Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆన్‌లైన్ రమ్మీ: ఈ యాప్‌లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి

Advertiesment
ఆన్‌లైన్ రమ్మీ: ఈ యాప్‌లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి
, మంగళవారం, 17 నవంబరు 2020 (14:14 IST)
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు... పేకాట ఆడుకోవచ్చు. ఆ పేకాటకో, ఇంకేదైనా అవసరానికో డబ్బు కావాలనుకుంటే ఏ ష్యూరిటీ లేకుండానే వెంటనే అప్పు కూడా పొందవచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి వచ్చేసిన సేవలు ఇవీ... ఇలాంటి ఆన్‌లైన్ పేకాట, మనీ లెండింగ్ యాప్‌లు మనుషుల ప్రాణాల మీదకూ వస్తున్నాయి. వీటి కారణంగా విశాఖపట్నంలో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

 
విశాఖపట్నంలో నేవల్ డాక్ యార్డ్ ఉద్యోగి మద్దాల సతీశ్ నవంబర్ 15న రైలు పట్టాలపై ప్రాణాలు వదిలారు. ఆన్‌లైన్ పేకాటలో భారీగా డబ్బులు పోగొట్టుకోవడం, దీనికి కుటుంబ కలహాలు తోడవడం ఈ ఆత్మహత్యకు కారణాలని ప్రాథమికంగా భావిస్తున్నట్లు గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు బీబీసీతో చెప్పారు. ఆన్‌లైన్ పేకాటలో దాదాపు 25 లక్షల రూపాయల వరకూ సతీశ్ పోగుట్టుకున్నారని పోలీసులు అన్నారు. 

 
సతీశ్‌ది గోపాలపట్నం శివారుల్లని కొత్తపాలేం. ఆయనకు భార్య ప్రత్యూష (28), కూతురు సాయి మోక్షిత(6) ఉన్నారు. రెండు వారాల క్రితం విశాఖపట్నానికే చెందిన ఆహ్లాద ఆత్మహత్య చేసుకున్నారు. ఎంబీఏ చదివి ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఆహ్లాద ఇంటి అవసరాల కోసం తల్లిదండ్రులకు తెలియకుండా వివిధ మనీ లెండింగ్ యాప్స్‌లో 40 వేల రూపాయల వరకూ అప్పు తీసుకున్నారు.

 
గడువు తేదీ దాటిపోయినా వాటిని తీర్చలేకపోయారు. దీంతో ఆయా యాప్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి ఆమెకు ఒత్తిడి మొదలైంది. వీటిని తాళలేక ఆహ్లాద ఆత్మహత్య (నవంబర్ 3, 2020) చేసుకున్నారు. దీనిపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 
‘నగరాల్లోనే ఎక్కువ’
ఆన్‌లైన్ గేమ్స్, ఆన్‌లైన్ మనీ లెండింగ్ యాప్స్ ఈ రెండింటిలోనూ భారీ వ్యాపారం జరుగుతుంది. ప్రధానంగా నగరాల్లో ఇది మరీ ఎక్కువ. దేశంలో ఈ గేమింగ్ యాప్స్ డౌన్‌లౌడ్స్ 2019తో పోల్చితే 2020లో వంద శాతం కన్నా ఎక్కువ పెరిగాయి. ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఫెడరేషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం 2020 జూన్ నాటికి దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్నారని ఏయూ ఆర్థికశాస్త్ర విభాగ రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రసాదరావు బీబీసీతో చెప్పారు.

 
"అలాగే ఇప్పుడు బ్యాంకులతో పాటు నాన్​బ్యాంకింగ్ ఫైనాన్స్​ సంస్థలు కూడా యాప్​ల ద్వారా అప్పులు మంజూరు చేస్తున్నాయి. నగరాలు, పట్టణాల్లో 20 వేల రూపాయల వరకు జీతం సంపాదిస్తున్న వాళ్లు ఈ మనీ లెండింగ్ యాప్స్ ద్వారా అప్పులు తీసుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. మెట్రో నగరాల్లో మనీ లెండింగ్ యాప్స్‌పై ఆధారపడి అవసరాలు తీర్చుకునేవారు ఎక్కువగా ఉంటారు. యాప్ కంపెనీలు... బ్యాంకుల్లా ఎలాంటి డాక్యుమెంటేషన్, ప్రొసెసింగ్ టైమ్ లేకుండా గంటల్లోనే అప్పులు ఇస్తుండటం కూడా వీటి వైపు జనం ఆకర్షితులవుతున్నారు" అని ప్రసాదరావు వివరించారు.

