Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారంలో ఆరు రోజులు సబ్‌రిజిస్ట్రార్, ఆదివారం వ్యవసాయ కూలీ

వారంలో ఆరు రోజులు సబ్‌రిజిస్ట్రార్, ఆదివారం వ్యవసాయ కూలీ
, మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (15:07 IST)
వరంగల్ నుంచి ఏటూరునాగారం వెళ్లే దారిలో ములుగు కంటే ముందు జాకారం అనే ఊరు వస్తుంది. హైవేను ఆనుకుని ఉన్న ఆ ఊరు దాటి ఓ రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్తే ఎటుచూసినా పచ్చటి వరి పొలాలు. దూరంగా నల్లటి కొండలు కనిపిస్తాయి.

 
ఆ వరి చేలల్లో కలుపు తీస్తున్నారు కొందరు మహిళలు. చీరలకు మట్టి అంటకుండా పైన పాత చొక్కాలు వేసుకున్నారు. పొద్దున్న ఏడు గంటలకే చేలోకి దిగారు. మధ్యాహ్నం ఎండ పెరగక ముందే పని ముగించాలని తాపత్రయపడుతున్నారు. పని అలసట తెలియకుండా కబుర్లు చెప్పుకుంటూ చాళ్ల మధ్య కలుపు తీస్తున్నారు. వారి మధ్య ఒక మహిళ మాత్రం అందరి కంటే కాస్త ఎక్కువ చెమటలు కక్కుతూ కనిపిస్తున్నారు. దానికో కారణముంది.

 
మిగతా కూలీలందరికీ అది రోజూ చేసే పనే. వారికి అలవాటు. కానీ, ఆమె మాత్రం వారానికోసారే కూలికి వెళ్తారు. అందుకే మిగతా వాళ్లంత చురుగ్గా కాకుండా, ఆమె కాస్త నెమ్మదిగా చేస్తున్నారు. అలాగని తక్కువ పనేం చేయడం లేదు. ఓ పది నిమిషాలు అటుఇటుగా పని పూర్తి చేసేశారు ఆమె కూడా.

 
మధ్యాహ్నం దాదాపు ఒంటిగంట అయింది. కలుపుతీత కూడా అయిపోయింది. వాళ్లతో పాటూ పనిచేసిన పొలం యజమాని రూ.250 కూలీ ఇచ్చారు. అందరూ తమ తమ కూలిని చీర కొంగుల్లో దాచుకున్నారు. కానీ, వారానికోసారి పనికి వచ్చే ఆమె కూడా ఆ కూలి డబ్బు తీసుకున్నారు. మిగతావారిలా ఆమె చీరలో దాచుకోనక్కర్లేదు. ఆవిడకు హ్యాండ్ బ్యాగ్ ఉంది. అయితే, ఆ రూ.250 ఆమె తన బ్యాగులో వేసుకోలేదు. దానికి, ఇంకొంత మొత్తం కలిపి తనతో పనిచేసిన మరో అమ్మాయికి ఇచ్చేశారు.

 
కూలి డబ్బంతా పక్క వారికే ఇచ్చేయడం కోసం అంత కష్టపడడం ఎందుకు? నిజానికి ఆమెకు ఆ డబ్బు అక్కర్లేదు. పచ్చటి చేలో పనిచేసే ఆ మహిళ సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేస్తున్నారు. ఆమె పేరు తస్లీమా మహమ్మద్. మరి, సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేసే మహిళకు ఎండలో చెమటలు కక్కుతూ కూలి పని చేయాల్సిన అవసరం ఏముంది?. ''నేను రైతు కుటుంబం నుంచి వచ్చా. ఆ కష్టాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని... రైతులు, ముఖ్యంగా రైతు కూలీల విలువ అందరికీ చెప్పాలని ఇలా చేస్తున్నాను'' అంటారు తస్లీమా.

