Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: టీవీ అతనిని తారని చేసింది, అదే టీవీ అతనిని పదే పదే చంపింది

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: టీవీ అతనిని తారని చేసింది, అదే టీవీ అతనిని పదే పదే చంపింది
, మంగళవారం, 16 జూన్ 2020 (18:30 IST)
టీవీ అతనిని తారని చేసింది, అదే టీవీ అతనిని పదే పదే చంపింది. నేను ఈ విషయం రాస్తున్న సమయానికి కూడా టీవీ అతనిని చంపే పనిలోనే ఉంది. అతని జీవితం, అతని వృత్తి, అతని వ్యక్తిగత సంబంధాలు, ఆఖరికి అతని ఆత్మహత్యను కూడా పోస్టుమార్టం చేసింది.

 
సుశాంత్‌కి, అతని తండ్రికి విబేధాలు ఉన్నాయని టీవీలో వాదనలు జరుగుతున్నాయి. ఇంకెవరో అతనికి మాదక ద్రవ్యాల అలవాటు ఉందేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని శరీరం మీద ఉన్న గుర్తుల ఆధారంగా అతను ఉరి వేసుకుంటున్న సమయంలో ఎంత ఇబ్బంది పడివుంటాడోనని ఇంకొకరు మాట్లాడుతున్నారు.

 
ఆత్మహత్య చేసుకోవడం భగవంతుని అభిమతానికి వ్యతిరేకమని మరి కొందరు వాదిస్తున్నారు. ఒక ముస్లిం అమ్మాయితో సంబంధం పెట్టుకున్నందుకు గాను ఇతనికి విధి విధించిన శిక్ష అని మరి కొందరు అంటున్నారు. నేను మా అమ్మను వెంటనే టీవీ ఆపేయాలని చెప్పాను. హాష్ ట్యాగ్లు మొదలైపోయాయి. మరోవైపు ట్రోలింగ్ మొదలైంది.

 
ఆ నటుడికి అవసరమైన సమయంలో దగ్గరగా లేనందుకు బాధపడుతూ మరో సినిమా సెలెబ్రిటీ ట్వీట్ చేశారు. అతని తోటి నటులంతా అతని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నివాళులు గుప్పించారు.

 
నైతిక విలువలు మరచిపోయి మరీ...
ఒక బాధలోంచి కూడా లైక్‌లు, కామెంట్లు, వ్యూస్ రావాలనే తపన. ఒక వ్యక్తి ఫోటోలు పబ్లిక్ డొమైన్లో ఉన్నంత మాత్రాన అతని ఫోటోలు ఇష్టం వచ్చినట్లు వాడే హక్కు మనకుందా? మరణించిన వారి గోప్యతకి విలువ లేదా? మరణించిన వ్యక్తి ఫోటోలు న్యూస్ చానళ్ళలోనూ, వాట్సాప్ గ్రూప్‌లలోనూ ఎందుకు వాడాల్సి వచ్చింది?

 
భారతదేశంలో మరణించిన వారి గోప్యతని పరిరక్షించే చట్టం ఉందో లేదో తెలియదు. కానీ, అలాంటి వార్తలు ప్రచురిస్తున్నప్పుడు కొన్ని నైతిక విలువలు పాటించాల్సిన అవసరం అయితే ఉంది. అది వ్యక్తి హుందాతనానికి సంబంధించిన విషయం.

 
మరణించిన వ్యక్తి లివింగ్ హాల్ ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా మంది చూసి ఉంటారు. అతను ఆత్మహత్య చేసుకున్న బెడ్ రూమ్‌ని కూడా వార్తా మాధ్యమాలు చూపించేశాయి. అక్కడ సోఫాలో కూర్చుని అతని తండ్రి రోదిస్తున్న దృశ్యాన్ని కూడా టీవీ ఛానళ్ళు చూపించే ఉంటాయి. ఒక కుటుంబం బాధలో ఉంటే వారి పట్ల ఇసుమంత దయ, సానుభూతి లేకుండా ప్రవర్తించగలిగే స్వేచ్ఛ ఒక్క టీవీ చానళ్ళకి మాత్రమే ఉంటుంది.

