Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వీడన్ జీవన శైలి: ఆస్తుల గొప్పలు చెప్పుకోరు, సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు

స్వీడన్ జీవన శైలి: ఆస్తుల గొప్పలు చెప్పుకోరు, సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
, శనివారం, 16 నవంబరు 2019 (18:19 IST)
స్టాక్‌హామ్ ఆస్టర్‌మమ్ తీరంలో ప్రైవేట్ పడవలు, నీటిపై తేలే కాక్‌టెయిల్ బార్లు నిండిపోయి కనిపిస్తాయి. దానికి దగ్గర్లోనే ఉన్న స్ట్రాండ్‌వాగన్ రియల్ ఎస్టేట్ చాలా సంపన్నమైనది. ఇక్కడ ఎక్స్‌క్లూజివ్ బుటిక్, రెస్టారెంట్లు కూడా ఉంటాయి. ఇక్కడ సుమారు 18వ శతాబ్దం నుంచి అందమైన భవనాలు, అద్భుతమైన ఆఫీసులు, ప్రైవేట్ మెంబర్ బార్లు ఉన్నాయి. ఈ ప్రాంతమంతా డిజైనర్ కళ్ల జోళ్లు పెట్టుకుని సూర్యుడి వెచ్చదనాన్ని ఆస్వాదించేవారితో నిండిపోయుంటుంది.

 
ఇక్కడ తన సంపద గురించి గొప్పలు చెప్పుకునే ఒక వ్యక్తిని వెతకడం దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవాలి. 24 ఏళ్ల విక్టర్ హేస్ ఒక పెద్ద స్వీడిష్ బ్రాండ్ కోసం ఇంటర్నేషనల్ టాలెంట్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నారు. కానీ ఆయన తన వేతనం గురించి ఆయన పెదవి విప్పరు.

 
స్వీడన్ అంటే, ఒక సామాజిక ప్రజాస్వామ్య దేశమని, అక్కడ పన్నులు ఎక్కువని, స్థానికుల ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ 1990వ దశకంలో సంపన్నులు, పేదల మధ్య ఆ గ్యాప్ విస్తరించింది. పైనున్న 20 శాతం జనాభా ఇప్పుడు కిందున్న 20 శాతం జనాభా కంటే 4 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు.

 
ప్రగల్భాలు పలకరు
చాలా దేశాల్లో ఎక్కువ ఆదాయం సంపాదించడాన్ని తమ విజయానికి గుర్తింపుగా చెప్పుకుంటారు. కానీ స్వీడన్‌లోని ఒక సంప్రదాయం అక్కడివారిని అలా ప్రగల్భాలకు పోకుండా అడ్డుకుంటుంది. బీబీసీ కొంతమంది ధనిక యువకులతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కొందరు తమ రెండో ఇల్లు, ఫామిలీ పడవ, స్పోర్ట్స్ కార్లు, నైట్‌క్లబ్‌లో షాంపేన్ విందుల గురించి ఓపెన్‌గా సంతోషంగా చెప్పారు.

 
కానీ, అదే విషయం అధికారికంగా అడిగితే మాత్రం వాళ్ల నోటి నుంచి సమాధానం రాబట్టడం చాలా కష్టమైపోయింది. దీని గురించి ఒక మెసేజ్ పెట్టిన ఓ యువకుడు "నేను అలా చేస్తే, గొప్పలు చెప్పుకున్నట్టు ఉంటుందేమో, నాకు అలా అనిపించదు. కానీ, చాలా మంది అలాగే అనుకుంటారు" అన్నాడు. ఇంకా చాలా మంది ఇంటర్వ్యూ ఇవ్వడానికి మొదట సరే అన్నారు. కానీ తర్వాత 'బిజీ' అయిపోయారు, లేదంటే మర్చిపోయారు.

 
అలా ఎందుకు, ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో తమ సంపద, గొప్పతనం గురించి చెప్పుకోడాన్ని తప్పుగా అసలు అనుకోరు. కానీ స్టాక్‌హోమ్‌లో అంత సంపన్నులైనా, వారు దానిని గర్వంగా ఎందుకు భావించడం లేదు.

 
'జాంటెలేగెన్' అనే భావన
ఈ స్వీడన్ సంస్కృతి గురించి రాసిన లోలా అకిన్మేడ్ ఎకర్‌స్ట్రామ్ దశాబ్దానికి పైగా స్టాక్ హోంలోనే ఉంటున్నారు. గొప్పలు చెప్పుకోవడాన్ని స్వీడన్‌లో చాలా అసహజంగా భావిస్తారని చెప్పారు. "ఎవరైనా అపరిచితుల ముందు తమ గురించి ప్రగల్భాలు పలకడం, జీతాల గురించి చెప్పుకోవడం కంటే జనం సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు".