 
ఎలా మొదలైంది?
మంచి ఉద్యోగం వచ్చినా తస్లీమా తన మూలాలు మర్చిపోలేదు. 2015లో ఒక సందర్భంలో స్నేహితులతో కలసి టూర్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఒక పొలంలో సరదాగా దిగారు. మిగతా వారిలా కాకుండా, ఓ రెండు మూడు గంటలు పనిచేశారు. తోటి వారు ఆశ్చర్యపోయారు. 'నువ్వు పొలంలో అంత సేపు పనిచేయగలవా' అన్నారు. 'అవును నేనూ రైతు బిడ్డనే' అని జవాబిచ్చారు తస్లీమా.

 
ఆ ఘటన ఆమెకు కొత్త ఆలోచన తెచ్చింది. రైతులు, కూలీల కోసం ఏదైనా చేయాలి అనుకున్నారు. అలాగే, పొలం పని చేస్తూ ఉండాలని నిర్ణయించుకున్నారు. ''ప్రభుత్వ ఆఫీసుకు వస్తే చదువుకున్న వారికి గౌరవం ఇస్తాం. అదే రైతో, కూలీయో అయితే 'ఆ చెప్పు' అని మాట్లాడతాం. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారూ అలానే చేస్తున్నారు. రైతు కూలీకి కూడా గౌరవం ఇవ్వాలి అని చాటి చెప్పాలనుకున్నాను. అందుకే ఈ దారి ఎంచుకున్నా'' అన్నారు తస్లీమా మహమ్మద్.

 
ఆమె పని చూసి ఆమెకు దగ్గరైన మిత్రబృందం ఒకటి ఉంది. తమ గ్రామాల్లో ఏ రైతు దగ్గర పని ఉందో తెలుసుకుని ఆమెకు సమాచారం ఇస్తారు. వారి పొలంలో తస్లీమా పనిచేస్తారు. చిన్న కమతాలు, పేద రైతుల దగ్గర కూలీ తీసుకోరు. కూలీ ఇవ్వగలిగిన రైతుల దగ్గర తీసుకున్న డబ్బు తనకోసం వాడుకోరు. ఎవరో ఒకరికి సాయం చేస్తారు.

 
తస్లీమా సొంతూరు ములుగు దగ్గర్లోని రామచంద్రాపురం. తండ్రి మహమ్మద్ సర్వర్. ఆయన ఎంసీపీఐ అనే వామపక్ష పార్టీలో పనిచేసేవారు. తస్లీమా కుటుంబానికి సొంత భూమి ఉంది. అది వేరే వారు కౌలుకు చేస్తున్నారు. 1987లో నక్సలైట్లు ఆయన్ను కాల్చి చంపేశారు. అప్పుడు ఆమెకు రెండేళ్లు. తస్లీమా కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమెస్ట్రీ చదువుకున్నారు.

 
''మేం ఐదుగురు సంతానం. మాకున్న పొలాన్ని సాగు చేస్తూ మా అమ్మ అందర్నీ పెంచింది. మేనమామలు కాస్త సహకరించారు. మేం చదువుకునేప్పుడు అమ్మ కష్టమే గుర్తొచ్చేది. నేను గ్రూప్ 2 కోసం హైదరాబాద్‌లో కోచింగ్ కోసం చేరినప్పుడు వారు ఫీజు రూ.13 వేలు అడిగారు. ఆ రూ.13 వేలు తీసి అమ్మ లెక్క కడుతున్న క్షణాలు నాకింకా గుర్తున్నాయి. అది మాకు చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బులో అమ్మ కష్టం ఉంది'' అని తస్లీమా తన కష్టాలు గుర్తుచేసుకున్నారు.

 
''రెండు నెలలే కోచింగులో ఉన్నాను. ఊరికి వచ్చేసి మరో మూడు నెలలు రోజూ లైబ్రరీకి వెళ్లి నోట్సు రాసుకుని చదువుకున్నాను. నాకు ఉద్యోగం రాక ముందునుంచే వ్యవసాయం చేయాలన్న ఆలోచన ఉండేది. నేను ఏ పరిస్థితిలో, ఏ స్థాయిలో ఉన్నా, తల్లితండ్రులు కష్టాన్ని గుర్తించేలా, వ్యవసాయం చేయాలని అనుకునేదాన్ని'' అని ఆమె అన్నారు.