 
‘విలాసం కోసమూ అప్పులు’
"వ్యక్తిగత రుణాలు, వ్యాపార రుణాలు ఇస్తుంటాం. ఎక్కువ మంది రూ.25 వేల నుంచి రూ. లక్ష వరకు అప్పు తీసుకుంటున్నారు. వీళ్లలో కొందరు వ్యాపారాల కోసం అప్పులు చేస్తున్నారు. మరి కొందరు వస్తువులను కొనేందుకు లోన్లు తీసుకుంటారు. వీరు అప్పుతీసుకునే వారిలో 33 శాతంగా ఉంటారు. ఎక్కువగా మొబైల్ ఫోన్, టీవీ, రెఫ్రిజిరేటర్, టూ వీలర్, కారు, బంగారం లాంటివి కొంటున్నారు. కొందరు సొంత ఖర్చులకి అని చెబుతారు. ఆ సొంత ఖర్చుల్లో ఆన్‌లైన్ గేమ్స్ కూడా ఉంటాయనే విషయం మా ఎగ్జిక్యూటివ్స్ రికవరీకి వెళ్లినప్పుడు తెలుస్తోంది" అని విశాఖలోని బజాజ్ బిజినెస్ లోన్స్ జోనల్ మేనేజర్ శంకర్ చెప్పారు.

 
‘ఫోన్ చేసి చెబుతామని బెదిరిస్తారు ’
అప్రమత్తంగా లేకుంటే ఆన్‌లైన్ యాప్స్, గేమ్స్‌తో ముప్పుతప్పదంటున్నారు ఐటీ రంగ నిపుణులు. "ఆన్‌లైన్ ద్వారా చాలా విషయాలు చిటికెలో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రమ్మీ వంటి గేమ్స్ ఆన్‌లైన్‌లో మనం ఎవరితో ఆడుతున్నామో తెలియదు. అసలు అటువైపు ఉన్నది మనిషో, మెషినో కూడా తెలియదు. చాలా సార్లు మెషిన్లే ఈ గేమ్స్‌ని ఆడుతుంటాయి. మొదట్లో మనం గెలిచినట్లు చేసి... క్రమంగా మనకి అలవాటు చేసి ఆ తర్వాత మన వద్ద నుంచి డబ్బుని లాక్కోవడం మొదలు పెడతారు. ఇదంతా ఒక సైకలాజికల్ గేమ్" ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కళాశాల ఐటీ విభాగం మేనేజర్ డాక్టర్ కాంతి కిరణ్ బీబీసీతో చెప్పారు.

 
"అలాగే మనీ లెండింగ్ యాప్‌ల వాళ్లు డౌన్‌లోడ్ చేసుకుని మన వివరాలు నమోదు చేస్తే అప్పులు ఇచ్చేస్తారు. ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసే సమయంలో మీ ఫోన్ కాంటాక్ట్స్‌ను యాక్సెస్‌ చేయమంటారా? అని కూడా అడుగుతుంటారు. దీన్ని పట్టించుకోకుండా అన్నింటికి ఓకే అనో, యెస్ అనే బటన్లపై క్లిక్ కొడుతుంటాం. దీంతో అప్పుతీసుకున్న వాళ్ల ఫోన్‌లోని నంబర్లన్నీ యాప్‌ యాజమాన్యానికి వెళ్తాయి. అప్పు తీర్చలేకపోయినా... ఆలస్యమైనా మన కాంటాక్ట్ లిస్టులోని నెంబర్లకు ఫోన్ చేసి చెప్తామని వాళ్లు బెదిరిస్తుంటారు. మన డేటా అంతా వారి చేతిలో ఉంటుందనే విషయం మనం మరచిపోకూడదు" అని ఆయన హెచ్చరించారు.

 
‘బానిసలుగా మార్చేస్తాయి’
"చాలా ఆన్‌లైన్ జూదం గేమ్స్ వాటికి మనల్ని బానిసలుగా మార్చేస్తాయి. వాటి అల్గారిథమ్‌ను అలా ప్రొగ్రామింగ్ చేస్తారు. ఒదిలేద్దామని అనిపిస్తుంటుంది. సరే ఈ ఒక్కసారి ఆడితే వచ్చే అవకాశం ఉంటుంది కదా అని అనిపిస్తుంది. దాని డిజైనే అలా చేస్తారు. ఆన్‌లైన్ రమ్మీ వంటివి మాత్రమే కాదు, పబ్జీ, ఫ్రీ ఫైర్ లాంటి అనేక ఆన్‌లైన్ గేమ్స్‌కు ఇదే సూత్రం వర్తిస్తుంది" అని వివరించారు ఐటీ కంపెనీ నిర్వాహకుడు మధుకుమార్.

