Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్నేక్ ప్లాంట్: ఇంట్లో పెంచుకునే ఈ మొక్కలతో వాయు కాలుష్యం తగ్గుతుందా?

snake plant
, శనివారం, 22 జులై 2023 (21:26 IST)
మనలో చాలా మంది ప్రజలు ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. అయితే, ఇంట్లో మన చుట్టుపక్కల గాల్లోని కలుషితాల గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఉదాహరణకు ఇళ్లు, స్కూల్స్, కార్యాలయాలను శుభ్రంచేసేందుకు, సువాసనలు వెదజల్లేందుకు మనం ఉపయోగించే చాలా ఉత్పత్తుల వల్ల గాలి కలుషితం అవుతుంది. ‘‘ఆరోగ్యకర పరిసరాల్లో ఎలాంటి వాసనా ఉండదు’’ అని ఆల్బెర్టా యూనివర్సిటీలోని పీడియాట్రిక్ పల్మనరీ స్పెషలిస్ట్ అన్నా హిక్స్ చెప్పారు.
 
‘‘మీకు ఏదైనా వాసన వస్తోందంటే. గాలిలో ఏదో రసాయనం కలుస్తున్నట్లే. మంచి వాసన అయినా లేదా చెడు వాసన అయినా.. అదంతా గాలి కాలుష్యమే’’ అని ఆమె వివరించారు. ‘‘ఇంటి లోపల కూడా కాలుష్యం ఎక్కువగానే ఉంటుంది. కానీ, దాని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే మన పొరుగింట్లో ఉండే కాలుష్యం మన ఇంట్లో ఉండే దానికంటే భిన్నంగా ఉంటుంది. అంటే ఏ రెండు ఇళ్లలోనూ పరిస్థితి ఒకేలా ఉండకపోవచ్చు’’ అని హిక్స్ అన్నారు. ఇంట్లోని వాయు కాలుష్యం కాస్త సంక్లిష్టమైనది. దీన్ని నియంత్రించడం కూడా చాలా కష్టం. ఉదాహరణకు రోడ్లపై వాహనాల వల్ల ఉత్పత్తయ్యే నైట్రోజన్ డైఆక్సైడ్ ఇంట్లోని గాల్లో కూడా కనిపిస్తుంది.
 
హై ఎఫీషియన్సీ పార్టిక్యులేట్ ఎయిర్ (హెచ్‌ఈపీఏ) ఫిల్టర్లతో కొంతవరకూ ఉపయోగం ఉంటుంది. కానీ, ఇవి కాస్త ఖరీదైనవి. పైగా ఇవి నడిచేందుకు చాలా విద్యుత్ అవసరం. వీటి ఖర్చులను భరించే శక్తి చాలా మందికి ఉండదు. అందుకే చాలా మంది ఇంట్లో గాలిని శుద్ధి చేసేందుకు మొక్కలను పెంచుతుంటారు. ఇది కాస్త చవకైన విధానం. సాధారణంగా మొక్కలు కార్బన్ డైఆక్సైడ్‌తోపాటు కొన్ని కలుషితాలను శుద్ధి చేయగలవు. అయితే, ఇక్కడ ఆ మొక్కలను పెంచేందుకు ఎలాంటి మట్టి లేదా ఎరువులను ఉపయోగిస్తున్నామనేది కూడా చాలా ముఖ్యం. వాస్తవానికి మొక్కల కంటే ఆ మట్టే ఎక్కువ కలుషితాలను పీల్చుకుంటుందని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది.
 
ఈ విషయంపై 1989లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ఒక అధ్యయనం చేపట్టింది. ఇంట్లో పెంచుకునే మొక్కలు ఫార్మాల్డిహైడ్‌తోపాటు ఇతర వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీవోసీల)లను తొలగించగలవని దీనిలో తేలింది. అయితే, వాస్తవానికి ఆ అధ్యయనం చేపట్టిన పరిస్థితులతో పోల్చినప్పుడు మన ఇంట్లో ఉండే పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఇంట్లో ఆ స్థాయిలో వీవోసీలను తొలగించాలంటే ఒక ‘ఇండోర్ ఫారెస్ట్’నే మీరు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ‘‘దీని కోసం చాలా మొక్కలు కావాలి. వాటికి బాగా ఎండ తగలాలి. అప్పుడు మాత్రమే ప్రభావం కనిపిస్తుంది’’ అని రీడింగ్ యూనివర్సిటీ పరిశోధకురాలు తిజానా బ్లాన్షువా చెప్పారు. కార్బన్ డైఆక్సైడ్ విషయంలోనూ ప్రభావం కనిపించాలంటే మీరు చాలా ఎక్కువ మొక్కలను పెంచాల్సి ఉంటుందని ఆమె వివరించారు.
 
ఎక్కువ పెంచితే సరిపోతుందా?
తిజానాతోపాటు మరికొంత మంది పరిశోధకులు కూడా ఇంట్లో విడివిడిగా మొక్కలు పెంచే కంటే గ్రీన్‌వాల్స్ ఏర్పాటుచేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ గోడలపై ఎక్కువ మొక్కలను పెంచుకోవచ్చు. వీటిపై నుంచి వచ్చేగాలి కాస్త మెరుగ్గా ఉంటుంది. కుండీల్లో పెంచే మొక్కల కంటే ఈ గ్రీన్‌వాల్స్ మెరుగ్గా గాలిని శుభ్రం చేయగలవని తిజానా చెప్పారు. అయితే, వీటిని ఏర్పాటు చేసుకోవడానికి, నిర్వహణకు కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే చాలా మంది మొక్కలను మారుస్తూ తమదైన శైలిలో ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. బిల్డింగ్ కన్సల్టెన్సీ సంస్థ కుండాల్ 2015లో లండన్‌లో కొత్త కార్యాలయానికి మారినప్పుడు ఒక మీటింగ్‌ రూమ్‌ను మొక్కలతో ప్రత్యేకంగా అలంకరించారు. దీనికి గ్రాన్ ల్యాబ్‌ అని పేరుపెట్టారు.
 
