Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్ సోకి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటికీ కోలుకోని మహిళ కథ

కరోనావైరస్ సోకి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటికీ కోలుకోని మహిళ కథ
, గురువారం, 3 సెప్టెంబరు 2020 (13:18 IST)
కోవిడ్-19 సోకి ఆరు నెలలు అవుతున్నా, కోలుకోనివారు ఉంటున్నారు. వేలల్లో ఒకరికి ఇలాంటి పరిస్థితి వస్తుంది. బ్రిటన్‌కు చెందిన మోనిక్ జాక్సన్‌ది ఇదే కథ. తన అనారోగ్య లక్షణాలను, వాటిని ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ఓ డైరీలో నమోదు చేస్తున్నారామె.

 
ఏడాది క్రితం టెడ్ టాక్స్‌ షోలో పుట్టగొడుగుల గురించి ఓ వక్త ప్రసంగిస్తున్న వీడియో మోనిక్ చూశారు. ‘‘ఫంగస్ ఇంటర్నెట్ లాంటిది. అడువుల వ్యాప్తంగా ఓ నెట్‌వర్క్‌లా వ్యాపిస్తాయి. సమస్య వచ్చినప్పుడు చెట్లు ఒకదానికొకటి సహకరించుకునేలా అవి దోహదపడతాయి’’ అని ఆ వక్త ఆ వీడియోలో చెప్పారు.

 
ఈ వ్యక్తి చెప్పిన విషయాన్ని మోనిక్ చాలా సార్లు గుర్తు చేసుకుంటూ ఉంటారు. కరోనావైరస్‌తో ఆమె 24 వారాలుగా పోరాటం చేస్తున్నారు. వైద్యులు కూడా ఇప్పుడు ఇప్పుడే ఇలాంటి ‘సుదీర్ఘ కోవిడ్’ గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టారు.

 
మోనిక్ జాక్సన్ లండన్‌లో ఉంటున్నారు. ఆమెకు మార్చిలోనే కోవిడ్ సోకింది. మొదట్లో దాని తీవ్రత చాలా తక్కువగానే అనిపించింది. అయితే, ఆ తర్వాత అది ఆమెను విడిచిపెట్టలేదు. మోనిక్ బాగా ఉత్సాహంగా ఉండే మహిళ. థాయ్ బాక్సింగ్, జియు జిత్సు వంటి క్రీడలు ఆమె ఆడతారు. సెంట్రల్ లండన్‌లో తాను పనిచేసే ఆర్ట్ గ్యాలరీకి రోజూ వెళ్లి, వచ్చేందుకు 12 మైళ్లు సైకిల్ తొక్కుతారు.

 
కానీ, గత కొన్ని నెలలుగా ఆమె ఏ పనీ చేయలేకపోతున్నారు. పళ్లు తోముకునేందుకు కూడా ఆమెకు శక్తి సరిపోవడం లేదు. ‘నేను సోమరిపోతును కాదు. కానీ, కొన్ని రోజులైతే మా ఇంటి మెట్లు దిగి కిందకు రావడమే నాకు అతి పెద్ద పనిలా అనిపిస్తోంది’’ అని మోనిక్ అంటున్నారు. శరీరం తనకు సహకరించడం లేదని ఆమె వాపోతున్నారు.

 
తన పరిస్థితి గురించి మోనిక్ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో వివరంగా ఓ డైరీ పోస్ట్ చేస్తున్నారు. తనలా సుదీర్ఘ కాలం కోవిడ్-19తో బాధపడుతున్నవారిని కలుసుకునేందుకు, కొత్తవారికి తన పరిస్థితి వివరించేందుకు ఆమె ఈ పని చేస్తున్నారు. చాలా మందిలో స్వల్ప తీవ్రతనే చూపించే కోవిడ్-19... కొందరికి మాత్రం ఇలా సుదీర్ఘ కాలం ఎందుకు ఉంటోందన్న విషయం వైద్యులను కూడా తికమకపెడుతోంది.
webdunia

 
మోనిక్, ఆమె స్నేహితురాలు ఒకేసారి అనారోగ్యానికి గురయ్యారు. వీరిద్దరూ కలిసి అప్పుడు రైలు ప్రయాణం చేశారు. ఆరంభంలో వాళ్లిద్దరూ తమ పరిస్థితి గురించి తరచూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరి లక్షణాలూ ఒకేలా కనిపించాయి. ఆ తర్వాత కొంత కాలం వారు మాట్లాడుకోలేదు.