 
''కూలి చేస్తే నాకు వచ్చే రూ.250 ఇప్పుడు నా పిల్లలకు ఒక చాక్లెట్ ఖరీదు అవుతాయి. మా పొలం వేరే వారు కౌలుకు చేస్తారు. భూమి ఉండడం సమస్య కాదు. అందులో రోజంతా కష్టపడితే వచ్చే ఆ రూ.250 అందుకున్నప్పుడు ఒక తృప్తి ఉంటుంది'' అని ఆమె అంటున్నారు.

 
జీతంలో సగం సేవకే
తస్లీమా ఉద్యోగంలో చేరినప్పటి నుంచీ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా ఆదివాసీలైన కోయ, గుత్తి కోయ కుటుంబాల్లో పిల్లలకు పౌష్టికాహారం, దుస్తులు సరఫరా చేస్తుంటారు. రోడ్లపై అనాథలుగా ఉన్నవారిని చేరదీసి వారిని ఆశ్రమాలకు చేర్చడం వంటివి చేశారు.

 
''గుత్తికోయల్లో అర కేజీ, కేజీ మాత్రమే బరువుండే పిల్లలు ఉంటారు. వారికి పౌష్టికాహారం అందదు. వారికి నావంతుగా సాయం చేస్తున్నాను'' అన్నారు తస్లీమా. ఈ ఖర్చు కోసం ఆమె జీతంలో సగం కేటాయిస్తున్నారు. రెండేళ్ల కిందట తన తండ్రి పేరిట మహమ్మద్ సర్వర్ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేశారు.

 
వరంగల్ నుంచి రోజూ ములుగుకు ఆర్టీసీ బస్సులో వెళతారు తస్లీమా. ''కారు కొంటే రోజుకు వేల రూపాయలు ఖర్చు, ఆ డబ్బు ఆదా చేయవచ్చు. నేను ఏ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చానో, అలానే ఉండాలనుకుంటున్నాను'' అని అన్నారామె. తస్లీమా భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలిద్దరూ మూడు, ఐదు తరగతులు చదువుతున్నారు. తల్లి, అత్త, భర్త సహకారం వల్లే ఇదంతా చేయగలుగుతున్నానని ఆమె చెప్పారు. ''మా సహోద్యోగులూ నన్ను అభిమానిస్తారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు పేరు తెస్తున్నావంటూ మా అధికారులు అభినందించారు'' అన్నారు తస్లీమా.

 
లాక్‌డౌన్‌లో వైరల్
లాక్‌డౌన్‌లో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలసి కొండలలో మూటలు మోస్తున్న తస్లీమా ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో మోటార్ సైకిల్ కూడా వెళ్లని మారుమూల గిరిజన ప్రాంతాలకు నిత్యావసరాలు అందించారు వీరిద్దరు. ''నాకు ముందు నుంచీ గుత్తికోయలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వారి పిల్లలకు అవసరమైనవి పంచుతుంటాను. లాక్‌డౌన్‌లో వారికి చాలా ఇబ్బంది వచ్చింది.

 
ములుగుకు దూరంగా పెనుగోలు అనే గ్రామం ఉంది. అక్కడకు వెళ్లాలి అంటే సుమారు 16 కి.మీ.లు నడవాలి. మూడు వాగులు దాటాలి. ఐదు కొండలు ఎక్కి దిగాలి. వారు వారానికోసారి సంతకు వచ్చి కావల్సిన సరుకులు అన్నీ తీసుకెళ్తారు. లాక్‌డౌన్‌లో వారు కిందకు వచ్చినా ఏమీ దొరకదు. వారికి సరుకులు అందించాలనుకున్నాం'' అని తస్లీమా చెప్పారు.

 
''లాక్‌డౌన్‌లో నేను కొంత ఖర్చు పెట్టాను. కానీ అంతమందికి నిత్యావసరాలు పంచడం నేనొక్కరినే చేయలేను. అదే విషయం ఎమ్మెల్యే సీతక్క గారి దగ్గర ప్రస్తావించాను. ఆవిడ వెంటనే అంగీకరించారు. ఇద్దరం చాలా గిరిజన గ్రామాలకు వెళ్లాం. అసలు ఎవరూ వెళ్లని, వెళ్లలేని, నడక దారి కూడా సరిగా లేని గ్రామాలకు ఆహారం సరఫరా చేశాం'' అంటూ ఆ విషయాలను చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్‌ సమయంలో పట్టణాల నుంచి వచ్చిన యువకులను కూడా పొలం పనులు చేసేలా ప్రోత్సహించానని చెప్పారు తస్లీమా.