 
28 ఏళ్ల స్వీడిష్ జర్నలిస్ట్ స్టినా డలగ్రేన్ గత కొన్నేళ్లుగా అమెరికాలో ఉన్నారు. ఆమె కూడా ఎకర్‌స్ట్రామ్ తో ఏకీభవిస్తారు. "అమెరికాలో నేను బోలెడంత డబ్బు సంపాదిస్తున్నానని మనం చెబితే, జనం మనల్ని చూసి సంతోషిస్తారు... మెచ్చుకుంటారు. కానీ, ఇక్కడ స్వీడన్లో నాకు ఎక్కువ జీతం వస్తుందని మీరు చెబితే, అంతా మిమ్మల్ని విచిత్రంగా చూస్తారు" అన్నారు.

 
ఇక్కడి సంస్కృతి గురించి చెప్పే చాలా మంది స్థానికులు తమ సంపద గురించి మాట్లాడకపోవడానికి 'జాంటెలేగన్' అనే నార్డిక్ నియమమే కారణం అని చెబుతారు. దాని మూలాలు చాలా లోతుగా ఉంటాయి. "మిగతా వారికంటే నేను మెరుగ్గా ఉన్నారు అని ఎప్పుడూ అనుకోకు" అనే ఆలోచనలను అది ప్రోత్సహిస్తుంది. "జాంటెలేగన్ అనేది ఎవరూ ప్రత్యేకంగా చెప్పని ఒక సామాజిక నిబంధన. దాన్ని స్వీడన్, మిగతా నార్డిక్ దేశాల్లో పాటిస్తారు" అని ఎకర్‌స్ట్రామ్ చెప్పారు.

 
దాని గురించి తన "లగోమ్: ద స్వీడిష్ సీక్రెట్ ఆఫ్ లివింగ్ వెల్"లో చెప్పిన ఆమె "ఇక్కడ ఆర్భాటాలకు పోకుండా ఉండడం, అనవసరంగా గొప్పలు చెప్పుకోకూడదు అనే దాని గురించి చెబుతుంది" అని రాశారు. ఇక్కడి ప్రజలు అందరినీ సమానం అనుకోవడానికి, వారిలో ఒత్తిడి దూరం చేయడానికి ఇదొక పద్ధతి.

 
శతాబ్దాల ప్రాచీన పరంపర
జాంటెలేగన్‌లో ఉన్న జాంటే పదానికి నిబంధన అని అర్థం. ఇది ఈ నిబంధనను రూపొందించిన జాంటే అనే నగరం నుంచి తీసుకున్నారు. దీని గురించి నార్వేజియన్-డెనిష్ రచయిత అక్సెల్ శాండిమోస్ 1933లో తన పుస్తకంలో ప్రస్తావించారు. ఈ భావన నార్డిక్ దేశాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో శతాబ్దాల నుంచీ ఉందని స్కాటిష్-నార్వేజియన్ విద్యావేత్త డాక్టర్ స్టీఫెన్ ట్రాటర్ చెప్పారు.

 
"జాంటెలేగన్ సమాజ నియంత్రణకు సంబంధించి ఒక వ్యవస్థ. ఇది డబ్బు గురించే కాదు, మిగతా వారికంటే నాకే ఎక్కువ తెలులని నటించడాన్ని కూడా ఇందులో నిషేధించారు". మర్యాద, వినయం విషయంలో ఇది ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో పాపులర్ 'టాల్ పాపీ సిండ్రోమ్' లాగే ఉంటుంది.

 
స్కాట్‌లాండ్ ప్రజలు దీనిని 'పీతల మనస్తత్వంలా కూడా చెబుతారు. అందులో బక్కెట్లో ఉంచిన పీతల్లో ఒకటి బయటకు రావాలని ప్రయత్నిస్తే, మరో పీత దానిని కిందికి లాగేస్తుందని అంటారు. స్వీడన్‌, ఇతర నార్డిక్ దేశాల్లో జాంటెలేగన్ పనిచేసే విధానం, ఆ దేశాల్లోని ప్రత్యేక సాంస్కృతిక ప్రమాణాలతో ముడిపడి ఉంటుందని ఆయన చెప్పారు.

 
"మీరు మీకున్న రెండో ఇల్లు, అందులోని విలాస వసతుల గురించి మాట్లాడవచ్చు. అది మామూలు విషయమే. ఎందుకంటే నార్డిక్‌లో చాలా మందికి రెండో ఇల్లు ఉంటుంది. కానీ మీరు మీ దగ్గరున్న రెండు లాంబోర్గినీ కార్లకు ఇంత ఖర్చు చేశానని చెబితే జనం మిమ్మల్ని చూసి నవ్వుతారు".

