Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నరేంద్ర మోదీ: హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌ సంస్థను సందర్శించిన ప్రధాని

Advertiesment
నరేంద్ర మోదీ: హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌ సంస్థను సందర్శించిన ప్రధాని
, శనివారం, 28 నవంబరు 2020 (16:00 IST)
కోవిడ్-19 వ్యాప్తికి కళ్లెం వేసే వ్యాక్సీన్ల అభివృద్ధి ప్రక్రియలను పరిశీలించేందుకు హైదరాబాద్‌లోని భారత్ బయోటిక్, అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటిక్ పార్క్, పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందర్శిస్తున్నారు. భారత్ బయోటెక్ సందర్శనకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ చేరుకున్నారు. భారత్‌లోని తొలి దేశీయ వ్యాక్సీన్ ''కోవ్యాక్సీన్'' ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో కలిసి సంస్థ ఈ వ్యాక్సీన్ అభివృద్ధి చేస్తోంది.

 
అంతకు ముందు ఆయన అహ్మదాబాద్‌లోని జైడస్ క్యాడిలా సంస్థను సందర్శించారు. వ్యాక్సీన్ తయారీ పురోగతి గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ జైకోవ్-డీ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ''కోవిడ్-19పై పోరాటంలో కీలక దశలోకి భారత్ అడుగుపెడుతోంది. భారత ప్రజలకు వ్యాక్సీన్ చేరవేసే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, వ్యూహాల గురించి నేరుగా తెలుసుకునేందుకు ఈ సంస్థలను మోదీ సందర్శిస్తున్నారు''అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ చేసింది.

 
అహ్మదాబాద్‌లోని చంగోదర్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సీన్ టెక్నాలజీ సెంటర్‌లో జైడస్ క్యాడిలా వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేస్తోంది. డిసెంబరులో ఇక్కడ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే అవకాశముంది. ఏప్రిల్ నాటికి ఈ వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని వార్తలు వచ్చాయి. తర్వాత మహారాష్ట్రలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు మోదీ చేరుకుంటారు. పుణెకు చెందిన ఈ సంస్థ.. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ద్వయం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సీన్‌ను ఇక్కడ తయారుచేస్తోంది. ఇది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

 
70 శాతం సామర్థ్యంతో ఈ వ్యాక్సీన్ పనిచేస్తున్నట్లు ఇటీవల విస్తృత స్థాయిలో చేపట్టిన అధ్యయనంలో తేలింది. వ్యాక్సీన్ల అభివృద్ధి పర్యవేక్షణకు సీరం ఇన్‌స్టిట్యూట్‌తోపాటు జెనోవా బయోఫార్మాస్యూటికల్ సంస్థ కార్యాలయాలకు దాదాపు వంద దేశాల రాయబారులు, హైకమిషనర్లు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 
మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది?
భారత్ తయారుచేస్తున్న తొలి దేశీయ కోవిడ్-19 వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుందా? అని చాలా మంది ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. దీనిపై భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడారు. తాము అభివృద్ధి చేస్తున్న ‘‘కోవ్యాక్సీన్’’ మూడో దశ ట్రయల్స్ మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆయన చెప్పారు.

 
‘‘భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా వాలంటీర్లకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వ్యాక్సీన్ సామర్థ్యం(ఎఫికసీ ట్రయల్)పై మేమే తొలిసారిగా పరీక్షలు చేపట్టాం. దీనికి వారెంతో సహాయం చేశారు. అయితే, పరీక్షలు పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది. మేం అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నాం’’అని ఆయన వివరించారు.

 
వ్యాక్సీన్ ఎఫికసీ ట్రయల్‌లో భాగంగా దాన్ని తీసుకున్నవారిలో ఎంతమందికి వ్యాధి తగ్గుతోంది అన్నది పరిశీలిస్తారు. అయితే, జన్యు, జాతి పరమైన అంశాలు దీన్ని ప్రభావితం చేస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే పెద్దపెద్ద ఫార్మా సంస్థలు ఒకేసారి భిన్న దేశాల్లో పరీక్షలు నిర్వహిస్తుంటాయి. రష్యా వ్యాక్సీన్ స్పుత్నిక్ వీని డాక్టర్ రెడ్డీస్, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్ పరీక్షిస్తున్నాయి.

webdunia
దేశీయ వ్యాక్సీన్ ధర తక్కువగా ఉంటుందా?
మరోవైపు రవాణా, కోల్డ్ స్టోరేజీ విషయంలోనూ భారత్‌లో అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయితే, ఈ విషయంలో తమ బృందం ఒక అడుగు ముందుందని కృష్ణ ఎల్లా చెప్పారు. ‘‘ఇంజక్షన్ ద్వారా వ్యాక్సీన్ ఇవ్వడానికి ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా ముక్కులోకి చుక్కల మందులా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఇలా అయితే, అంగన్వాడీ కార్యకర్తలు కూడా సులువుగా అందరికీ టీకాలు ఇవ్వగలరు’’అని ఆయన వివరించారు.

 
మరోవైపు చైనా కూడా ఇలా వినూత్నంగానే ఆలోచిస్తోంది. ముక్కులోకి నేరుగా టీకాను స్ప్రేచేసే విధానాలపై హాంకాంగ్ యూనివర్సిటీతో కలిసి పరిశోధనలు చేస్తోంది. దీంతో ఆరోగ్య సిబ్బందిపై చాలావరకు ఒత్తిడి తగ్గుతుంది. ‘‘ఇక్కడ తయారీ ఖర్చు తక్కువ. అందుకే ప్రజలకు తక్కువ ధరకు టీకా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉదాహరణకు రోటావైరస్ వ్యాక్సీన్‌ తయారీలో మొదటి స్థానం భారత్‌దే. విదేశాల్లో దీని ధర 65 డాలర్లు ఉంటే.. ఇక్కడ ఒక డాలరు మాత్రమే ఉంది. ఒకసారి తయారీ భారీగా మొదలైతే.. ధర క్రమంగా తగ్గిపోతుంది’’అని కృష్ణ చెప్పారు. మరోవైపు తమ వ్యాక్సీన్ అభివృద్ధి అంతా సవ్యంగానే సాగుతోందని క్యాడిలా ఎండీ డాక్టర్ శర్విల్ పటేల్ చెప్పారు. అయితే అంతకుమించి వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ సంచలనం: అత్యాచార నిందితులకు అది కట్..?