బంగారం క్యాప్సుల్స్‌ను మల ద్వారంలోకి చొప్పించుకుని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నట్లు 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఓ కథనం రాసింది.
బంగారాన్ని పేస్ట్‌లా మార్చి, నల్లటి టేప్‌తో ఉండలుగా చుట్టి అతడు మలద్వారంలో చొప్పించుకున్నట్లు శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు.
అతడి దగ్గర లభించిన రూ.27,87,400 విలువైన పేస్ట్ బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) హైదరాబాద్ యూనిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నట్లు ముందుగానే సమాచారం అందడంతో, డీఆర్ఐ అధికారులు మాటు వేసి పట్టుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
శనివారం రాత్రి జెడ్డా నుంచి వచ్చిన మరో ముగ్గురు ప్రయాణికుల వద్ద మొత్తం 915.17 గ్రాముల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.