 
లండన్‌లో బాగా చల్లటి వాతావరణం ఉన్నా, తనకు వేడిగా అనిపించేదని, తలకు ఐసు బ్యాగు పెట్టుకుని పడుకునేదాన్నని మోనిక్ అన్నారు. రెండో వారం వచ్చేసరికి తనకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని మోనిక్ చెప్పారు. ఆమె కోసం ఓ అంబులెన్స్ వచ్చింది. వాళ్లు పరీక్షించి, ఆమె ఆక్సీజన్ స్థాయిలు సరిగ్గానే ఉన్నాయని చెప్పారు. లక్షణాల గురించి భయపడి మోనిక్ ప్యానిక్ అటాక్‌కు గురవుతుండవచ్చని అన్నారు.

 
ఆమెకు కోవిడ్ పరీక్షలు చేయలేదు. అప్పట్లో బ్రిటన్‌లో కరోనా పరీక్ష కిట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో తీవ్రత ఎక్కువ ఉన్న కేసుల్లోనే పరీక్షలు చేశారు. సొంతంగా అనారోగ్యాన్ని నయం చేసుకునేందుకు మోనిక్ ప్రయత్నించారు. పచ్చి వెల్లుల్లి, మిరియాలు వంటివి తిని చూశారు. కానీ, వాటి రుచి తనకేమీ తెలియలేదని ఆమె అన్నారు. రెండు వారాల తర్వాత కొన్ని లక్షణాలు తగ్గిపోయాయి. మరికొన్ని కొత్తవి మొదలయ్యాయి.

 
‘‘ఛాతీలో గుచ్చినట్లుగా నొప్పి మొదలై, అదో మంటలాగా మారింది. ఎడమవైపు తీవ్రమైన నొప్పి పుట్టింది. గుండెపోటు వస్తుందేమో అనుకున్నా’’ అని మోనిక్ చెప్పారు. ఎమర్జెన్సీ నెంబర్ 111కి ఫోన్ చేస్తే, పారాసిటమాల్ వేసుకొమ్మన్నారని అన్నారు. పారాసిటమాల్ వల్ల నొప్పి దూరమైంది. కానీ, ఆ తర్వాత ఆమెకు తింటున్నప్పుడు గొంతులో, కడుపులో మంట పుట్టింది. వైద్యులు ఆమెకు అల్సర్ ఉందేమోనని అనుమానించారు. కానీ, కరోనావైరస్ కారణంగా జీర్ణ సంబంధ సమస్యలు కూడా వస్తున్నాయని ఆ తర్వాతే తెలిసింది.

 
ఆరు వారాల తర్వాత, మోనిక్‌కు మూత్రానికి వెళ్తున్నప్పుడు మంట పుట్టడం మొదలైంది. నడుం నొప్పి కూడా వచ్చింది. మూడు రకాల యాంటీ బయోటిక్‌లను ఇచ్చి వైద్యులు ఆమెను పరీక్షించి చూశారు. అప్పటికి ఆమెకు వచ్చింది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కాదని గుర్తించారు.

 
ఆ తర్వాత మోనిక్ సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. కోవిడ్‌కు సంబంధించిన పోస్టుల గురించి ఆమె చాలా భయపడ్డారు. కోవిడ్ పేరు వింటేనే, ఆమెకు ఆందోళన పుట్టేది. ఆ తర్వాత స్నేహితురాలితో మాట్లాడుతున్నప్పుడు, కోవిడ్ బాధితుల్లో ‘నల్లజాతీయులు, మైనార్టీ జాతుల వాళ్లు’ ఎక్కువగా ఉంటున్నట్లు ఆమెకు తెలిసింది. తనది మిశ్రమ జాతి కావడంతో మోనిక్ చాలా భయపడిపోయారు.

 
కొన్ని వారాలు గడిచిన తర్వాత ఆమెలో లక్షణాలు విచిత్రంగా మారిపోయాయి. మెడ నొప్పి, చెవిలో వింత అనుభూతి కలిగేవని... చేతులు రక్తం లేకుండా, నీలి రంగులోకి మారిపోయేవని ఆమె అన్నారు. ‘‘నా లక్షణాల గురించి చెబుతూ వైద్యం కోసం నేను తరచూ సంప్రదించేదాన్ని. ‘మీ మానసిక ఆరోగ్యం ఎలా ఉంది?’ అని వాళ్లు ఎదురుప్రశ్నించేవారు’’ అని మోనిక్ చెప్పారు.

