జైళ్లలో రద్దు చేసిన యోగా తరగతులను రష్యా తిరిగి ప్రవేశపెడుతోంది. మత మైనార్టీలను వ్యతిరేకించే వారి నుంచి వచ్చిన ఆందోళనల నేపథ్యంలో జైళ్లలో యోగా తరగతులను కొద్ది కాలం కిందట రద్దు చేశారు.
మాస్కోలోని రిమాండ్ సెంటర్లలో కుండలినీ యోగాను గతేడాది ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఖైదీల్లో కోపతాపాలను, అనారోగ్యాలను నివారించేందుకు యోగా తరగతులు ఉపయోగపడతాయని అప్పట్లో చెప్పారు.
అయితే, ఈ కుండలినీ యోగా తరగతులను నిర్వహించటంపై చట్టబద్ధతను పరిశీలించాలని ప్రభుత్వ న్యాయవాది (ప్రాసిక్యూటర్ జనరల్)ను సెనెటర్ యెలెన మిజులిన కోరారు. ఈ నేపథ్యంలో యోగా తరగతులపై దర్యాప్తు జరిపారు. ఆ సందర్భంగా జైళ్లలో యోగా తరగతుల నిర్వహణను రద్దు చేశారని మాస్కోవ్‌స్కీ కొమ్‌సొమొలెట్స్ వార్తాపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఈ వ్యవహారంపై మాస్కోకు చెందిన విద్యారంగ ప్రముఖుడు, ప్రొఫెసర్ అలెగ్జాండర్ డ్వొర్కిన్ ఒక పత్రాన్ని రచించారు. మైనార్టీ మతాలను 'నియంతృత్వ వర్గాలు'గా పరిగణిస్తూ, వాటి ప్రభావాన్ని వ్యతిరేకించే డ్వొర్కిన్ రచించిన ఈ పత్రంపై రష్యన్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.
ప్రొఫెసర్ అలెగ్జాండర్ డ్వొర్కిన్ రష్యాలో ఒక ప్రభావవంతమైన వ్యక్తి. రష్యాకు చెందిన శక్తివంతమైన సాంప్రదాయ చర్చి ఆధ్వర్యంలో నడిచే ఒక యూనివర్శిటీలో ఆయన బోధిస్తుంటారు. అలాగే మత సంబంధ వ్యవహారాలపై న్యాయ శాఖకు సలహాలు ఇచ్చే మండలికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు.
ఖైదీల్లో కోపతాపాలను, అనారోగ్యాలను నివారించేందుకు యోగా తరగతులు ఉపయోగపడతాయని గతేడాది చెప్పారు. 'సెక్స్ కోరికలు పెరుగుతాయి.. హోమో సెక్సువల్స్ అవుతారు.. నిరాహారదీక్షలు చేస్తారు' హిందూయిజం మూలాలున్న కుండలినీ యోగాతో.. ''నియంత్రించుకోలేనంతగా కామోద్దీపన కలుగజేసే అవకాశం ఉంది.. దీంతో ఖైదీల మధ్య హోమోసెక్స్ సంబంధాలు ఏర్పడతాయి'' అని ప్రొఫెసర్ డ్వొర్కిన్ ఆందోళన వ్యక్తం చేశారని మాస్కోవ్‌స్కీ కొమ్‌సొమొలెట్స్ వార్తాపత్రిక కథనం తెలిపింది.
ఈ పరిస్థితులు భద్రతాపరమైన ఆందోళనలకు కూడా దారితీస్తాయని ఆయన తెలిపారు. ''కొంతమంది గే (స్వలింగ సంపర్కు)లు తమకు ఆహారాన్ని అందిస్తున్నారని భావించిన ఖైదీలు దీనికి నిరసనగా నిరాహారదీక్షలకు దిగే అవకాశం ఉంది'' అని డ్వొర్కిన్ చెప్పారని వార్తాపత్రిక వెల్లడించింది.
అయితే, నైతికత కోసం ప్రచారోద్యమం చేస్తున్న సెనేటర్ మిజులిన, ప్రొఫెసర్ డ్వొర్కిన్‌లు ఇద్దరినీ జైలు అధికారులు నిరాశకు గురిచేశారు. ఖైదీలకు యోగా ఎంతో మేలు చేస్తుందని, పైగా స్వలింగ సంపర్కంతో యోగాకు ఎలాంటి సంబంధం లేదని జైలు అధికారులు నిర్వహించిన అధికారిక పరిశోధన తెలిపింది. జైళ్ల శాఖ డిప్యూటీ ఛీఫ్ వాలెరీ మాక్సిమెన్కో రష్యా ప్రభుత్వ అధికారిక రేడియో గొవొరిట్ మొస్క్వతో మాట్లాడుతూ.. యోగా చేసే ఖైదీలకు తక్కువ వైద్య సహాయం అవసరమవుతోందని, వీళ్లలో ఎవ్వరూ యోగా వల్ల స్వలింగ సంపర్కులు కావటం లేదని చెప్పారు.
''ఒకవేళ వారిలో ఎవరైనా స్వలింగ సంపర్కులు ఉన్నప్పటికీ, మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రతి ఒక్కరూ, చట్టానికి లోబడి.. తమదైన మార్గం ఎంచుకునేందుకు హక్కు ఉంది'' అని ఆయన తెలిపారు. అలాగే, అమెరికాలో చదువుకున్న ప్రొఫెసర్ డ్వొర్కిన్ గురించి మాక్సిమెన్కో విమర్శలు చేస్తూ, ఆయనొక ''వింత క్యారెక్టర్.. బూజుపట్టిన సిద్ధాంతాలతో కాలం గడుపుతుంటారు'' అని అన్నారు.
రష్యాలో స్వలింగ సంపర్కం చట్టబద్ధమే. అయితే, 2013లో స్వలింగ సంపర్కం గురించిన విద్యపైన, స్వలింగ సంపర్క జీవితం గురించి సానుకూలంగా అభివర్ణించటంపైన క్రూరమైన ఆంక్షలు విధిస్తూ చట్టం చేశారు. ఈ చట్టాన్ని రూపొందించింది సెనేటర్ మిజులిన. ‘హోమో సెక్సువల్ ప్రచారం’ను రద్దు చేస్తూ 2013లో ప్రవేశపెట్టిన చట్టాన్ని రూపొందించారు సెనేటర్ మిజులిన. కాగా, తన లేఖపై ప్రజల నుంచి ఎదురవుతున్న అవహేళనల నేపథ్యంలో మీడియా రాతలు 'తప్పుడు వార్తలు' అని మిజులిన అన్నారు.
యోగాను రద్దు చేయాలని తాను లేఖలో డిమాండ్ చేయలేదని, ఈ తరగతుల నిర్వహణ చట్టబద్ధతను పరిశీలించాలని మాత్రమే ప్రభుత్వ న్యాయవాదిని కోరానని కొమ్సొమొల్సకయ ప్రవ్డ పత్రికతో అన్నారు. ''ఒక రష్యా పౌరుడి విజ్ఞప్తికి స్పందించి పార్లమెంటు సభ్యురాలిగా నేను నా పని చేశాను'' అని ఆమె చెప్పారు. తాను మరొక లేఖ రాయాలనుకుంటున్నానని తన విమర్శకులకు ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఈసారి.. రష్యాలో కొత్తగా ప్రవేశపెట్టిన తప్పుడు వార్తలకు వ్యతిరేక చట్టాన్ని జర్నలిస్టులు అతిక్రమిస్తున్నారేమో చూడాలని మీడియా వ్యవహారాలను చూసే అధికారిక సంస్థను కోరతానని చెప్పారు.