 
వారి ఇళ్ళేమీ పబ్లిక్ స్థలం కాదు. నైతిక విలువలు మర్చిపోయి మరీ మీడియా అతని ఇంట్లోకి చొరబడింది. ఈ క్రమంలో మనం ఆత్మహత్యని ఒక సాధారణ విషయంగా చూపించేస్తాం. మా అమ్మకు ఆ నటుడు ఎవరో తెలియదు. కానీ ఆ దృశ్యాలు చూడలేక టీవీ ఆపేశానని చెప్పారు.

 
ఇలాంటివి జరిగినపుడు అందరూ నిపుణులే...
2018లో ఒక ప్రముఖ న్యూస్ చానల్ ‘మరణానికి దారి తీసిన బాత్ టబ్’ అనే హెడ్ లైన్‌తో ఒక వార్తని ప్రసారం చేసింది. నటి శ్రీదేవి ఎలా మరణించి ఉంటారో వివరించడానికి ఒక రిపోర్టర్ బాత్ టబ్ దృశ్యాన్ని చిత్రీకరించారు. రిపోర్టింగ్‌ని సెన్సేషన్‌లా చేసి, వాస్తవాలతో పని లేకుండా, నాటకీయత, అర్ధం లేని విశ్లేషణలను గుప్పించి మరీ చూపించారు.

 
సమాజంలో ప్రముఖులు అసాధారణంగా మరణించినప్పుడు ఇలా జరగడం ఇదేమి మొదటిసారి కాదు. ఇలాంటి సమయాల్లో అందరం క్షణాల్లో నిపుణులుగా మారిపోతాం. మరణించిన వారి మీద మనం చేస్తున్న ఊహాగానాలు నిజమో కాదో చెప్పడానికి వారు బతికి ఉండరు.

 
సినీ నటి శ్రీదేవి మరణానికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలు రావడానికి ముందే ఆమె మరణం గురించి వదంతులు ప్రచారం అవ్వడం మొదలుపెట్టాయి. కొంత మంది ఆమె భర్త మొదటి భార్య మరణానికి శ్రీదేవి మరణానికి మధ్య ఉన్న కర్మ సంబంధం గురించి కూడా మాట్లాడటం మొదలుపెట్టారు.

 
బోనీ కపూర్ మొదటి భార్య ఆమె కొడుకు సినిమా విడుదలకు ముందే మరణించడానికి, శ్రీదేవి ఆమె కూతురు సినిమా విడుదలకు ముందే మరణించడానికి మధ్య ఏమన్నా సంబంధం ఉందా అని ఒక రచయత ప్రశ్నించడం కూడా నేను విన్నాను. ఆమె ఎప్పటికీ యవ్వనంతో ఉండటానికి సర్జరీలు చేయించుకున్నారని, ఒత్తిడికి గురయ్యారని, ఇలా రకరకాల ప్రచారం మొదలైపోయింది. ఇవన్నీ రాయడానికి కొంతమంది అధిక గంటలు పని కూడా చేశారు.

 
సుశాంత్ మరణం పట్ల, అతని వ్యక్తిగత జీవితం పట్ల జాతీయ ఆసక్తి ఏమిటో నాకర్ధం కాలేదు. అందరి ప్రముఖుల లాగే అతనికి కూడా నివాళి అవసరం. కానీ, అతని జీవితాన్ని తరచి తరచి చూసే హక్కు ఎవరికీ లేదు. అతని జీవితాన్ని చూడటానికి అతని మరణాన్ని అవకాశంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీడియా వాస్తవాలకు దూరంగా ఎప్పుడో పారిపోయింది.

 
బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది...
సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్పినప్పటికీ అతని మరణంపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కానీ, అతని మరణాన్ని సెన్సేషన్ చేయడానికి ఇంకా ఏమైనా వివరాలు తెలుస్తాయేమోననే పనిలో అతనికి తెలిసిన నటీనటులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాం.