 
నాన్నే నడిపించే శక్తి
''మా నాన్నను నక్సలైట్లు చంపేసే సమయానికి నాకు రెండేళ్లు. మా అమ్మ నాకు ఆ వివరాలేవీ చెప్పేది కాదు. మా నాన్న పేదల కోసం తిరిగే వారనీ, మంచి వారనీ, నువ్వూ ఆయనలానే సేవ చేస్తున్నావనీ తెలిసిన వారు అంటుంటారు. అంతే, నాకు తెలుసు. కానీ ఇటీవలే ఆయనకు స్తూపం నిర్మించతలపెట్టారు. ఆ సభలో ఆయనతో పాటూ పనిచేసిన పార్టీ వాళ్లు నాన్న గురించి చెబుతుంటే అప్పుడే ఆయన గొప్పతనం తెలిసింది. నాన్నను ఓసారి నక్సలైట్లు అడవుల్లోకి తీసుకెళ్లి పది రోజులు ఉంచుకుని పంపేశారని అమ్మ చెప్పింది. తరువాత మా ఇంటి దగ్గర పార్టీ (ఎంసీపీఐ) సమావేశం జరుగుతుండగా వచ్చి ఆయన్ను చంపేశారు'' అని తస్లీమా చెప్పారు.

 
''కానీ, నాన్నను చంపిన కొద్దికాలానికే నక్సలైట్లు ఒక కరపత్రం వేశారట. పేదల కోసం పనిచేసే మంచి మినిషిని చంపాం అంటూ వారు పశ్చాత్తాపపడ్డారు అని పార్టీ వాళ్లు నాకు చెప్పారు'' అని ఆమె అన్నారు. ఇప్పుడు తస్లీమా పనిచేస్తోన్న ములుగు కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమే. ''మా నాన్నను తీసుకెళ్లిన అడవులకే నేనూ వెళ్లి అక్కడి వారికి సాయం చేస్తున్నా'' అని తస్లీమా అన్నారు. నక్సలైట్ల మీద కోపం లేదా అని ప్రశ్నిస్తే, లేదు అని బదులిచ్చారు తస్లీమా. వారు మారుతారని ఆశిస్తున్నానని అన్నారు.

 
బురఖా ఎందుకు?
తస్లీమా బయటకు వచ్చినప్పుడు బురఖా వేసుకుని కనిపిస్తారు. 'ఆదర్శ భావాలు చెప్పే మీరు బురఖా ఎందుకు వేసుకుంటున్నారు?' అన్న ప్రశ్నకు... బురఖా వేసుకోమని తనపై ఎలాంటి ఒత్తిడీ లేదని, కానీ సంప్రదాయలను గౌరవించడం కోసమే బురఖా వేసుకుంటానని తస్లీమా జవాబు చెప్పారు.

 
''నా వల్ల మా కుటుంబ సభ్యులకు చెడ్డపేరు రాకూడదని, సంప్రదాయాలను గౌరవించాలని బురఖా వేసుకుంటా. ఆడపిల్ల ఎంత చేసినా, ఏం చేసినా అవి చూడరు. కానీ, సంప్రదాయాలు పాటిస్తుందా లేదా అనేదే చూస్తారు. నా వల్ల నా పుట్టింటికీ, అత్తింటికీ చెడ్డ పేరు రాకూడదు. నాపై ఒత్తిడి లేదు. నా కుటుంబాన్ని ఇతరులు గౌరవిస్తున్నారు. గౌరవించాలి. అందుకే బురఖా వేసుకుంటున్నా'' అని అన్నారు తస్లీమా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తను పప్పుకాడతో కొట్టి చంపేసింది.. తర్వాత అలా డ్రామా చేసింది..