Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు రద్దు, ఆదివారం కూడా క్లాసులు - BBC Newsreel

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు రద్దు, ఆదివారం కూడా క్లాసులు - BBC Newsreel
, సోమవారం, 18 జనవరి 2021 (19:21 IST)
లాక్ డౌన్ ఆంక్షల అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ జూనియర్ కాలేజీలలో ఆఫ్ లైన్ క్లాసులు ప్రారంభించారు. ఇంటర్మీడియట్‌తో పాటుగా పదో తరగతి విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలోక్లాసులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది మార్చిలో కాలేజీలు మూతపడ్డాయి. తర్వాత జులైలో వార్షిక పరీక్షలు నిర్వహించారు. అక్టోబర్ నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్ లైన్లో క్లాసులు ప్రారంభించారు.

 
ఇక ప్రస్తుతం ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయ. దానికి అనుగుణంగా 2020-21 విద్యాసంవత్సరం షెడ్యూల్ లో ఇంటర్మీడియట్ బోర్డ్ పలు మార్పులు చేసింది. అందులోభాగంగా ఏపీలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.

 
ఇంటర్‌ ప్రథమ సంవత్సర తరగతులు కూడా సోమవారం నుంచే ప్రారంభించారు. ఇంటర్‌ బోర్డు సవరించిన వార్షిక క్యాలెండర్‌ ప్రకారం 106 పని దినాలు ఉంటాయి. మే 31 వరకూ తరగతులు జరుగుతాయి. రెండో శనివారం కూడా కళాశాలలు నడుస్తాయి. వేసవి సెలవులను కూడా రద్దు చేశారు. 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్‌ 3వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

 
అదే విధంగా పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి. వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పీరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20గంటల వరకూ తరగతులు జరుగుతాయి.

 
జాతీయ, ఇతర పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం ఒక పూట ఒక సబ్జెక్టులో మాత్రమే తరగతులు జరుగుతాయని విద్యాశాఖప్రకటించింది. అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి క్లాసులు సోమవారం నుంచి మొదలయ్యాయి.

 
కరోనా పరిస్థితుల్లో విద్యాసంవత్సరం రద్దు చేయాలనే వాదన కూడా వినిపించింది. కానీ విద్యా సంవత్సరాన్ని రద్దు చేస్తే, విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందికరమని భావించి తొలుత ఆన్ లైన్ క్లాసులతో ప్రారంభించి, ఇప్పుడు పరిస్థితి సర్దుమణగడంతో ఆఫ్ లైన్ క్లాసులు ప్రారంభించామని మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రేలియాలో కొత్త వైరస్.. రొయ్యలు, పీతలు చచ్చిపోతున్నాయ్!