 
‘‘మనీ లెండింగ్ యాప్స్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన వివరాలు అందిస్తే... ఆ డేటాని వాళ్లు అమ్ముకుంటారు. పెద్ద సంస్థలకి చెందిన యాప్‌లు, నమ్మదగినవి చాలానే ఉన్నాయి. కాకపోతే వీటితో పాటు అనేక నకిలీ యాప్‌లు కూడా ఉన్నాయి. ఇటువంటి యాప్‌లకు మన వివరాలు ఇవ్వడం సరికాదు. నకిలీ యాప్‌లను నిర్వహించేవారు వాటికి సంబంధించిన లింక్‌లను వాట్సాప్‌, టెక్స్ట్‌ మెసేజ్‌గా పోస్ట్‌ చేస్తున్నారు. వీటిని క్లిక్‌ చేస్తే మన వివరాలన్ని వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. వాటి ద్వారా మనకు తెలియకుండానే మన అకౌంట్ల నుంచి లావాదేవీలు చేసేస్తారు. మన వివరాలతో కూడిన డేటాని అమ్ముకోవడం కూడా పెద్ద వ్యాపారమే" అని ఆయన వివరించారు.

 
ప్రముఖుల ప్రమోషన్’
ఆన్‌లైన్ రమ్మీ యాప్‌ల వాళ్లు ప్రమోషన్ కోసం సినీ, క్రీడా ప్రముఖులను పెట్టుకుంటున్నారు. దీంతో జనంలోకి ఇవి బాగా వెళ్తున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల‌ను నిషేధించాలని, వీటిని ప్ర‌మోట్ చేస్తున్న ప్ర‌ముఖుల‌పై క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలని కోరుతూ చెన్నైకి చెందిన సూర్య‌ప్ర‌కాశ్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ఈ ఏడాది నవంబర్ 3న హైకోర్టు విచారణ చేపట్టింది.

 
"మ‌ద్రాస్ హైకోర్టు సెల‌బ్రిటీల‌కు తాఖీదులు జారీ చేసింది. ఆన్‌లైన్ గేమ్స్ వల్ల అనేక మంది భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిసినా ఇలాంటి ప్రకటనల్లో ఎందుకు నటిస్తున్నారో తెలపాలంటూ కోర్టు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 19 లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను ప్ర‌మోట్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌తో క్రికెటర్లు విరాట్ కోహ్లీ, గంగూలీ, సినీ ప్రముఖులు రానా, ప్రకాశ్ రాజ్, సుదీప్, తమన్నాలకు ఈ నోటీసులు పంపించారు" అని సూర్యప్రకాష్ చెన్నైలో మీడియాతో చెప్పారు. అయితే ఈ నోటీసులు అందుకున్నారని చెబుతున్న ఏ ఒక్కరూ ఇప్పటి వరకూ వీటి మీద స్పందించలేదు.

 
‘నిషేధించిన ఏపీ సర్కార్’
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రమ్మీ, పోకర్ లాంటి జూదం, బెట్టింగ్‌ యాప్‌లను నిషేధిస్తూ రెండు నెలల క్రితమే ఏపీ గేమింగ్‌ యాక్ట్‌- 1974కు సవరణలు చేసింది. ఆడేవాళ్లకు ఆరు నెలల జైలు శిక్ష, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, జరిమానా... రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడితే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించాలని నిర్ణయించినట్లు సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు చెప్పారు.

 
మరో వైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయమై కేంద్ర ఐటీ శాఖ మంత్రికి లేఖ రాశారు. ‘‘ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా యువత పెడదోవపడుతున్నారు. అందుకే ఏపీలో వీటిపై నిషేధం విధించాం. ఐఎస్పీలు (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు) గ్యాంబ్లింగ్ యాప్‌లను బ్లాక్ చేసే విధంగా ఆదేశాలు జారీచేయండి" అని ఆ లేఖలో కోరారు.