 
మూసిన తలుపుల వెనుక
స్వీడన్ వర్గరహిత సామాజిక ప్రజాస్వామ్యంలో తనదైన అంతర్జాతీయ ముద్ర వేసుకోడానికి చాలా కృషి చేస్తోంది. అయినా, ఇక్కడ చాలా మంది తమ స్థాయి వ్యక్తులతో కలవడమే చేస్తుంటారు. అంటే, జాంటెలేగన్ నిబంధన అనేది సమూహంలో ఉన్న వ్యక్తులను బట్టి మారిపోవచ్చు. సమాన నేపథ్యం ఉన్న వారి మధ్య గొప్పలు చెప్పుకోవడం సర్వ సాధారణం కావచ్చు. మూసిన తలుపుల వెనుక అలాంటి స్థాయి వారిలో( సంపన్నులు) ఇది సహజమే.

 
వ్యతిరేక గళం
జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్న యువత జాంటెల్‌గేన్‌ను విమర్శించడం మొదలైంది. సంపద, తమ విజయాల గురించి వారు ఓపెన్‌గా చెప్పాలనుకుంటున్నారు. 22 ఏళ్ల నికొలె ఫాల్కియానీ బ్లాగింగ్ ద్వారా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రాంలో ఆమెకు మూడున్నర లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

 
సిటీ బయట ఒక కెఫేలో ఆమె గ్లామరస్ వెడింగ్-థీమ్డ్ జ్వువెలరీ షూట్ చేస్తూ కనిపించారు. మీ ఫీజ్ ఎంత అని అడిగితే, ఆమె సూటిగా 20 వేల డాలర్లని చెప్పారు. ఆ డబ్బును ఫాల్కియానీ డిజైనర్ బ్యాగ్స్, టూర్లపై ఖర్చు చేస్తారు. 20 ఏళ్లకే, ఆమె సిటీ సెంటర్‌లో ఒక ఇల్లు కూడా కొన్నారు.

 
"ఈ జాంటెలేగన్ మాయమైపోతే నేను సంతోషిస్తా. అది ఇక్కడ నివసించే అందరికీ బాగుంటుంది. మనం డబ్బు గురించి మాట్లాడినప్పుడే మన సమాజం ఇంకా ఎక్కువగా ఓపెన్ అవుతుంది" అంటారు ఫాల్కియానీ. "సమానత్వం అనే ఆలోచన మంచిదే. కానీ దానివల్ల పని జరగదు. ఎందుకంటే మనం మిగతావారి కంటే ఎక్కువ కష్టపడుతున్నప్పుడు, మనం దాని గురించి గర్వంగా చెప్పుకోగలగాలి" అంటారు.

 
సోషల్ మీడియా ప్రభావం
సోషల్ మీడియా ఆవిర్భావం యువతను జాంటెల్‌గేన్‌కు వ్యతిరేకంగా మార్చిందని నార్వే బెర్గెన్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ కార్నిలియస్ కాప్లెన్ చెప్పారు. "బ్లాగింగ్, వీడియో బ్లాగింగ్ వ్యక్తిత్వాన్ని మార్చేసింది. మిగతా వారి నుంచి ప్రత్యేకంగా కనిపించాలి అనేదానిని సమర్థిస్తుంది".

 
ఇటీవలి వరకూ మిగతా పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికాతో పోలిస్తే నార్డిక్ దేశాల్లో ఇలాంటి ధోరణి తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎక్కువమంది ఆ మాటను తిట్లలా అనుకుంటున్నారు. ముఖ్యంగా చాలా మంది యువత అలాంటి మానసికత అసహ్యమని ఓపెన్‌గా చెప్పుకుంటున్నారు.

 
"సోషల్ మీడియా వల్ల దానిపై తీవ్ర ప్రభావం పడిందని, ఎందుకంటే, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో గొప్పలు చెప్పుకోవడం సర్వ సాధారణం అని భావిస్తున్నారని" ఎకర్‌స్ట్రామ్ కూడా చెబుతున్నారు. స్వీడన్‌లో మిగతా వారికంటే భిన్నంగా వ్యక్తిగత విజయాలు సాధించిన వారు, వాటిని బహిరంగ పరచడం సహజం అని భావిస్తున్నారు.