కార్యాలయం లోపలి గాలి నాణ్యతపై ఈ మొక్కలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో వీరు గమనించాలని భావించారు. అయితే, ఆ మొక్కలకు అవసరమైనవన్నీ చూసుకోవడం వారికి పెద్ద సవాల్‌గా మారింది. మెకానికల్ వెంటిలేషన్, ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్‌లతో పోలిస్తే ఈ మొక్కలు అంత పెద్ద ప్రభావం చూపడంలేదని వీరి పరిశోధనలో తేలింది. ఆ గదిలోని మూలల్లో కొన్ని పెద్ద మొక్కలు పెట్టారు, గోడలపైనా నాచు లాంటి మొక్కలను పెంచారు. అయితే, ఇవి చూడటానికి ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, కలుషితాలను శుద్ధిచేయడంలో అంత సమర్థంగా పనిచేయలేదు. గాలి నాణ్యతను మెరుగుపరిచే మొక్కల గురించి అడిగేటప్పుడు, మొత్తంగా మొక్కలతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వివరిస్తుంటామని కుండాల్ లండన్ కార్యాలయం అసోసియేట్ డైరెక్టర్ కవితా కుమారి చెప్పారు.
 
‘‘మేం నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండే మొక్కలను సూచిస్తుంటాం. ఇవి కొంతవరకు వీవోసీలను తగ్గించి, ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలవు’’ అని ఆమె అన్నారు. అయితే, మొత్తంగా ఈ ప్రభావం అంత ఎక్కువగా ఉండబోదని ఆమె వివరించారు. ఇలా కొంతవరకు ప్రభావం చూపే మొక్కల్లో స్నేక్ ప్లాంట్ ఒకటి. ఇది చాలా మంది ఇళ్లలో కనిపిస్తుంటుంది. ‘‘చాలా మొక్కలు పగటిపూట కార్బన్ డైఆక్సైడ్‌ను తీసుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఈ మొక్క రాత్రి కూడా ఇలానే పనిచేస్తుంది’’ అని ఆమె అన్నారు. ‘‘చాలా సందర్భాల్లో ఇంట్లోని కలుషితాలను బయటకు పంపించడానికి తలుపులు తెరిచినా పెద్దగా ప్రభావం ఉండదు. అయితే, అదే సమయంలో బయటి కలుషితాలు ఇంట్లోకి రావచ్చు’’ అని ఆమె చెప్పారు.
 
ప్రస్తుతం ఇంట్లో గాలిని శుద్ధిచేసే మొక్కలపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపడుతున్నారు. దీని కోసం కొన్ని మొక్కల్లో బయోఇంజినీరింగ్ ద్వారా మార్పులు చేస్తున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు.. కుందేళ్లలో కనిపించే ‘గ్రీన్ లివర్ ప్రోటీన్’ను ‘పోటోస్ ప్లాంట్స్‌’లో ప్రవేశపెట్టారు. వీటి సాయంతో గాల్లోని క్లోరోఫామ్, బెంజీన్‌ లాంటి కలుషితాలను శుద్ధి చేయొచ్చు. నియోప్లాంట్స్ సంస్థ కూడా ‘పోటో ప్లాంట్స్’లో కొన్ని మార్పులతో వీవోసీలను శుద్ధిచేసేందుకు ప్రయత్నిస్తోంది. వీవోసీలను విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియాను ఉత్పత్తి చేసి, మొక్కల వేళ్లకు వీటిని చేరుస్తున్నారు. అయితే, ఈ మొక్కలు, మట్టి మొత్తాన్ని కలిపి ఓ మైక్రోబయోమ్‌గా చెప్పుకోవచ్చు.
 
అయితే, ఈ కొత్త మొక్కలతో కొంత ప్రభావం కనిపించేటప్పటికీ.. గాలిని శుద్ధిచేసేందుకు మొత్తంగా వీటిపైనే ఆధారపడలేమని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి గాలిని శుద్ధి చేయడంలో ఇంటి లోపలి మొక్కల సామర్థ్యం ప్రస్తుతానికి పరిమితమే. ఇవి ఎయిర్ ప్యూరిఫయర్లతో ప్రస్తుతానికి పోటీ పడలేవు. అయితే, మొక్కలతో కొన్ని ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు మానసిక ఉల్లాసం, సృజనాత్మకత లాంటివి వీటితో మెరుగుపడతాయి. ‘‘మొక్కలతో మన మానసిక ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. కాబట్టి గాలిపై కంటే మెదడుపై ఇవి మంచి ప్రభావాన్ని చూపుతాయి’’ అని కుమారి చెప్పారు. మొత్తంగా చూసుకుంటే ఇంట్లో మొక్కలను పెంచుకోవాలనే వాయు కాలుష్య నిపుణులు చెబుతున్నారు. అయితే, భారమంతా మొక్కలపైనే వేయకూడదని సూచిస్తున్నారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసిన భార్య.. మొదటి భార్య రీల్స్ చూశాడని..?