Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎండలు బాబోయి ఎండలు... ఫిబ్రవరిలో ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో?

summer
, శనివారం, 25 ఫిబ్రవరి 2023 (11:51 IST)
ఫిబ్రవరిలో వాతావరణం కాస్త చల్లగానే ఉంటుంది. కానీ బయట చూస్తే ఎండలు మండిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు వణికించిన చలి నేడు కనిపించడం లేదు. ఉదయం ఎనిమిది కాకముందే, ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో అప్పుడే ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలకు చేరుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ముందుముందు ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందో అని జనం భయపడుతున్నారు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ వేసవి చాలా వేడిగా ఉండబోతోందని సూచిస్తున్నాయి వాతావరణ సంస్థల నివేదికలు.
 
సాధారణం కంటే 11 డిగ్రీలు అధికంగా..
సాధారణంగా ఫిబ్రవరిలో ఉష్ణోగ్రత 15 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. కానీ ఇప్పడు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు చేరుకున్నాయి. కార్గిల్‌లో మంచు కరిగిపోతోంది. మార్చిలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఉత్తర, పశ్చిమ భారతదేశంలో సగటున 5 నుంచి 11 అధిక డిగ్రీల ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు గతంతో పోలిస్తే దిల్లీలో 9 డిగ్రీలు, ముంబయిలో 6 డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి. మహరాష్ట్రలోని తీర ప్రాంతాలు , గుజరాత్‌లోని బుజ్‌లో ఇప్పటికే హీట్ వేవ్ అలర్ట్ జారీ చేశారు. దిల్లీలోనూ రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
ఎందుకు ఇలా?
ఎండలు ఎందుకు పెరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏమిటి? గ్లోబల్ వార్మింగ్, యాంటీ సైక్లోన్స్ ఎఫెక్ట్, ఎల్‌నినో, లానినా. ఐఎండీ చెబుతున్న దాని ప్రకారం, దక్షిణ గుజరాత్‌లోని యాంటీ సైక్లోన్ కూడా ప్రస్తుత హీట్ వేవ్‌కి ఓ కారణం. దీని ప్రభావం రాజస్థాన్, పంజాబ్, దిల్లీ , హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్‌పై తీవ్రంగా ఉండబోతుందని ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) చెబుతోంది. మరోవైపు మహారాష్ట్ర, గోవా చుట్టుపక్కల కొంకణ్ తీరం వద్ద వీస్తున్న బలహీనమైన గాలులు కూడా ఈ యాంటీసైక్లోన్‌ను ప్రభావితం చేస్తున్నాయి. జూన్, జులై, ఆగస్టులో భారత్‌లో ఎల్‌నినో పరిస్థితులు కనిపించవచ్చని అమెరికాకు చెందిన వాతావరణ సంస్థ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌వోఏఏ) చెప్పింది.
 
వడగాలులతో...
ఎల్ నినో, లా నినా.. వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్నది సూచిస్తాయి. ఎల్‌నినో అంటే అసాధారణమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అదే లా నినా అంటే చలి గాలులు ఎక్కువగా వీస్తాయి. సాధారణంగా భారత్‌లో ఎల్‌నినో సంవత్సరంలో వర్షపాతం తగ్గుతూ ఉంటుంది. 2018లో దేశంలో చివరగా ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ముప్పు పొంచి ఉండటంతోనే ఫిబ్రవరిలోనే వేడికి జనం అల్లాడిపోతున్నారని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే భూతాపం పెరగడం , భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కుతున్న సముద్ర ఉపరితలాన్ని ఎల్ నినో సంకేతాలుగా భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చి ఆరంభం భరించలేని వేడితో పాటు నుంచే వడగాలులు కూడా మనల్ని చుట్టేయబోతున్నాయి.
 
గ్లోబల్ వార్మింగ్ కూడా
గ్లోబల్ వార్మింగ్ విషయాని వస్తే.. వాతావరణ మార్పుల కారణంగా సాధారణంగా ఇలాంటి హీట్ వేవ్ నాలుగేళ్ల కొకసారి కనిపించవచ్చని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన మరియం జకారియ , ఫ్రెడరిక్ ఒట్టో చేసిన పరిశోధనలో తెలిసింది. హీట్ వేవ్స్ పెరిగేకొద్ది వ్యవసాయం, టూరిజం, మత్స్యకార పరిశ్రమ, ఇలా అనేక రంగాలపై దీని ప్రభావం పడుతుంది. పంటల దిగుబడులు తగ్గిపోతాయి. భూతాపాన్ని ఒకటిన్నర డిగ్రీలు తగ్గించే దిశగా అంతర్జాతీయ సదస్సుల్లో అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
 
ఎండల ప్రభావం
ఎండలు పెరగడం అంటే.. దీని ప్రభావం ఇతర రంగాల మీదా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరిగితే విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి పెరగాల్సి ఉంటుంది. వృద్ధులు, వడదెబ్బ వల్ల మరణాలు వంటివి కూడా పెరగవచ్చు. అనారోగ్య సమస్యలు, గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు, పశువుల మేత, పంటల దిగుబడి తగ్గడం లాంటి అనేక సమస్యలు దీనితో ముడిపడి ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు, పెరిగిన ఉష్ణోగ్రతల వంటి పరిస్థితులు గతంలో పార్టీల భాగ్య రేఖల్ని మార్చేసిన ఉదాహరణలు మనముందు చాలా ఉన్నాయి. ఈసారి వస్తున్న వేసవి.. ప్రజలతో పాటు పాలకులకు కూడా అగ్ని పరీక్ష లాంటిదే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంద్యాల: పెళ్లయిన కూతుర్ని హతమార్చిన తండ్రి