమాదం ఉందని కొందరు ప్రజలకు అవగాహన ఉంది. కానీ, అధికారులు మాత్రం ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలేదు.

 
బెలారుస్‌లో విదేశాల నుంచి తమ దేశానికి వచ్చిన వారందరికీ కరోనావైరస్ నిర్ధరణ పరీక్షలు చేయించామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధ్యక్షుడు లుకాషెంకో చెప్పారు. "రోజుకు ఇద్దరు ముగ్గురికి పాజిటివ్ అని వస్తుంది. వారిని క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచి, రెండు వారాల తరువాత విడుదల చేస్తారు" అని ఆయన అన్నారు.

 
"ఎవరూ భయపడొద్దు. పుకార్లను వ్యాప్తి చేసేవారు వైరస్‌కంటే ప్రమాదకరం, భయాందోళనలను వ్యాప్తి చేస్తున్న ద్రోహులను వెతికి పట్టుకోవాలి" అని అధికారులను అధ్యక్షుడు ఆదేశించారు. ఇప్పటివరకు, బెలారుస్‌లో 86 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచిన్ భారీ విరాళం.. ఇటలీలో 8,165కి చేరిన కరోనా మృతుల సంఖ్య