 
జాంటెలేగన్ వల్ల అణచివేతకు గురైన వారిలో చాలా నిపుణులు, ప్రతిభావంతులు ఉన్నారు. కానీ సగటు మనుషులు ఆన్‌లైన్‌లో ప్రగల్భాలు పలుకడం వాళ్లు చూస్తున్నారు. జాంటెలేగన్ మెల్లమెల్లగా అంతమైపోతుంది. ఎందుకంటే మౌనంగా ఉండేవారంతా నిలబడతారు. "నేను ఇది బాగా చేయగలను, నీకు తెలుసా" అని చెబుతారు. సోషల్ మీడియా మిమ్మల్ని జాంటెలేగన్ అంటే తెలీనివారితో కూడా కలుపుతుంది అంటున్నారు.

 
వలసలు పెరగడం వల్ల జాంటెలేగన్ పాపులారిటీ తగ్గిందని ఎకర్‌స్ట్రామ్‌ భావిస్తున్నారు. స్వీడన్లో మిగతా నార్డిక్ దేశాల కంటే ఎక్కువ వైవిధ్యం ఉంటుంది. సుమారు 25 శాతం ప్రజలు విదేశాల్లో పుట్టారు. లేదంటే వారి తల్లిదండ్రులు వేరు వేరు దేశాలకు చెందినవారై ఉంటారు.

 
వైవిధ్యం నిండిన దేశం
ఇక్కడికి వచ్చే ఇతర సంస్కృతులు తమతోపాటు సాధనకు, ప్రతిభకు, నైపుణ్యాలకు సంబరం చేసుకునే పరంపరను కూడా తీసుకొస్తున్నాయి. ఫాల్కియానీ దానితో ఏకీభవిస్తారు. ఆమె స్వీడన్‌లో పుట్టారు. ఇక్కడే పెరిగారు. కానీ, ఆమె తల్లిదండ్రులు ఇటలీకి చెందినవారు.

 
ఇంట్లో, లేదా ఇటలీలో ఏ విషయాల గురించి మాట్లాడుతానో, వాటిని స్వీడన్ సమాజంలో మాట్లాడ్డానికి ఆంగీకరిస్తారో, లేదో తెలుసుకోవడం ఆమెకు కష్టంగా ఉంది. "మాలో ఎక్కువమంది యూరోపియన్లే ఉన్నారు. స్వీడన్లో ఎక్కువ మంది విదేశీయులే ఉంటున్నారు. వారు తమ సంస్కృతిని ఇక్కడకు తీసుకొస్తున్నారు. మేం ఎన్నో అమెరికా టీవీ ప్రోగ్రామ్స్ చూస్తుంటాం. వాటిలో జాంటెలేగన్ అస్సలు కనిపించదు" అంటారు ఫాల్కియానీ.

 
కానీ, ఈ సంప్రదాయం పూర్తిగా అంతమైపోయిందని నికోలే భావించడం లేదు. ఎందుకంటే స్వీడన్ లేదా స్కాండినేవియా సంస్కృతిలో దాని మూలాలు చాలా లోతుగా ఉన్నాయని అనుకుంటున్నారు.

 
వలసదారుల ఎంపిక
స్వీడన్లో ఉంటున్న కొంతమంది వలసదారులు మాత్రం తాము జాంటెలేగన్ స్వీకరించామని చెబుతున్నారు. 35 ఏళ్ల నటాలియా ఇరిబారా వారిలో ఒకరు. ఆమె మూడేళ్ల క్రితం చిలీ నుంచి స్టాక్‌హోమ్ వచ్చారు. "చిలీలో మా సమాజంలో చాలా అత్మసంతృప్తి ఉంటుంది. అక్కడ ఏదైనా సాధిస్తే, అంటే విద్యార్హత, ఆటలు, అందం, కారు, స్కూలు, ఇళ్లు లాంటి వాటికి చాలా విలువ ఇస్తారు.

 
"కానీ, ఇక్కడ మా పక్కింట్లో ఒక మోడల్ ఉంటుంది. కానీ ఆమె నా ఫొటో ఫలానా మేగజైన్‌లో వచ్చిందని ఎప్పుడూ చెప్పదు. పక్కింట్లోనే ఒక ఫొటోగ్రాఫర్ కూడా ఉన్నాడు. చాలా సాధించాడు. తను కూడా తన గురించి ఎప్పుడూ మాట్లాడడు" అన్నారు. నాకు వినయం అనేది చాలా ముఖ్యం. అందుకే, స్వీడన్‌లో ఉన్న జాంటెలేగన్ నాకు బాగా నచ్చింది. ఇందులో భౌతిక విషయాలను పెద్దగా పట్టించుకోరు" అంటారు నటాలియా.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ 6నెలల పాలనలో 12 రకాల దోపిడి: యనమల ధ్వజం