 
లాక్‌డౌన్‌లో పెరిగిన డౌన్‌లోడ్లు’
"లాక్‌డౌన్‌తో ఉద్యోగం, ఉపాధి కోల్పోయిన వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. అలాగే కొందరు జీతాలందక అప్పులు చేయాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. ఇలా చేసిన అప్పులు తీర్చలేక... ఇంటి అవసరాల కోసమని ఆన్‌లైన్ గేమ్స్‌ని, మనీ లెండింగ్ యాప్స్‌ని నమ్ముకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఈ యాప్‌ల డౌన్ లోడ్లు విపరీతంగా పెరిగాయి. ఆన్‌లైన్ గేమ్స్ కోసం, ఐపీఎల్ బెట్టింగ్స్, షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే యువత ఈ యాప్‌ల ద్వారా అప్పులు చేస్తున్నారు. సరైన అనుమతులు లేకుండా ఆన్‌లైన్‌ క్రెడిట్‌ యాప్స్‌ను క్రియేట్‌ చేసి ఇన్‌స్టెంట్‌ లోన్‌ పేరుతో రుణం ఇవ్వడం రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధం" అని ఎస్‌బీఐ బ్యాంకు ఉద్యోగి ఆనంద్ చెప్పారు.

 
‘ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి’
విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి ఈ గేమింగ్స్, మనీ లెండింగ్ యాప్స్. "నేటి యువత, విద్యార్థులు అంతా టెక్నాలజీ మధ్యే జీవిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో ఉపయోగపడే వాటికంటే... అనర్థాలు తీసుకొచ్చేవే ఎక్కువ. ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగులు, ఫోటో మార్ఫింగ్, పర్సనల్ వీడియోల రికార్డింగ్, ఫేక్ వాయిస్ కాలింగ్ ఇలా ఒక్కటేమిటి చాలానే వీటి ద్వారా చేస్తున్నారు. అయితే నేటి యువత వీటిని సరదా కోసం చేస్తున్నట్లుగా ఉంటున్నారు. కానీ విపరీత పరిణామాలకు దారి తీసినప్పుడే వారి జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్, మనీ లెండింగ్ యాప్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వాలు కూడా వీటిపై అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలు చేయాలి" అని ఏయూ జర్నలిజం విభాగం ప్రొఫెసర్ సి. రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

 
‘ఆత్యహత్యే శరణ్యం కాదు’
ఏపీలో ఇప్పుడు ఆన్‌లైన్ రమ్మీ వంటి గేమ్స్ ఆడటం నేరం. నిమిషాల్లో అప్పులంటూ యాప్‌ల ద్వారా రుణాలు ఇవ్వడం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధమని సైబర్‌ క్రైం పోలీసులు అంటున్నారు. "నిషేధించిన రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ రమ్మీ ఆడకూడదు. ఆటగాళ్ల ఐపీ అడ్రస్‌ చూస్తే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారో తెలుస్తుంది. తెలిసోతెలియకో ఆన్‌లైన్ గేమ్స్ మాయలో పడి డబ్బులు పొగొట్టుకుంటే ఆత్మహత్యలే శరణ్యం అనుకోకండి. మీ కుటుంబం, స్నేహితులతో చర్చించి, అందులో నుంచి బయటపడేందుకు సలహా తీసుకోండి. మీరు ఆడుతున్న గేమ్స్‌లో మోసం జరుగుతుందని తెలిస్తే, పోలీసులకు చెప్పండి. యాప్స్ ద్వారా అప్పులు ఇచ్చిన సంస్థల ఎగ్జిక్యూటివ్స్ వేధిస్తే... మౌనంగా ఉండకండి. కుటుంబ పరువు పోతుందని... సమాజంలో చులకన అయిపోతామని అనుకోకుండా... సమస్యని పోలీసుల దృష్టికి తీసుకురండి" అని విశాఖ సైబర్‌ క్రైమ్‌ సీఐ ఆర్‌వీఎస్‌ చౌదరి సూచించారు.

 
"ఆన్‌లైన్ గేమ్స్, యాప్స్ ద్వారా అప్పులు చేయడం కూడా వ్యసనాలతో సమానం. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలి. ఒకసారి వీటికి అలవాటు పడితే బయట పడటం చాలా కష్టం. కాబట్టి అసలు వాటిని ప్రయత్నించనేకూడదు’’ అని ఆయన అన్నారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

+92, +1, +968, +44 నంబర్లతో ఫోన్ వస్తే అంతే...