Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇన్సూరెన్స్ చేస్తారు, తర్వాత బీమా డబ్బు కోసం చంపేస్తారు - ప్రెస్ రివ్యూ

Advertiesment
ఇన్సూరెన్స్ చేస్తారు, తర్వాత బీమా డబ్బు కోసం చంపేస్తారు - ప్రెస్ రివ్యూ
, బుధవారం, 3 మార్చి 2021 (12:31 IST)
బీమా చేసి, తర్వాత ఆ బీమా డబ్బు కోసం వారిని చంపేసే మాఫియా ఆగడాలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగాయని ఈనాడు దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. మారుమూల గిరిజన తండాల్లో అనారోగ్యంతో బాధపడుతున్నవారిని గుర్తించి వారి పేరుతో ప్రీమియం కట్టి అనంతరం బీమా డబ్బుల కోసం హత్య చేసి ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్న ముఠా దందా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించిందని నల్గొండ పోలీసులు గుర్తించారు.

 
ముఠా సభ్యులు ఏడేళ్ల నుంచి దామరచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దాచేపల్లి, మాచర్ల, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో పదిమందిని ఇలా హత్య చేసినట్లు తెలిసిందని ఈనాడు రాసింది. ఈ ముఠాలో దామరచర్ల మండలానికి చెందిన ఓ ఏజెంటుతో పాటు మాచర్లకు చెందిన ఏజెంటు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఈ దందాతో సంబంధం ఉన్న 20 మంది నిందితులను నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

 
ఇందులో మరిన్ని విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తున్నట్లు సమాచారం. మంగళవారం 'ఈనాడు'లో 'బీమాసురులు' శీర్షికతో ప్రచురితమైన కథనం ఆధారంగా నిందితులను విచారించగా.. పత్రికలో వచ్చిన అన్ని విషయాలను వారు అంగీకరించారని కేసు విచారణలో కీలకంగా ఉన్న ఓ అధికారి వెల్లడించడం గమనార్హం. ఈ ముఠా తొలుత 2013లో గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వ్యక్తిని హత్య చేయగా అక్కడి పోలీసులు బీమా కోసమే ఇలా చేశారని తేల్చారు.

 
దీంతో నిందితులు గిరిజన ప్రాంతాలున్న దామరచర్ల, మాచర్ల, ఒంగోలు ప్రాంతాలపై దృష్టి సారించారు. ఒక్క దామరచర్ల మండలంలోనే దాదాపు ఏడుగురిని హతమార్చామని అంగీకరించినట్లు సమాచారం అందిందని ఈనాడు రాసింది. సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో భాగస్వామ్యం ఉన్న వైద్యులు, పోలీసులు, బ్యాంకర్ల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు.

 
మిర్యాలగూడ, దామరచర్ల మండలాల్లో బీమా ప్రీమియం చెల్లించి ఏడాది లోపే పాలసీలు క్లెయిమ్‌ చేసుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. పలువురు నామినీలను మంగళవారం నల్గొండకు పిలిపించి విచారించినట్లు తెలిసిందని ఈనాడు చెప్పింది. పాలసీ క్లెయిమ్‌లకు ఎఫ్‌ఐఆర్‌, పోస్టుమార్టం రిపోర్టు కీలకం కావడంతో తప్పుడు ఎఫ్‌ఐఆర్‌, పోస్టుమార్టం రిపోర్టు ఇచ్చిన అప్పటి పోలీసులను, వైద్యులను విచారించనున్నట్లు తెలిసింది.

 
మిర్యాలగూడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గతేడాది జరిగిన రెండు అనుమానాస్పద మరణాల్లో వైద్యులు శవ పంచనామా నిర్వహించారు. దీని ఆధారంగా పోలీసులు బాధితులకు ఎఫ్‌ఐఆర్‌ ఇచ్చారు. వాటిలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించడంతో నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ వాటన్నింటినీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారని ఈనాడు వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళను అన్నాడీఎంకేలోకి చేర్చేందుకు బీజేపీ ప్రయత్నాలు!