 
ఎందుకంటే తర్వాత వచ్చే నంబర్లతో మన గొప్పతనాన్ని చాటుకోవడానికి మనం ఎక్కువ తపన పడతాం. ఎవరూ పట్టించుకోని బాధకి ఫలితమే ఆత్మహత్య అని ఎవరూ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఆత్మహత్య చేసుకోవడం పిరికితనమని, చట్ట వ్యతిరేకమని మీడియా వ్యక్తులు కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. కానీ, భారతదేశంలో ఆత్మహత్యకు పాల్పడటాన్ని 2018లో క్రిమినల్ నేరాల నుంచి తొలగించారు. బహుశా ఈ సమాచారం వారికి తెలిసి ఉండదు.

 
ఆత్మహత్యలు చేసుకోవడానికి మీడియా కూడా కొంత పాత్ర పోషిస్తుందని కొంత మంది ఆత్మహత్య నివారణ నిపుణులు అన్నారు. ఆలోచనాత్మక రిపోర్టింగ్ ద్వారా ఇలాంటి వాటిని నివారించవచ్చని మానసిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 
ప్రదర్శనాత్మక రిపోర్టింగ్ చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి వార్తలను రాస్తున్నప్పుడు, ప్రచురిస్తున్నప్పుడు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచాన్ని కోవిడ్ వణికిస్తున్న తరుణంలో చాలా మందిలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. చాలా మంది నిర్లక్ష్యానికి గురైనట్లు భావిస్తున్నారు.

 
చాలామంది మానసికంగా బలహీనంగా ఉన్న ఈ సమయంలో ఇలాంటి వార్తలు మరింత మందిలో ఇదే ఆలోచనని కలిగించే అవకాశం ఉందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు రాస్తున్నప్పుడు మీడియా అనుసరించాల్సిన నియమావళి ఉంది. ఇలాంటి వార్తలను ప్రసారం చేసే సమయం, ఆత్మహత్య చేసుకున్న విధానాన్ని విశ్లేషించకుండా ఉండటం, మరణించిన వారి గురించి సానుకూల భావజాలంతో మాట్లాడటం చేయడం లాంటి కొన్ని నియమాలు పాటించాలి.

 
ఆత్మహత్యల గురించి రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు పాటించాల్సిన నియమాలు:
ఆత్మహత్యల గురించి హెచ్చరికలను జత చేయాలి
ఆత్మహత్య ఒక విపత్తు వలన సంభవించిందనే సందేశాన్నివ్వాలి..
ఆశాభావం పెంపొందేలా సందేశాలు ఇవ్వవచ్చు.
ఎలా చనిపోయారో వివరించనవసరం లేదు.
హెడ్ లైన్లలోనూ, టీజర్‌లలోనూ సెన్సేషన్ లేకుండా చూసుకోవాలి.
మరణించిన వ్యక్తి శాంతియుతంగా, నవ్వుతూ ఉన్నప్పటి చిత్రాలనే వాడాలి. బాధని ప్రేరేపించే చిత్రాలు వాడకూడదు.
ఆత్మహత్యకు దారి తీసే పరిస్థితులను నెమ్మదిగా చర్చించాలి.
నిపుణుల సలహాలను జోడించాలి.
ఆత్మహత్యలను నివారించగలమనే సందేశాన్ని ఇవ్వగలగాలి.
మానసిక వైద్యుల సహాయంతో ఆత్మహత్యకి దారి తీసే పరిస్థితులను నివారించవచ్చని చెప్పగలగాలి.
ఆత్మహత్యల వలన వచ్చే అనర్ధాల గురించి హెచ్చరికలు ఉండాలి.
ఆత్మహత్య జరిగిన ప్రదేశం గురించి వివరాలు ఇవ్వకూడదు.
జాతీయ ఆత్మహత్యల నివారణ హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వాలి.
హెచ్చరిక లేకుండా ఆత్మహత్యకి సంబంధించిన సమాచారం ప్రచురించవద్దు.
ఆత్మహత్యలకు సంబంధించిన పత్రాల వివరాలను బయట పెట్టవద్దు.
మానసిక నిపుణులు సూచించిన భాషని వాడాలి.
ఆత్మహత్యకి గల కారణాలను విశ్లేషించవద్దు.
ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయనే సందేశాన్ని ఇవ్వకూడదు.
మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్: 08046110007

- చింకి సిన్హా
బీబీసీ ప్రతినిధి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశానికే ఆదర్శంగా నిలిచిన ధారావి మురికివాడ... ఏ విషయంలో?