 
శరీరమంతా వింత దద్దుర్లు వచ్చేవని, కాలి వేళ్లు ఎరుపెక్కిపోయేవని ఆమె అన్నారు. శరీరంలో వేర్వేరు భాగాల్లో తీవ్రమైన నొప్పి వచ్చేదని వివరించారు. ‘‘ఓసారి స్నేహితురాలితో ఫోన్ మాట్లాడుతుండగా, ముఖం ఓవైపు పడిపోయినట్లు అనిపించింది. అద్దంలో చూసుకుంటే, అంత సహజంగానే ఉంది. పక్షవాతం వచ్చిందేమోనని భయపడ్డా. కానీ, వైద్యులు అలాంటి ఆనవాళ్లేమీ కనిపించడం లేదని చెప్పారు’’ అని మోనిక్ అన్నారు.

 
కాళ్లు, జుట్టు ఎవరో పట్టుకుని లాగినట్లుగా కూడా అనిపించేందని... శరీరమంతా చిత్రమైన అనుభూతులు కలిగేవని ఆమె చెప్పారు. వైద్యులతో ఆమెకు ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఉండేది. తన లక్షణాల గురించి వివరించేందుకు ఆమెకు ఆ సమయం సరిపోయేది కాదు.

 
‘‘వాళ్లు నేరుగా నీకు కోవిడ్ వచ్చింది. చికిత్స ఎలా అందించాలో మాకు తెలియదు అని చెబితే బాగుండేది’’ అని మోనిక్ అన్నారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థ బాగానే పనిచేసిందని, అయితే తన లాంటివారికి అది ప్రయోజనకరంగా లేదని ఆమె చెప్పారు.

 
అనారోగ్యం బారినపడ్డ తొమ్మిది వారాలకు మోనిక్ కరోనావైరస్ పరీక్ష చేయించుకోగలిగారు. ఫలితం నెగిటివ్ వచ్చింది. ఇంకొకరికి తన నుంచి వ్యాధి వ్యాపించదన్న భావన తనకు ఉపశమనాన్ని ఇచ్చందని మోనిక్ అన్నారు.

 
అనారోగ్యం బారినపడ్డ తర్వాత నాలుగు నెలలకు తూర్పు లండన్‌లో తాను ఉంటున్న ఫ్లాట్ నుంచి తన కుటుంబం ఉండే చోటుకు ఆమె మారిపోయారు. ఇంట్లో చిన్న పనులు సైతం చేసుకునే పరిస్థితి లేకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

 
ఆ తర్వాత ఆమె శ్వాస తీరు మెరుగైంది. ఆయాసం తగ్గింది. కానీ, ఓసారి గదిని శుభ్రం చేసేందుకు ప్రయత్నిస్తూ, ఆమె ఊపిరాడక కింద పడిపోయారు. అప్పుడు మూడు వారాల పాటు ఆమె మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ‘‘చాలా మంది ‘నువ్వు మళ్లీ సైకిల్ తొక్కుతావు. బాక్సింగ్ చేస్తావు’ అంటూ చెప్పేవారు. కానీ, ఆ మాటలు నాకు సాయపడేవి కావు’’ అని మోనిక్ అన్నారు.

 
లక్షణాలు సుదీర్ఘ కాలం కొనసాగేవారికి ఎలా చికిత్స చేయాలో వైద్యులకు కూడా తెలియడం లేదు. తన ప్రస్తుత పరిస్థితిని తట్టుకుని, జీవించేందుకు మానసిక వైద్యుల నుంచి మోనిక్ థెరపీ తీసుకుంటున్నారు. పుట్టగొడుగుల గురించి తాను తెలుసుకున్న ఆసక్తికరమైన విషయం తనకు కూడా వర్తిస్తుందని మోనిక్ ఎప్పుడూ ఊహించలేదు.

 
ఫంగస్ నెట్‌వర్క్ ద్వారా చెట్లు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయని, పోషకాలు పంచుకుంటాయని నిపుణులు చెబుతుంటారు. కష్ట సమయంలో తనకు ఆహారం తెచ్చి ఇచ్చిన స్నేహితులు, తనకు సాయంగా ఉన్న మనుషులు తనకు ఫంగస్ నెట్‌వర్క్‌నే గుర్తు చేస్తుంటాయని మోనిక్ అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాను అంతమొందించే వ్యాక్సిన్స్... నవంబర్ 1నాటికి సిద్ధం..?