Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీయూష్ గోయల్: ‘ఏపీ ప్రభుత్వం తన వాటా ఇవ్వలేదు కాబట్టే రైల్వే పనులు ఆగిపోయాయి’ - ప్రెస్ రివ్యూ

పీయూష్ గోయల్: ‘ఏపీ ప్రభుత్వం తన వాటా ఇవ్వలేదు కాబట్టే రైల్వే పనులు ఆగిపోయాయి’ - ప్రెస్ రివ్యూ
, శనివారం, 20 మార్చి 2021 (10:49 IST)
రాష్ట్రంలో వ్యయ పంపిణీ ఒప్పందం కింద చేపట్టిన రైల్వే పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూసేకరణ చేయకపోవడం, తన వాటా కింద రూ.1,636.34 కోట్లు ఇవ్వకపోవడం వల్ల రూ.10,200 కోట్ల విలువైన 841 కిలోమీటర్ల నాలుగు లైన్ల పనులు ఆగిపోయాయని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

 
‘కడప-మడగట్ట మధ్య రైల్వేలైన్‌ గురించి శుక్రవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి గోయల్ సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సమకూర్చక పోవడం వల్ల కడప-బెంగళూరు రైల్వేలైన్‌ నిర్మాణ పనులు ఆగిపోయాయని వెల్లడించారు.

 
దీని పరిధిలోకే కడప-మడగట్ట లైన్‌ వస్తుందని, రూ.3,038 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం 2020 మార్చి వరకు రైల్వేశాఖ రూ.351 కోట్లు ఖర్చుపెట్టిందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 50% ఖర్చును భరిస్తామని 2006లో ఏపీ ప్రభుత్వం చెప్పిందని, ఇప్పటివరకు రూ.132.39 కోట్లు మాత్రమే డిపాజిట్‌ చేసిందని తెలిపారు.

 
ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను సమకూర్చలేదని, దానివల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు స్తంభించి పోయాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా సమకూర్చిన తర్వాతే తదుపరి పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 2020 ఏప్రిల్‌ 1 నాటికి రూ.64,429 కోట్ల విలువైన 32 ప్రాజెక్టుల పనులు ప్లానింగ్‌, అప్రూవల్‌, ఎగ్జిక్యూషన్‌ దశలో ఉన్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. వీటి మొత్తం పొడవు 5,704 కిలోమీటర్లు అని చెప్పారు.

 
రాజ్యసభలో వైకాపా సభ్యుడు పరిమళ్‌ నత్వానీ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత మూడేళ్ల బడ్జెట్‌లో ఏపీ నుంచి వెళ్లే 4 డబ్లింగ్‌, 5 విద్యుదీకరణ ప్రాజెక్టులను చేర్చామని, అనుమతులకు లోబడి వీటి పనులు మొదలవుతాయని చెప్పార’’ని ఈ కథనంలో తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీసీఎస్‌‌ అదుర్స్.. 6 నెలల్లోపు మళ్లీ ఉద్యోగులకు వేతనాలు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి..?