Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్, కోవిడ్ జాగ్రత్తల మధ్య ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్, కోవిడ్ జాగ్రత్తల మధ్య ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు
, గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:02 IST)
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అనేక మలుపుల తరువాత గురువారం 515 జడ్పీటీసీలు, 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగుస్తుంది. ఏజెన్సీ ప్రాంత మండలాలలో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ ముగించి బ్యాలట్ బ్యాక్సులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు.

 
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పోలింగ్ కొనసాగించేలా అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. జెడ్పీటీసీ బరిలో 2092 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో 19002 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 33,636 కేంద్రాలలో పోలింగ్ జరుగుతోంది.

 
డివిజన్ బెంచ్ తీర్పుతో మార్గం సుగమం
పోలింగ్‌కు ముందు రోజు వరకు ఈ ఎన్నికలపై సందిగ్థం నెలకొంది. ఎన్నికల నిర్వహణపై కోర్టులో కేసులు ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, ఎన్నికలను నిలిపేస్తూ అంతకుముందు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టేయడంతో ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.

 
అసలు ఏం జరిగింది
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్‌ విధించలేదంటూ హైకోర్ట్ సింగిల్ బెంచ్ మంగళవారం పరిషత్ ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. దీనిపై ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. బుధవారం జరిగిన విచారణలో ఎస్‍ఈసీ తరఫున న్యాయవాది సి.వి.మోహన్‍రెడ్డి వాదనలు వినిపించారు.

 
28 రోజుల కోడ్ ఉండాలనేది సుప్రీంకోర్టు ప్రత్యేక సందర్భంలో ఇచ్చిందని, ఈ ఎన్నికలకు కోడ్ నిబంధన వర్తింపచేయాల్సిన అవసరం లేదని ఎస్‍ఈసీ వాదించింది. రిట్ పిటిషన్ వేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేయట్లేదని, టీడీపీ తరఫున పిటిషన్ వేయలేదని ఎస్‍ఈసీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఎన్నికల కోడ్‌కి కనీసం, గరిష్ట ఎన్నికల కోడ్ నిబంధన లేదన్న ఎన్నికల సంఘం వాదనతో హైకోర్టు అంగీకరించింది. పరిషత్ ఎన్నికల నిర్వహణకు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 
ఫలితాలు నిలిపివేత
తదుపరి విచారణను కోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది. తుది తీర్పునకు లోబడి ఎన్నికల నిర్వహణ జరగాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 15 తర్వాత కోర్టు తీర్పును అనుసరించి ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో నిండుకుంటున్న కరోనావైరస్ టీకా నిల్వలు - ప్రెస్ రివ్యూ